బాయిల్డ్ రైస్ కొనబోమని చెబితే.. మరి మా పంట ఎక్కడ దాచుకోవాలి

V6 Velugu Posted on Sep 14, 2021

  • ఉచితంగా ఇస్తారో.. విదేశాలకు ఎగుమతి చేసుకుంటారో.. మా తెలంగాణ పంట కొనాల్సిందే
  • పంజాబ్ లో పండిన పంటనంతా కేంద్రం కొనబోతోంది
  • కేవలం తెలంగాణపైనే కేంద్రం వివక్ష సాగిస్తోంది
  • రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: ‘‘రైతులు నారు పోసి.. పంట సాగు మొదలుపెట్టాక బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం ప్రకటిస్తే.. మరి మా పంట ఎక్కడ దాచుకోవాలి..? ఉచితంగా ఇచ్చుకుంటారో.. విదేశాలకు ఎగుమతి చేసుకుంటారో.. మా తెలంగాణ రైతులు పండించిన పంట కొనాల్సిందే.. పంజాబ్ లో పండిన పంటనంతా కేంద్ర కొనబోతోంది.. మరి కేవలం మా తెలంగాణపైనే ఎందుకు వివక్ష..’’ అని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ధాన్యం కొనుగోలు వివాదంపై కరీంనగర్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బాయిల్డ్ రైసు కొనమిని కేంద్రం చెబితే.. ఏసంగిలో మేము పండించిన పంటనంతా ఎక్కడ దాచుకోవాలని ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్. కోటి 45 లక్షల టన్నుల దిగుబడి ఈ వానాకాలంలో రాబోతుంటే.. కేవలం కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నులే కొంటామని చెబుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. . 
తెలంగాణపై ఎందుకింత వివక్ష... ఈ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగం కాదా అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిశాను, మన దేశం వ్యవసాయక దేశం.. పంట కొనుగోలును ఖర్చు కింద చూడకూదని చెప్పాను, వ్యవసాయంపై చేసే ఖర్చును సామాజిక బాధ్యతగా భావించాలని వివరించానన్నారు. కేంద్రం ప్రతి ఏడు రాష్ట్రాలతో ఓ ఎంఓయూ చేసుకుంటుందని గుర్తు చేస్తూ.. రాష్ట్రాల్లో పీడీఎస్ అవసరాలకు వాడుకోగా మిగిలిన బియ్యాన్ని కొంటామని కేంద్రం గత ఏడాది సెప్టెంబర్ 17న రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఈ అగ్రిమెంట్ ప్రకారం మన దగ్గర 2019-20 ఏసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్.సి.ఐ.కి ఇచ్చామని, 2020-21 ఏసంగిలో 92.32లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైసు మిల్లులకు ఇచ్చామని వివరించారు. కేంద్రం ఎంఓయూ ప్రకారం బియ్యం కేంద్రం తీసుకోవాలి కానీ రైతులు నారు వేసిన తర్వాత.. జనవరిలో మేము బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం ప్రకటించిందని ఆరోపించారు. ఏసంగి వచ్చే దొడ్డు వడ్లన్నీ బియ్యంగా మార్చాలంటే బాయిల్డ్ చేస్తారు.  వర్షాకాలంలో వచ్చే పంటను నేరుగా బియ్యంగా మార్చవచ్చు(రా రైస్), ఏసంగిలో రా రైస్ రావడం కష్టం. ఇక్కడున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఏసంగి పంట నేరుగా బియ్యంగా మారిస్తే విరిగి పోతుంది, ఏసంగిలో బాయిల్డ్ చేసి ఆరబెట్టి మరపట్టిస్తేనే బియ్యంగా మార్చే వీలుంటుంది, బాయిల్డ్ చేయకుండా.. రా రైస్ చేస్తే ఏసంగి పంటలో క్వింటాలు వడ్లకు 40 కిలోల బియ్యం కూడా రావు, నిబంధనల ప్రకారం క్వింటాలుకు క్వింటాలు ధాన్యానికి 67 కిలోల బియ్యం ఎఫ్.సి.ఐకి ఇవ్వాల్సి ఉంటుంది అని వివరించారు. ఎన్నోఏళ్లుగా ఇదే పద్ధతిని రైతులు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. 
మా దగ్గర ఐదేళ్లకు సరిపడా ఉన్నాయని కేంద్రం చెబుతోంది
మా దగ్గర ఇప్పటికే ఐదేళ్లకు సరిపడా బాయిల్డ్ రైసు ఉన్నాయి కాబట్టి.. కేవంల 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటామంటోందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏసంగి పంటకు సంబంధించి  92 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లుల్లో ఉంది,  వీటిని బాయిల్డ్ చేసి బియ్యంగా మారిస్తే 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయి, మరి ఈ బియ్యం అంతా ఎక్కడ పెట్టమంటారు? మళ్లీ కొత్తగా వచ్చే పంటను ఎక్కడ పెట్టమంటారు? ఇలా అయితే మనదగ్గరున్న మిగతా 37 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు కొంటారు? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు వానాకాలం  మరో 55 లక్షల ఎకరాల్లో వరి పంటను తెలంగాణ రైతులు వేసారు, ఈసారి వానాకాలం కోటి 45 మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికి రాబోతోంది, దీనిపై కూడా ఎఫ్.సి.ఐ వీడియో కాన్ఫిరెన్స్ లో మేము 60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామని, 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీ ఇష్టమని చెబుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
ఇంత పంటను గోదాముల్లో నిల్వ చేసే సామర్థ్యం ఏ రాష్ట్రానికి లేదు
రాష్ట్రాల్లో పండిస్తున్న పంటనంతా గోదాముల్లో నిల్వచేసే సామార్థ్యం ఏ రాష్ట్రానికి లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ‘‘కనీస మద్ధతు ధర నిర్ణయిచేంది కూడా కేంద్రమే. గోడౌన్లు, ధాన్యం సేకరణ వంటి బాధ్యతలన్నీ కేంద్రానివే. కేవలం ధాన్యం పండించే వరకే నీళ్లు, పంటసాయం చేసేవరకే రాష్ట్రాలకు అధికారం, బాధ్యత ఉంటుంది. మీడియేటర్ గా ధాన్యం సేకరిస్తుంది. కానీ  కొనుగోలు, రవాణా వంటి బాధ్యతలన్నీ కేంద్రానివే..’’ అని తెలిపారు. గతంలో కూడా వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు.. 2001-02 సంవత్సరంలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రం దగ్గర సర్ ప్లస్ ఉన్నప్పటికీ.. కొనుగోలు చేసారు. ఇప్పుడు కూడా అలాగే కొనాలని డిమాండ్ చేశారు. నాకు తెలిసినంతవరకు పంజాబ్ లో పండిన పంటనంతా కేంద్రం కొనబోతోంది, కేవలం తెలంగాణపై కేంద్రం సాగిస్తున్న వివక్ష ఇది, ఈ రాష్ట్రం భారత దేశంలో అంతర్భాగం కాదా? మా రైతులపై ఎందుకు వివక్ష.? మా రైతులు నాణ్యమైన పంటలు పండించడం లేదా? ఇక్కడున్న రైతుల్లో బీజేపీ కార్యకర్తలైన రైతులు కూడా ఉన్నారు. ఎందుకు మా ధాన్యం కొనరు? ఇలా అయితే మా రైతుల బతుకు అంధకారమవుతుందంటూ మంత్రి గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి కోటి 45 లక్షల టన్నుల ధాన్యం వస్తోంది.. రాజ్యాంగం ప్రకారం ఈ బియ్యం మీరే కొనాలి, మీరు ఉచితంగా పంచిపెడతారా? ఏం చేసుకుంటారో మీ ఇష్టం... కానీ పండించిన ధాన్యమంతా కొనాల్సిందేనని స్పష్టం చేశారు. 
బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా..  ఈ విషయంలో కేంద్రంపై మీరు ఒత్తిడి తేవాలి, మన రైతుల భవిష్యత్తు కోసం మీరు కూడా మాట్లాడాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గత వానాకాలంలో  1.13 కోట్ల ధాన్యం గతంలో పంజాబ్ లో ధాన్యం పండిస్తే బాయిల్డ్ రైసు కొన్నారు కదా.. మా పంట మాత్రం ఎందుకు 60 లక్షల మెట్రిక్ టన్నులే కొంటారు? ధాన్యం సేకరించడాన్ని కేంద్రం సామాజిక బాధ్యతగా చూడాలి,  రైతులకు ముందుగా ఈ విషయం చెప్పిఉంటే మేము ప్లాన్ చేసుకునేవాళ్లమని ఆయన పేర్కొన్నారు. 
 

Tagged Minister Gangula Kamalakar, , karimnagar today, paddy purchasing, minister gangula comments, gangula kamalakar comments, TS state Civil supply Minister, centre discriminating against telangana, boiled rice purchasing

Latest Videos

Subscribe Now

More News