వచ్చే బడ్జెట్ ఎకానమీకి బూస్టింగ్ కావాలె

వచ్చే బడ్జెట్ ఎకానమీకి బూస్టింగ్ కావాలె

వైద్య రంగానికి కేటాయింపులు పెరగాలి

కరోనా మహమ్మారి వైద్య రంగంలోని లోటుపాట్లను ఎత్తిచూపింది. ఈ  పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా పెంచాలి. వైద్య రంగానికి విడిగా ఒక ‘నిధి’ ని ఏర్పాటు చేయడంతో పాటు వైద్య రంగంలో పరిశోధనలకు మరిన్ని నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వైద్య రంగంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం చేయాలి. ప్రస్తుతం జీడీపీలో 1.4 శాతంగా ఉన్న వైద్య రంగ వ్యయాన్ని 2024 నాటికి 4శాతానికి పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం విధించుకున్న లక్ష్యాన్ని అందుకునేలా కేటాయింపులు ఉండాలి. గత బడ్జెట్‌లో కేంద్రం ఆరోగ్య సేవల రంగానికి రూ.67,484 కోట్లు కేటాయించింది. కరోనా ముప్పు వల్ల ఈ కేటాయింపులు చాలలేదు.

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2021-–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​పైనే ప్రస్తుతం అందరీ దృష్టి నెలకొని ఉంది. కరోనా సంక్షోభం కారణంగా అతలాకుతలమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో  పెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంటుందా? కరోనా దెబ్బకు కుదేలైన సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలు ఉంటాయా? వరాలు ప్రకటిస్తారా లేక పన్నులు వడ్డిస్తారా? లాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన తర్వాత మోడీ సర్కార్‌‌కు ఇది తొలి బడ్జెట్‌‌ కావడంతో అటు ప్రభుత్వ, ప్రతిపక్ష, పారిశ్రామిక వర్గాల్లోనే కాకుండా ఇటు సామాన్య ప్రజలు సైతం ఈ బడ్జెట్‌‌పై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇంతకుముందెన్నడూ లేనిదిగా ఈ బడ్జెట్ తయారు చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరికీ కేంద్ర బడ్జెట్‌‌పై ఆశలు, అంచనాలు పెరిగిపోయాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాల పెంపు, అసంఘటిత రంగాలు బలోపేతం చేయడం, మార్కెట్ గిరాకీ పెంచడం, దెబ్బతిన్న అన్ని రంగాలను గాడిలో పెట్టడం, పన్నుల భారం వేయకుండా, జనాల కొనుగోలు శక్తి పెంచేలా నిర్ణయాలు, కేటాయింపులు ఉండాల్సిన కీలక బడ్జెట్ ఇది. మొత్తంగా రాబోయే బడ్జెట్ దేశ ఎకానమీకి వ్యాక్సిన్‌‌లా ఉపయోగపడాలి.

కరోనా సంక్షోభం తర్వాత అన్నీ ఇప్పుడిప్పుడే సెట్ రైట్ అవుతున్నాయి. వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. ఈ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్ ఇచ్చే బాధ్యత కేంద్ర ఆర్థిక మంత్రిపై ఉంటుంది. ఇలాంటి క్రూషియల్ టైమ్‌‌లో పెడుతున్న బడ్జెట్‌‌ తయారీ విషయంలో మంత్రి నిర్మలా సీతారామన్‌‌పై కనిపించని ఒత్తిడి, భారం మాటల్లో చెప్పలేం. కరోనా సమయంలో బాగా దెబ్బతిన్న రంగాలను గాడిలో పెట్టాల్సిన సమయం కావడంతో ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ఎలాంటి నిర్ణయాలు, కేటాయింపులు చేయాలన్నదే చాలా కీలక అంశం. కరోనా కారణంగా దేశంలో  సంఘటిత, అసంఘటిత  రంగాలలో అనేక మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయి కనీసం బతుకు బండిని నడిపించడానికి కూడా చాలా అవస్థలు పడ్డారు. వారికి ఆశాదీపంలా బడ్జెట్ ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.

టూరిజం, రియాలిటీ రంగాలను సెట్ చేయాలె

కరోనా కారణంగా ఎక్కువ దెబ్బపడింది టూరిజంపైనే. ప్రత్యేకించి విమానయానం, హోటళ్ల బిజినెస్‌‌ దారుణంగా దెబ్బతిన్నది. లక్షల మంది నిరుద్యోగులుగా మారారు. ఆ రంగాలను ఆదుకునేందుకు వాటిలో ఈక్విటీ పెట్టుబడులు పెట్టడం, పన్ను రిబేట్లు, పన్ను రాయితీలు  కల్పించడం చాలా అవసరం. అదేవిధంగా భారీ వివాహాల వంటి ఎలాంటి వేడుకలు లేకపోవడంతో ఈవెంట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ రంగం కుంగిపోయింది. ఆ రంగానికి అండగా నిలిచే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాలి. ఉపాధి కల్పనకు మరో ప్రధాన రంగం ‘రియాల్టీ & హౌసింగ్’. దేశంలో అసంఘటిత రంగానికి చెందిన కోట్లాది మంది కార్మికులు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. ఈ రంగానికి ఇప్పటికే ప్రకటించిన పన్ను రిబేట్లు, రాయితీలను మరింతగా పెంచే అంశాలు ఈ బడ్జెట్‌‌లో ఉంటే మేలు. ముఖ్యంగా ఎంఐజీల అర్హత, ప్రిన్సిపల్‌‌, వడ్డీ తిరిగి చెల్లింపు క్రైటీరియా పరిమితులు పెంచితే ఈ రంగంలో డిమాండ్ పెరుగుతుంది. రియాల్టీ, హౌసింగ్ రంగంపై ఆధారపడ్డ సిమెంట్, ఐరన్, పెయింట్ వంటి ఇతర ఉప రంగాలు ప్రభావితమై ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీని ద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జనాలకు పనులు పెరిగితే వాళ్లకు కొనుగోలు శక్తి మెరుగవుతుంది. దీని ద్వారా మార్కెట్‌‌లో డిమాండ్ పెరుగుతుంది.

మీడియం, స్మాల్‌‌ స్కేల్ ఇండస్ట్రీలకు

పారిశ్రామిక రంగంలో ఉపాధి పెంచే ఉద్దీపనాలు ఈ బడ్జెట్‌‌లో ఉండాలని ఆ వర్గాల ప్రతినిధులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ పరిశ్రమ పన్నుల చెల్లింపుల విషయంలో ఒక ఏడాది పాటు  రాయితీలు ప్రకటించాలి. మన దేశంలో 50 % ఎగుమతులు మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ సంస్థల ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి వాటి ఉత్పత్తులపై ఎక్స్‌‌పోర్ట్ ట్యాక్స్ తగ్గించాలి. అలాగే, వాటికి ఇచ్చే సబ్సిడీలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌ఫర్ (డీబీటీ) ద్వారా అందజేయాలి. అదేవిధంగా ‘షేర్ ట్రాన్సాక్షన్ టాక్స్’, ‘కార్పొరేట్ టాక్స్’లను పెంచకుండా ఈ ఏడాది ఉన్నవి ఉన్నట్టు కొనసాగించాలి. కరోనా వల్ల సుమారు 50 కోట్ల మంది తమ ఉపాధిని కోల్పోవలసి వచ్చింది. తద్వారా దేశంలో అన్ని ఉత్పత్తులకూ గిరాకీ తగ్గింది. గడిచిన కొన్ని నెలలుగా జీఎస్టీ వసూళ్లు పెరిగినప్పటికీ, మార్కెట్లో గిరాకీ లేకపోవడంతో పరిశ్రమల టర్నోవర్ పెరగడంలేదు. ఉపాధి అవకాశాలు పెరిగితేనే మార్కెట్లో కొనుకోలు శక్తి పెరిగి గిరాకీ ఏర్పడుతుంది.

ప్రభుత్వ బ్యాంకుల నిధుల కోసం పబ్లిక్ ఇష్యూ

ప్రస్తుతం బీమా, పింఛన్‌‌ విభాగాల్లో 49% వరకు విదేశీ పెట్టుబడులను అనుమతిస్తున్నారు. ఈ రంగంలో ఎఫ్‌‌డీఐలను 75% వరకు అనుమతించాలన్నది దీర్ఘకాల డిమాండ్. ఐఆర్‌‌డీఏ కూడా ఇందుకు ఒకే చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ రంగంలోకి విదేశీ పెట్టుబడులు మరింతగా వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరోవైపు ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో పరిశ్రమలకు కావలసిన ‘వర్కింగ్ కాపిటల్’ను సమకూర్చడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలి. ఈ బ్యాంకులు మూలధన లేమితో ఇబ్బందిపడుతున్నాయి. గతంలో పీజే నాయక్‌‌ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల నిర్వహణకు ఒక హోల్డింగ్‌‌ బ్యాంక్‌‌ ఏర్పాటుపై  కేంద్రం ఆలోచించాలి. అది పబ్లిక్‌‌ ఇష్యూకి వెళ్లి నిధుల సమీకరణ చేసి మూలధన అవసరాలు తీర్చుకోవచ్చు. గతంలో మౌలిక వసతుల రంగానికి నిధులు సమకూర్చిన ఐడీబీఐని బ్యాంకుగా మార్చడంతో ఇన్‌‌ఫ్రా నిధుల కల్పనలో అగాథం ఏర్పడింది. ఆ గ్యాప్‌‌ని పూడ్చేందుకు ప్రత్యేకంగా ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ బ్యాంక్‌‌ ఏర్పాటుకు బడ్జెట్‌‌లో ప్రతిపాదించొచ్చు. అలాగే ప్రభుత్వ బ్యాంకుల్లో మొండి బాకీలు మార్చి నాటికి 12.5 శాతానికి పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. వాటి  నిరోధానికి సంబంధించి కూడా బడ్జెట్‌‌లో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.

పన్నులు పెంపు మంచిది కాదు

ప్రస్తుత పరిస్థితులలో పన్నులు పెంచి ప్రజలపై భారం వేయడం ఏమాత్రం మంచి ఆలోచన కాదు. ట్యాక్సులు పెంచితే మార్కెట్‌‌లో డిమాండ్ పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవాలి. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు పెంచాలి. ముఖ్యంగా కొత్త వ్యవసాయ చట్టాల అమలులో మౌలిక రంగాల పాత్ర కీలకమైనది. అలాగే ఎగుమతి, దిగుమతి సుంకాల విషయంలో లగ్జరీ వస్తువులపై ట్యాక్సులు పెంచవచ్చు. ఆటోమొబైల్, రిటైల్, ఇతర రంగాలపై పన్నుల విధానంలో మార్పులు చేయకపోవడమే మేలు. విద్యా రంగంలో డిజిటల్, ఆన్‌‌లైన్ క్లాసుల నిర్వహణకు కావలసిన మౌలిక వసతులపై కేటాయింపులు ఉండాలి.  కరోనా కష్టాల నుంచి గట్టెక్కేందుకు గత ఏడెనిమిది నెలల్లో ప్రభుత్వం ఐదు భారీ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. రాబోయే కాలంలో ఆ ప్యాకేజీల అమలుకు అవసరమైన నిధులు సమీకరించడం, సంస్కరణలు దృఢచిత్తంతో ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త సంస్కరణలు తీసుకురావడం ప్రతికూల ఫలితాలకు దారి తీయవచ్చు. తిరిగి ఆర్థిక పరిస్థితి పట్టాలెక్కాలంటే కరోనా సంక్షోభం నుంచి బయటపడుతున్న ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు పెంచేవిధంగా, మార్కెట్ గిరాకీ పెరిగే బడ్జెట్ రావాలి. దేశ ఆర్థికవ్యవస్థకు ఈ బడ్జెట్ ఒక వ్యాక్సిన్‌‌లా ఉపయోగపడాలి.– డాక్టర్ రామకృష్ణ బండారు, గెస్ట్ ఫ్యాకల్టీ, కామర్స్ డిపార్ట్‌‌మెంట్, కోఠి విమెన్స్ కాలేజీ, ఓయూ.

ఇవి కూడా చదవండి..

నేటి యువతకు నేతాజీనే స్ఫూర్తి

కెమికల్స్​​ కాదు సేంద్రియమే ఉత్తమం

V6 న్యూస్ రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు