న్యాయ సమీక్షాధికారం... ముఖ్యమైన కేసులు

న్యాయ సమీక్షాధికారం...  ముఖ్యమైన కేసులు

న్యాయసమీక్ష అనే భావనను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. మొదటగా న్యాయసమీక్ష సూత్రాన్ని 1803లో మార్బరీ వర్సెస్​ మాడిసన్​ కేసులో అమెరికా ఫెడరల్​ కోర్ట్​ చీఫ్​ జస్టిస్​ జాన్​ మార్షల్​ ఉపయోగించారు. ప్రభుత్వ అంగాలైన శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలు చేసిన చట్టంలో ఇచ్చిన ఆదేశాలు, వెలువర్చిన తీర్పులు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయో లేదో అని సమీక్షంచే అధికారమే న్యాయసమీక్ష అధికారం. ప్రభుత్వ అంగాల నిర్ణయాలు, చర్యలు రాజ్యాంగానికి లోబడి ఉన్నట్లయితే వాటిని ఇంట్రావైర్స్​ అని వాటిని కొనసాగించారు. ఒకవేళ అవి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్లయితే వాటిన అల్ట్రావైర్స్​ అని కొట్టివేశారు. న్యాయ సమీక్ష అనే పదం రాజ్యాంగంలో ప్రత్యక్షంగా ఎక్కడా పేర్కొనలేదు. కానీ దీని అర్థం మాత్రం వివిధ ఆర్టికల్స్​లో అంతర్లీనంగా ఇమిడి ఉంది. రాజ్యాంగం ప్రభుత్వాంగాలైన నియమితమైన పరిమితులను విధించింది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వ అంగాలు తమ పరిమితులను మీరి ప్రవర్తిస్తాయో, అప్పుడు న్యాయశాఖ ఈ మితిమీరిన చర్యలను (చట్టాలు, ఆదేశాలు, తీర్పులు) రాజ్యాంగ వ్యతిరేకమని గుర్తించి అవి చెల్లుబాటు కాకుండా చూస్తుంది. 

ముఖ్యమైన కేసులు

శంకరీప్రసాద్​ వర్సెస్​ యూఆఫ్​ఐ కేసు(1951): ఈ కేసుకు సంబంధించిన న్యాయమూర్తులు హెచ్​.జి.కానియా (ప్రధాన న్యాయమూర్తి), పతంజలిశాస్త్రి, బి.కె.ముఖర్జీ, సుది రంజన్​ దాస్​, చంద్రశేఖర అయ్యర్. పార్లమెంట్​ చేసిన మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని (1951)ను సవాల్​ చేశారు. ఈ సవరణ రాజ్యాంగంలోని మూడో భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని పిటిషనర్లు వాదించారు. అయితే, పార్లమెంట్​కు ఆర్టికల్​ 368 ద్వారా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే అధికారం ఉందని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. 
సజ్జన్​సింగ్​ వర్సెస్​ స్టేట్​ ఆఫ్​ రాజస్తాన్ (1964): 1964లో పార్లమెంట్​ చేసిన 17వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని ఈ కేసులో వాదించారు. ఈ 17వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజస్తాన్​కు సంబంధించిన భూ సంస్కరణల చట్టాన్ని 9వ షెడ్యూల్​లో చేర్చారు. సుప్రీంకోర్టు శంకరీప్రసాద్​ వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా కేసులో చెప్పినట్లుగానే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్​కు ఉందని పేర్కొంది. 

గోలక్​నాథ్​ వర్సెస్​ స్టేట్​ ఆఫ్​ పంజాబ్​ (1967): ఈ కేసుకు సంబంధించిన న్యాయమూర్తులు (11)– కోకా సుబ్బారావు (ప్రధాన న్యాయమూర్తి), జి.కె.మిట్టర్​, వి.రామస్వామి, సి.ఎ.వైద్యలింగమ్​, ఎస్​.ఎం.సిక్రి, జె.సి.షా, జె.ఎం.షెలాట్​, విశిష్ట భార్గవ, కె.ఎన్​.వాంఛూ, ఎం.హిదయతుల్లా, ఆర్​.ఎస్​.బచావత్​. సుప్రీంకోర్టు గత తీర్పులకు విరుద్ధంగా పార్లమెంట్​కు రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని పేర్కొంది. రాజ్యాంగ సవరణ కూడా ఆర్టికల్​ 13(2) పేర్కొన్న చట్టం అనే పదం పరిధిలోకి వస్తుంది. కాబట్టి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం చెల్లదు అని తీర్పు ఇచ్చింది. 

మినర్వామిల్స్​ వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా కేసు (1980): ఈ కేసుకు సంబంధించిన న్యాయమూర్తులు(5) – వై.వి.చంద్రచూడ్​ (ప్రధాన న్యాయమూర్తి), పి.ఎన్​.భగవతి, ఎ.సి.గుప్తా, ఉంట్వాలియా, పి.ఎస్​.కైలాసం. ఈ కేసులో సుప్రీంకోర్టు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన రెండు నిబంధనలను 368(4), 368(5) కొట్టివేసింది. ఈ రెండు నిబంధనలు మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రకటించింది. రాజ్యాంగ సవరణ అధికారం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత మౌలిక స్వరూప సిద్ధాంతంలోని భాగాలని పేర్కొంది. 

మౌలిక స్వరూప దృక్పథం: రాజ్యాంగ మౌలిక స్వరూప దృక్పథాన్ని సుప్రీంకోర్టు మొదటిసారిగా 1973లో కేశవానందభారతి కేసులో ప్రతిపాదించింది. ఈ దృక్పథం పార్లమెంట్​ రాజ్యాంగ సవరణ అధికారాలపై సమర్థవంతమైన పరిమితులు విధించింది. ఏ మౌలిక సూత్రాలపై ఆధారపడి రాజ్యాంగం రూపొందించబడిందో ఆ మౌలిక సూత్రాలను రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటారు. ఇది రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఉన్న ఒక భాగం కాదు. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ఆధారంగా మౌలిక స్వరూప జాబితాను అవగాహన చేసుకోవచ్చు. కేశవానంద భారతి కేసులో వివిధ న్యాయమూర్తులు కింది పేర్కొన్న విధంగా మౌలిక స్వరూప జాబితాను ప్రతిపాదించారు. చీఫ్​ జస్టిస్ ఎస్​.ఎం.సిక్రీ ప్రతిపాదించిన జాబితాలో రాజ్యాంగ ఔన్నత్యం, గణతంత్ర రాజ్య భావన, ప్రజాస్వామ్య ప్రభుత్వం, లౌకికవాదం, ప్రభుత్వాంగాలను వేరు చేయడం, సమాఖ్య భావన.

జె.ఎం.షెలాట్​, ఎ.ఎన్​.గ్రోవర్​ ప్రతిపాదించిన జాబితాలో ఆదేశిక సూత్రాల్లోని సంక్షేమ రాజ్యభావన, దేశ సమైక్యత, సమగ్రత, దేశ సార్వభౌమాధికారం. జస్టిస్​ కె.ఎస్​.హెగ్డే, ఎ.కె.ముఖర్జీ ప్రతిపాదించిన జాబితాలో భారత సార్వభౌమాధికారం, దేశ సమైక్యత, ప్రజాస్వామ్య స్వభావం, స్వేచ్ఛ హక్కు, సంక్షేమ రాజ్యం. జస్టిస్​ జగన్మోహన్​ రెడ్డి ప్రతిపాదించిన జాబితాలో సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, అవకాశాల్లోను, హోదాల్లోను సమానత్వం.

కేశవానంద భారతి వర్సెస్​ కేరళ రాష్ట్రం కేసు (1973): ఈ కేసులో భాగంగానే గోలక్​నాథ్​ కేసులో పేర్కొన్న అంతర్లీ నమైన అంశాలు, 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని విశ్లేషించారు. 13 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం చీఫ్​ జస్టిస్​ ఎస్​.ఎం.సిక్రీ ఆధ్వర్యంలో తీర్పు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన న్యాయమూర్తులు (13) ఎస్​.ఎం.సిక్రీ (ప్రధాన న్యాయమూర్తి), గ్రోవర్, ఎ.ఎన్​.రే, డి.జి.పాలేకర్​, హెచ్.​ఆర్​.ఖన్నా, జె.ఎం.షెలాట్​, కె.ఎస్​.హెగ్డె, కె.కె.మాథ్యూ, ఎం.హెచ్​.బేగ్​, పి.జగన్​మోహన్​రెడ్డి, ఎస్​.ఎన్​.ద్వివేది, వై.వి.చంద్రచూడ్​. ఈ తీర్పు ప్రకారం పార్లమెంట్​ దేనినైనా సవరించవచ్చును. గానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించకూడదు. న్యాయ సమీక్ష, ప్రాథమిక హక్కుల మూలతత్వం, రాజ్యాంగ ఔన్నత్యం మొదలైనవి రాజ్యాంగం మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.  కేశవానంద భారతి కేసు తీర్పుకు విరుద్ధంగా పార్లమెంట్​ 42వ రాజ్యాంగ సవరణ చేసి కింద పేర్కొన్న అంశాలను పొందుపరిచారు. ఆర్టికల్​ 368(4) ప్రకారం రాజ్యాంగ సవరణలను న్యాయస్థానాల్లో సవాల్​ చేయరాదు. ఆర్టికల్​ 368(5) ప్రకారం రాజ్యాంగ సవరణ అధికారంపై ఎలాంటి పరిమితులు ఉండవు.