
- ఎన్నికల తర్వాత హామీలను ఎట్లా మర్చిపోయారో ప్రజలందరికీ తెలుసు
- బీజేపీ అంటే కేసీఆర్ గజగజ వణుకుతుండు
- అగ్గిపెట్టె మంత్రి రూ.40 లక్షలు ఇయ్యమంటుండు.. ఎందుకియ్యాలె?
హైదరాబాద్, వెలుగు: రాబందు కేసీఆర్ నోట్లో నుంచి దళిత బంధు మాట వస్తే ఎవరూ నమ్మరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత మళ్లీ దళిత బంధు ఊసే ఉండదని చెప్పారు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికలప్పుడు కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చారో, తర్వాత వాటిని ఎట్లా మర్చిపోయారో ప్రజలకు తెలుసని మండిపడ్డారు. అగ్గిపెట్టె మంత్రి (హరీశ్ రావు) రూ.40 లక్షలు ఇవ్వాలని తనను అంటున్నారని, ఎందుకియ్యాలని ప్రశ్నించారు. ‘‘నువ్విచ్చే పది లక్షల రూపాయలు నీ అయ్య సొమ్మా? లేక నోట్లను ముద్రించి ఇస్తున్నవా?’’ అని నిలదీశారు. ఆదివారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో సంజయ్ సమక్షంలో సినీ నటి కరాటే కళ్యాణి, జల్ పల్లి కౌన్సిలర్ యాదయ్య సహా పలువురు సినీ నటులు, ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ మంత్రి విజయరామారావు, మహిళా మోర్చా జాతీయ నేత ఐశ్వర్యా బిశ్వాల్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, రంగారెడ్డి రూరల్ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంజయ్ మాట్లాడుతూ.. ‘‘దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని ఏండ్ల నుంచి హామీలిచ్చి గాలికొదిలేసినవ్. అవన్నీ కలిపితే ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు వచ్చేవి. మరి ఆ డబ్బులెందుకు ఇయ్యవు. ఇవ్వాల్సిందే” అన్నారు.
బీజేపీ దెబ్బకు కేసీఆర్‌కు నిద్ర పడ్తలే
‘‘బీజేపీ అంటేనే కేసీఆర్ గజగజ వణికిపోతుండు. ఏ సర్వే చూసినా బీజేపీనే గెలుస్తుందని ఫలితాలొస్తున్నాయి. అందుకే ఫాంహౌజ్‌లో కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదు. ఏం చేయాలో తెల్వక చివరకు టీచర్లను కూడా సభకు తరలించే నీచమైన పనికి దిగజారిండు” అని సంజయ్ మండిపడ్డారు. ఎన్నికలొస్తే స్కీంలతోపాటు దళితులు, పేదలు కేసీఆర్‌కు గుర్తుకొస్తరని ఎద్దేవా చేశారు. ఎన్నికలయ్యాక అన్నీ గాలికొదిలేస్తారన్నారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు చాలా పవిత్రమైనదని.. క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ, పంద్రాగస్టు ఈ నెలలోనే ఉన్నాయన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాక్షసుల చేతుల్లో తెలంగాణ
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీనే సరైన పార్టీ అని, రాష్ట్రం బీజేపీ చేతుల్లోకి వెళ్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టడం చాలా సంతోషంగా ఉందని, పాదయాత్ర సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని విజయశాంతి తెలిపారు.
ఉత్సవాలకు రండి
తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ సంఘాల నేతలు ఆదివారం సంజయ్‌ని కలిశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. కల్లుగీత కార్పొరేషన్ పాలకవర్గాన్ని ప్రకటించడంతోపాటు రూ. 5 వేల కోట్ల నిధిని కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతి పత్రం అందజేశారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, కల్లుగీత కార్మికులు మరణిస్తే రూ.10 లక్షలు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరారు.
మోడీ నాయకత్వంలో దేశం డెవలప్ అవుతోంది
ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని, దేశ భక్తుల స్ఫూర్తితో ఆయన ముందుకు సాగుతున్నారని సంజయ్ అన్నారు. ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో జరిగిన 75వ స్వాతంత్ర్య వేడుకల్లో సంజయ్ జెండా ఎగురవేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ వ్యవహారాల సహా ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు మనోహర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.