- గాలి దుమారంతో కుప్పకూలిన క్రేన్ ఐదుగురు మృతి
- మరో 11 మందికి తీవ్ర గాయాలు
- రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలోని ఎన్సీసీ లిమిటెడ్‌లో
- ఘోర ప్రమాదం.. మిన్నంటిన బిహార్ వలస కార్మికుల రోదనలు
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, డీసీపీ.. ఆదుకుంటామని భరోసా
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో సోమవారం సాయంత్రం వచ్చిన గాలిదూమారం వలస కూలీల పాలిట మృత్యుపాశంగా మారింది. పని చేస్తున్న కూలీలపై భారీ క్రేన్ కూలి ఐదుగురు మృతి చెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
శంకర్ పల్లి మండలం మహాలింగాపురం పరిధిలోని ‘ఎన్సీసీ లిమిటెడ్’ సెంట్రల్ వర్క్ షాప్‌లో భారీ క్రేన్లు, యంత్రాలు, కన్ స్ట్రక్షన్ మెషీన్ల రిపేర్, సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ స్టోరేజ్, స్టీల్ ఫ్యాబ్రికేషన్, మెటల్ వర్క్స్ చేస్తుంటారు. కార్మికులంతా పనుల్లో నిమగ్నమై ఉండగా సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు వీచాయి.
గాలి ధాటికి అక్కడే ఉన్న ఒక భారీ క్రేన్ అదుపుతప్పి కార్మికుల మీద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బీహార్‌కు చెందిన అలీ హుస్సేన్, నాగేంద్ర సింగ్, సాజీమ్ అక్కడికక్కడే చనిపోగా, ముకేష్ కుమార్, సోను రజిబి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
వారితోపాటు మరో 11 మందికి (జార్ఖండ్, ఒడిశా వాసులు) తీవ్ర గాయాలు కావడంతో మేనేజ్‌మెంట్ అంబులెన్స్‌ను పిలిపించి శంకర్ పల్లిలోని లలిత, గాయత్రీ దవాఖానలకు తరలించారు. వీరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని , పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, డీసీపీ
క్రేన్ కూలిన సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే యాదయ్య, ప్యూచర్ సిటీ కమిషనరేట్ డీసీపీ యోగేశ్ గౌతమ్ ఇతర అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై కంపెనీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గాలి దుమారం కారణంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు.

