పోలీసులు ఎవరికి విధేయులు? రాజ్యాంగానికా.. రాజకీయ నేతలకా? : ఎం. పద్మనాభ రెడ్డి

పోలీసులు ఎవరికి విధేయులు? రాజ్యాంగానికా.. రాజకీయ నేతలకా? : ఎం. పద్మనాభ రెడ్డి

వ్యాపారం కోసం ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్ల మెల్లగా భారత భూభాగంలోని చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోనికి తెచ్చుకుంది. వారు అమలు చేసిన దమన నీతితో దేశంలో సిపాయిల తిరుగుబాటు లాంటి ఘటనలు జరిగాయి. సిపాయిల తిరుగుబాటును అణచివేసిన కంపెనీ.. చాలామంది బ్రిటిష్ సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు లండన్​లోని బ్రిటిష్ ప్రభుత్వం ఇంత పెద్ద దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించలేదని, పాలన మొత్తం తమ ఆధీనంలోనికి తీసుకుంది. అలాగే పాలన కోసం1861లో ఐపీసీ, సీఆర్​పీసీ వంటి చట్టాలు పరాయి పరిపాలనకు అనువుగా ఉండేటట్లు రూపొందాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ చట్టాల్లో మార్పు తేవాలని, కొత్త పోలీసు చట్టం కావాలని, అలాగే పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కావాలని రకరకాల కమిషన్లు వేశారు. కమిషన్ల నివేదికలపై అప్పటి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకొనలేదు. చివరకు సుప్రీం కోర్టు 1996లో మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ బాదల్ వేసిన పిల్​ను విచారించి తీర్పు వెల్లడిస్తూ పోలీసు వ్యవస్థలో సంస్కరణల కోసం ఏడు సూచనలు చేసింది. 

సుప్రీం సూచనలు
1.     రాజకీయ ఒత్తిడుల నుంచి పోలీసు వ్యవస్థను కాపాడడానికి, అలాగే దిశా నిర్దేశానికి ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్​కు రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా హెూమ్ శాఖామంత్రి అధ్యక్షుడిగా, డీజీపీ కార్యదర్శిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జి, రాష్ట్ర హెూమ్ సెక్రటరీ, రాజకీయాలకు సంబంధంలేని, సమాజంలో పేరున్న ఐదుగురు సభ్యులుగా ఉంటారు. వీరు పోలీసు వ్యవస్థకు రాజకీయ ఒత్తిడుల నుంచి రక్షణ ఇవ్వడమేగాక పోలీసు శాఖకు తగిన సలహాలు, సూచనలు చేస్తారు. పోలీసు శాఖ పనితీరును విశ్లేషించి ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర అసెంబ్లీ ముందు ఉంచుతారు.
2.    ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర డీజీపీ ఎంపిక జరగాలి. అలాగే ఆయనకు రెండు సంవత్సరాల కాలపరిమితి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ సూచించిన మూడు పోలీసు ఉన్నతాధికారుల పేర్ల నుంచి ఒకరిని డీజీపీగా నియమించాలి.
3.    రాజకీయ ఒత్తిడులకు తలవంచకుండా అలాగే స్థానిక సమస్యలపై అవగాహన కలిగి, ప్రజలకు న్యాయం చేయడానికి పోలీసుశాఖలో ఐడీ, డీఐజీ, ఎస్పీ, ఇన్​స్పెక్షన్ వంటి ఉద్యోగాల్లో కనీసం రెండేండ్ల వరకు బదిలీలు జరగరాదు. ఈ రెండు సంవత్సరాల గ్యారంటీతో ఆ అధికారి ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లొంగడు. అలాగే స్థానికంగా ఉన్న పరిస్థితులపై సరైన అవగాహనతో చట్టప్రకారం పనిచేయగలుగుతాడు.
4.    ప్రస్తుత పోలీసు శాఖలో ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, బదిలీల్లో జరుగుతున్న అవినీతి, అవకతవకలు అరికట్టడానికి పోలీసు ఎస్టాబ్లిష్​​మెంట్​బోర్డు ఉండాలి. ఈ బోర్డులో డీజీపీ అధ్యక్షతన నలుగురు సీనియర్ పోలీసు అధికార్లు సభ్యులుగా ఉంటారు. వీరు పదోన్నతుల్లో, బదిలీల్లో పారదర్శకతను పెంపొందించి చట్ట ప్రకారం పనులు జరిగేటట్లు చూస్తారు.
5.    కేంద్ర పోలీసు బలగాలలో నియామకాలు, పదోన్నతులు పర్యవేక్షించడానికి జాతీయ భద్రతా కమిషన్ ఏర్పాటు.
6.    పోలీసు సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు విచారించడానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో  పోలీసు కంప్లయింట్ అథారిటీల స్థాపన, జిల్లాస్థాయిలో విశ్రాంత జిల్లా జడ్జి అధ్యక్షతన ఏర్పడ్డ అథారిటీ డీఎస్పీ వరకు వచ్చే కంప్లయింట్లను విచారిస్తుంది. అలాగే రాష్ట్ర స్థాయి అథారిటీ విశ్రాంత హైకోర్టు జడ్జి అధ్యక్షతన ఎస్పీ నుంచి డీజీపీ వరకు వచ్చే కంప్లయింట్లపై విచారణ జరుపుతుంది.
7.    త్వరితగతిన కేసుల విచారణ కోసం, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల సౌకర్యం కోసం నేరపరిశోధన, శాంతి భద్రతల విభాగాలు వేరుగా ఉండాలి. పోలీసు అధికారుల దృష్టి శాంతిభద్రతల సమస్యలు, వీఐపీల టూర్లు, పండగలు వంటి సమయాల్లో ఉండటంతో కేసుల విచారణ మందకొడిగా సాగుతున్నది. నేరారోపణలు రుజువు కావడంలేదు. పోలీసు, జైళ్లు, శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోనివి కావడం వల్ల సుప్రీం కోర్టు సూచనలు చాలా రాష్ట్రాల్లో సరిగా అమలు కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో భద్రతా కమిషన్ ఏర్పాటు కాకపోవడంతో హైకోర్టు సుమోటో కేసు తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదర బాదరగా గత సంవత్సరం భద్రతా కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఇందులో తగిన సభ్యులు లేనందున కమిషన్ పనిచేయడం లేదు. 

ప్రజాప్రతినిధుల కేసులు..

శాసన, పార్లమెంట్ సభ్యులపై ఏండ్లుగా పెండింగులో ఉన్న కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టు తెలంగాణ రాష్ట్రంలో స్థాపితమైంది. తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపీలపై ఉన్న సుమారు 500 కేసులు విచారణ చేయగా రాజకీయనాయకుల ఒత్తిడితో పోలీసువారు కోర్టులో సాక్ష్యులను ప్రవేశపెట్టకపోవడంతో కేవలం10 కేసుల్లో నామమాత్రపు జరిమానా వేయగా మిగిలిన 490 కేసులు కొట్టి వేస్తూ న్యాయమూర్తి పోలీసు సాక్ష్యులను ప్రవేశపెట్టకపోవడంతో కేసు కొట్టి వేయబడుతున్నది అని తీర్పులో చెప్పడం చూస్తుంటే పోలీసు వ్యవస్థపై రాజకీయనాయకుల పట్టు ఎంతగా ఉన్నదో అర్థమవుతుంది. తెలంగాణలో ఉన్నవారికి ఒక చట్టం, లేనివారికి ఒక చట్టం అన్న పద్ధతిలో పాలన సాగుతుంది. ప్రజలతో ఎన్నుకోబడి, ప్రజల మధ్య ఉండాల్సిన రాజకీయ నాయకులకు చుట్టూ పోలీసువారి రక్షణ ఎందుకు ? ఒక మంత్రి ప్రయాణం చేస్తుంటే ముందు, వెనుక ప్రభుత్వ వాహనాలు డజన్లకొద్దీ పోలీసులు ఆయనను వెంబడించడం చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమేనా అనే అనుమానం కలుగుతుంది.

పోలీసు వ్యవస్థ సరిగా పనిచేసి చట్ట బద్ధపాలన జరిగిన, నేడు అసెంబ్లీలో కూర్చునే మన ఎమ్మెల్యేల్లో కొంతమంది చర్లపల్లి జైలులో ఉండేవారు. పోలీసు శాఖలో సచ్ఛీలురు, సమర్థత కలిగిన అధికారులకు కొదవలేదు. అయితే వారి సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతున్నది. గంజాయివనంలో తులసిమొక్కలా వారు గుర్తింపు పొందక ప్రాధాన్యం లేని పదవిలో పనిచేస్తున్నారు. పోలీసు శాఖ నేడు రాజ్యాంగానికి విధేయతగా ఉండాల్సింది పోయి రాజకీయ నాయకులకు విధేయతగా ఉంటున్నది. ఈ పరిస్థితి మారాలి. భ్రష్టు పట్టిన పోలీసు వ్యవస్థ ప్రక్షాళన జరిగి, కొత్త పోలీసు చట్టం తీసుకురావాలి. అందులో ప్రజల మానవాధికారాలు, అలాగే వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అధికారాల రక్షణ, పక్షపాతం లేని నైపుణ్యత గల పోలీసు వ్యవస్థ, సమాజంలోని బలహీన వర్గాల రక్షణ రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా చట్టబద్ధ పాలనతో రాజ్యాంగానికి విధేయులై ఉండేలా ఒక కొత్త పోలీసు చట్టం తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరముంది.

తెలంగాణలో నేతల గుప్పిట్లో పోలీసులు

ప్రతి రాష్ట్రానికి ఒక పోలీసు చట్టం కావాలని సోరాబ్ది కమిటీ 2007లోనే సిఫారసు చేసింది. దాని ప్రకారం కొన్ని రాష్ట్రాలు రాష్ట్ర పోలీసు చట్టాన్ని తీసుకువచ్చాయి. కేరళలో ప్రభుత్వం ముసాయిదా పోలీసు చట్టాన్ని తయారుచేసి ప్రజల ముందు ఉంచి వారి సూచనలు, సలహాలు స్వీకరించి తగిన మార్పులు, చేర్పులతో పోలీసు చట్టాన్ని తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సూచనలు, సలహాలతో ఒక చక్కటి పోలీసు చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాష్ట్రంలో కొత్త పోలీసు చట్టం ముసాయిదా తయారు చేసి, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చట్టం తెస్తామని రాష్ట్రప్రభుత్వం 2007లో సుప్రీం కోర్టుకు తెలిపింది. కానీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు ఏమీ చేపట్టలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ నాయకుల గుప్పిట్లోకి పోయింది. కొన్ని సందర్భాల్లో పోలీసులు, రాజకీయ నాయకులు, నేరస్థులు కలిసి ఎన్నో అక్రమాలకు పాల్పడిన సంఘటన నయీం కేసుతో అర్థమవుతున్నది. ప్రభుత్వం తమకు ఇబ్బందికరమైన ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమకు అనుకూలురైన అధికారులతో ఒక ప్రత్యేక విచారణ బృందం(సిట్) నియమిస్తారు. వీరు విచారణను సాగదీసి సాగదీసి ఏదైనా రిపోర్టు ఇచ్చినా, దానిపై ఎలాంటి చర్యలు ఉండవు. జిల్లాస్థాయిలో బదిలీ కావాలంటే స్థానిక ఎమ్మెల్యే లేక జిల్లా మంత్రి రికమండేషన్ లేనిదే జిల్లా ఎస్పీ ఏమీ చేయలేడు. ఇక డీజీ స్థాయి అధికారులకు రిటైర్మెంట్ తరువాత సలహాదారుల పోస్టుల ఎరతో నాయకులు తమకు కావాల్సిన పనులు ఉన్నతాధికారులతో చేయించుకుంటున్నారు.

– ఎం. పద్మనాభ రెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్