ఎల్ఓసీ ఇచ్చినా బెడ్లు ఖాళీ లేవని ప్రాణాలు తీసిన్రు

ఎల్ఓసీ ఇచ్చినా బెడ్లు ఖాళీ లేవని ప్రాణాలు తీసిన్రు

నిమ్స్​ డాక్టర్ల  కాళ్లు మొక్కినా కనికరించలే
50 రోజులు తిరిగినా ఫాయిదా లేదు
టైంకు సర్జరీ చేయక చంపేసిన్రు
జగిత్యాల జిల్లాకు చెందిన మృతుడి భార్యాపిల్లల ఆవేదన

మెట్ పల్లి, వెలుగు : ఆరోగ్యం మంచిగ లేదని గల్ఫ్​ నుంచి నిమ్స్​కు వస్తే సర్జరీ చేయకుండా ప్రాణాలు తీశారని జగిత్యాల జిల్లాకు చెందిన ఓ మృతుడి కుటుంబీకులు ఆవేదన చెందారు. సీఎంఆర్ఎఫ్​ కింద ఎల్ఓసీ తెచ్చి ఇచ్చినా ఆపరేషన్ ​చేయకుండా బెడ్లు ఖాళీ లేవని 50 రోజుల పాటు తిప్పుకుని చంపారని వాపోయారు. డాక్టర్ల కాళ్లు మొక్కినా కనికరించలేదని కన్నీరు కార్చారు. బాధితుల కథనం ప్రకారం..జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధూరు గ్రామానికి చెందిన సోమ మోహన్​(40), జమున దంపతులు. వీరికి రజిత, రమ్య బిడ్డలు. బతుకుదెరువు కోసం మోహన్​ రెండేండ్ల కింద బెహ్రయిన్ ​వెళ్లాడు. అక్కడ అనారోగ్యానికి గురి కావడంతో పని చేయలేక ఇండియా వచ్చాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని మెరుగైన ట్రీట్​మెంట్​ కోసం హైదరాబాద్​లోని నిమ్స్​కు తీసుకెళ్లారు. టెస్టులు చేసిన న్యూరో డిపార్ట్​మెంట్ ​డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, సర్జరీ చేయాలని సూచించారు. దీంతో అక్టోబర్ నెలలో నిమ్స్​కు వెళ్లగా.. రూ. నాలుగు లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. తమ దగ్గర అంతడబ్బు లేదని చెప్పడంతో సీఎంఆర్ఎఫ్ కింద ఎల్ఓసీ తీసుకొస్తే సర్జరీ చేస్తామని రూ.4 లక్షల ఎస్టిమేషన్​ఇచ్చారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు చొరవతో అక్టోబర్​13న రూ. మూడు లక్షల ఎల్ఓసీ తీసుకురాగలిగారు. దీన్ని తీసుకుని అక్టోబర్ 14 న నిమ్స్ కు వెళ్తే బెడ్లు ఖాళీగా లేవని రెండు వారాల తర్వాత ఫోన్ చేస్తామని, అప్పడు రావాలని తిప్పి పంపారు. 

50 రోజులు తిప్పించుకున్నరు

రెండు వారాలు గడిచినా దవాఖాన నుంచి ఫోన్ ​రాకపోవడంతో..బాధితులే హాస్పిటల్ కు వెళ్లగా మళ్లీ బెడ్లు లేవని వెనక్కి పంపించారు.  ఇలా నాలుగు సార్లు హాస్పిటల్ ​చుట్టూ తిప్పుకున్నారు. ఒకరోజు తలబాగా నొప్పి లేస్తోందని చెప్పగా ఐదో సారి నిమ్స్​కు తీసుకువెళ్లి  సర్జరీ  చేయాలని డాక్టర్లను వేడుకున్నారు. అయినా కనికరించని వారు  ‘మీ సీరియల్ నంబర్ రాలేదు. ఇంకా టైం పడుతుంది’ అని చెప్పి అడ్మిట్ చేసుకోలేదు. దీంతో గత్యంతరం లేక అక్కడి నుంచి ఇంటికి వచ్చామని మోహన్ ​భార్య జమున ఆవేదన చెందింది. 

కాళ్లు మొక్కితే జనరల్ ​వార్డులోకి..  

భరించలేని నొప్పి రావడంతో మోహన్ ను అతడి భార్యాపిల్లలు ​నవంబర్ 28న నిమ్స్​కు వెళ్లి డాక్టర్ల  కాళ్లమీద పడితే  జనరల్ వార్డులో అడ్మిట్ చేసుకున్నారు.13  రోజులు ట్రీట్​మెంట్ ​ఇవ్వకుండా, సర్జరీ చేయకుండా జనరల్ వార్డులోనే ఉంచారు. ఆ రెండు వారాల్లో డాక్టర్లు కనీసం పట్టించుకోలేదని జమున తెలిపారు. డిసెంబర్10  శనివారం రాత్రి  విపరీతమైన తలనొప్పి రాగా, అక్కడున్న నర్సులకు చెప్పామన్నారు. ‘శని, ఆదివారం ఎవరు ఉండరు. సోమవారం డాక్టర్ వచ్చి చూస్తారు’ అని సిస్టర్ చెప్పిందన్నారు. పరిస్థితి సీరియస్ గా మారడంతో 11న మోహన్ ను ఐసీయూలోకి షిఫ్ట్ చేశారన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫిట్స్ రావడంతో తన భర్త చనిపోయాడని సిబ్బంది వచ్చి చెప్పారని జమున కన్నీరు కార్చింది. 

నిమ్స్​ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మా నాన్న చనిపోయిండు

మా నాన్న సర్జరీ కోసం రు. మూడు లక్షలు  సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ తీసుకెళ్లి ఇచ్చినం. అయినా నిమ్స్ డాక్టర్లు పట్టించుకోలే.  సర్జరీ అవసరమైన పేషెంట్​ను బెడ్లు ఖాళీ లేవని 50 రోజులు తిప్పించుకున్నరు. కాళ్లు మొక్కినా కనికరించలే. వాళ్ల నిర్లక్ష్యం వల్లే మా నాన్న సచ్చిపోయిండు. పేదల ప్రాణాలతో ఆడుకుంటున్న నిమ్స్​ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలె. మా నాన్న చావుతో మా కుటుంబం రోడ్డున పడింది.  
– రజిత, మోహన్ కూతురు