పల్లెల్లో జాజిరి.. జాజిరి

 పల్లెల్లో  జాజిరి.. జాజిరి

హోలీ పండుగని ఒక్కో చోట ఒక్కో తీరుగ జరుపుకుంటరు. దేనికది ప్రత్యేకమే అయినా మన దగ్గర మరింత స్పెషల్​. ఎందుకంటే ..హోలీకి తొమ్మిది రోజుల ముందే జాజిరి పండుగ  మొదలైతది​ తెలంగాణ పల్లెల్లో. ఎప్పటిలాగే ఈ ఏడు కూడా జాజిరి సంబురాలు ఘనంగా జరుపు కుంటున్నరు పల్లెల్లో. రాత్రిళ్లు కోలల చప్పుళ్లతో జాజిరి పాటలు వినిపిస్తున్నయ్​. కాముని ఆటలు చిన్నాపెద్దని అలరిస్తున్నయ్. తెలంగాణ కల్చర్​కి అద్దం పట్టే ఈ పండుగ గురించి మరిన్ని విశేషాలు..

‘‘రింగురింగు బిల్లా రూపాయి దండా.. దండ కాదురా తామర మొగ్గ...’’, ‘‘ మొగ్గ కాదురో మోదుగు నీడ.. నీడ కాదురో నిమ్మల బావి’’, ‘‘బావి కాదురో బసంత కూర.. కూర కాదురో గుమ్మడి పండు”, ‘‘ఆ గుండు ఈ గుండు ఇత్తడి గుండు.. గుండువోయి గండి మీద మోతలు పెట్టి’’...., ‘‘కోతి పుట్టుడెండుకు కొమ్మలెక్కెటందుకు’’, ‘‘మల్లె చెట్టు కింది మదానో నావయ్యాలి’’.. అంటూ హోలీకి 9 రోజుల ముందు మొదలయ్యే కోలాటాలు, వీధుల్లో పాడే జాజిరి పాటలు, ఇంటింటికీ తిరుగుతూ ఆడే కాముని ఆటలు తెలంగాణ పల్లెలకే సొంతమైన సంబురాలు. ఈ 9 రోజులు ఉన్నోడు లేనోడు అన్న పట్టింపులు లేకుండా చిన్నా పెద్దా అందరూ ఆనందంగా జాజిరి పండుగ చేసు కుంటరు. ఈ పండుగ వెనుక ఓ కారణం ఉంది. 

ఆయారే హోలీ..!

హోలీకి 9 రోజుల ముందే గోగుపూలు తెచ్చి రంగు చేస్తరు పల్లెల్లో. రాత్రిపూట మగ పిల్లలు కోలలతో, ఆడ పిల్లలు చప్పట్లతో పాటలు పాడుతూ ఇంటింటికీ తిరుగుతరు. కోలాటాలాడుతూ, పాటలు పాడుతూ వీధుల్లో ఉత్సాహం నింపుతరు. అలా ఇండ్ల ముందుకు వచ్చే పిల్లలకు తమకు తోచిన కానుకలిచ్చి పంపిస్తరు ఊళ్లోవాళ్లు. సాధారణంగా బియ్యం, డబ్బులు, వడ్లు, మక్కలు కానుకలుగా ఇస్తరు. తొమ్మిదో రోజు ఇంటింటికి తిరిగి తెచ్చిన ఆ వడ్లు, బియ్యం, మక్కలను అమ్ముకుంటరు పిల్లలు. ఆ వచ్చిన డబ్బుని సమంగా పంచుకొని రంగులు కొనుక్కొని తెల్లారి హోలీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. జాజిరి ఆట చివరి రోజు గ్రామ కూడలిలో కామ దహనం చేస్తరు. అందులో మగపిల్లలు కోలలు, ఆడపిల్లలు పిడకలు వేస్తరు. అయితే ఇంతకుముందు పిల్లలు రంగులు కొనడానికి డబ్బులు లేక ఇలా జాజిరి పండుగని జరుపుకున్నరు. తర్వాత అదే ఆచారంగా మారి.. తెలంగాణ కల్చర్​లో ఓ భాగం అయింది.
::: మహాముత్తారం, వెలుగు