జాబ్స్ నోటిఫికేషన్లకు రంగం సిద్ధం.. రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్

జాబ్స్ నోటిఫికేషన్లకు రంగం సిద్ధం.. రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్

గ్రూప్​ 1, పోలీస్​, హెల్త్​లో ఖాళీల భర్తీకి కసరత్తు
హైదరాబాద్​, వెలుగు:
రాష్ట్రంలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ ప్రకటించిన నేపథ్యంలో.. మరో నాలుగైదు రోజుల్లో మూడునాలుగు నోటిఫికేషన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పోలీస్​ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్​, ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సుల భర్తీకి నోటిఫికేషన్లను ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రూప్​ 1 నోటిఫికేషన్​నూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో టెట్​ నోటిఫికేషన్​ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే రిక్రూట్​మెంట్​ ఏజెన్సీలకు సర్కారు ఆదేశాలిచ్చింది. ఏజ్​ లిమిట్​ను 10 ఏండ్లు పెంచుతూ శనివారమే సర్కార్​ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ వారంలోనే 20 వేల నుంచి 30 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తారని అధికారులు అంటున్నారు.  
ఫస్ట్​ నోటిఫికేషన్​ పోలీస్​ డిపార్ట్​మెంట్​ నుంచే
పోలీస్​ డిపార్ట్​మెంట్​లో కొత్త జోన్ల ప్రకారం ఎస్సై, కానిస్టేబుల్​ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు.. ఆర్థిక శాఖ అనుమతిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఫస్ట్​ రిలీజ్​ చేసేది పోలీస్​ నోటిఫికేషనేనని అధికారులు అంటున్నారు. హోంశాఖలో 18,334 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. అందులో 15 వేల ఎస్సై, కానిస్టేబుల్​ పోస్టుల భర్తీకి ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ ఓకే చెప్పిందని అంటున్నారు. కానిస్టేబుల్​ జిల్లా స్థాయి పోస్టు కావడంతో ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలు, రిజర్వేషన్​, రోస్టర్​, ప్రిలిమ్స్​ ఎగ్జామ్​, ఈవెంట్స్​పై సర్కారుకు పోలీస్​ డిపార్ట్​మెంట్​ రిపోర్ట్​ ఇచ్చినట్టు తెలుస్తోంది. హెల్త్​, మెడికల్ డిపార్ట్​మెంట్​లో 12,755 ఖాళీలు ఉన్నాయి. వాటిలోనూ ఎక్కువగా నర్స్​ పోస్టులే ఉన్నాయి. ఆ తర్వాత డాక్టర్​, పారామెడికల్​ సిబ్బంది తదితర ఖాళీలున్నాయి. కరోనా టైంలో కాంట్రాక్ట్​ పద్ధతిలో నర్సులు, ఇతర సిబ్బందిని తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు పూర్తిస్థాయిలో రిక్రూట్​మెంట్​కు సిద్ధమవుతోంది. 
టెట్​ అయ్యాకే టీచర్​ కొలువులు
సెకండరీ ఎడ్యుకేషన్​, హయ్యర్​​ఎడ్యుకేషన్​, గురుకులాలు కలిపి 27 వేల టీచర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలంటే టెట్​ తప్పనిసరి కావడంతో.. ముందుగా టెట్​ నిర్వహించి ఆ తర్వాతే టీచర్​ కొలువుల ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అందులో భాగంగా రెండు రోజుల్లో టెట్​కు నోటిఫికేషన్​ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శనివారం సీఎం కేసీఆర్​ తన ఫాంహౌస్​లో మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టెట్​ పెట్టడం వల్ల టీచర్ల భర్తీకి మూడు, నాలుగు నెలల టైం కలిసి వస్తుందని సర్కారు భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు, తెలంగాణ వచ్చాక రెండుసార్లు టెట్​ను నిర్వహించారు. టెట్​ స్కోరుకు కాలపరిమితి ఏడేండ్లు కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన టెట్లకు ఇప్పటికే గడువు తీరిపోయింది. రాష్ట్రం వచ్చాక 2016 మేలో తొలిసారి, 2017 జులై 23న మరోసారి టెట్​ పెట్టారు. అయితే, మళ్లీ టెట్​ పెట్టాలంటూ టీచర్​ కొలువుల కోసం ప్రయత్నిస్తున్న వారు డిమాండ్​ చేస్తుండడంతో.. తాజాగా మరోసారి టెట్​ నోటిఫికేషన్​ను ఇవ్వనున్నారు. ఈసారి ఎక్కువ మంది టెట్​కు అప్లై చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు.. ఎగ్జామ్​ను ఆఫ్​లైన్​లోనే నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నారు.