
హైదరాబాద్‌లో జర్నలిజానికి పునాదులు పడటానికి మూలకారణం రిసాలాతబ్బి అనే ఉర్దూ పత్రిక. 1859లో ప్రారంభమైన ఈ పత్రికకు జార్జ్ స్మిత్ సంపాదకులుగా ఉండేవారు. ఈ పత్రికను నగరంలోని ముక్తాల్ ఉల్ ముల్క్ ప్రెస్‌లో ప్రచురించేవారు. రిసాలా తబ్బి పత్రిక స్థాపన మూలంగా తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో దిన, వార, పక్ష, మాస పత్రికలే కాకుండా లిఖిత, గోడ పత్రికలు కూడా ప్రచురించారు. తెలంగాణలో వెలువడిన ప్రముఖ పత్రికల్లో ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం.
దక్కన్ టైమ్స్(1864): ఐదో నిజాం అప్జల్ ఉద్దౌలా పాలనా కాలంలో దక్కన్ టైమ్స్ అనే ఆంగ్ల వార పత్రిక వెలువడింది. ఇది ఒక వైద్య పత్రిక. తెలంగాణ ప్రాంతం నుంచి వెలువడిన ఆంగ్ల వార పత్రికగా గుర్తింపు పొందిన ఈ పత్రికను సికింద్రాబాద్‌లో స్థాపించారు.
సేద్య చంద్రిక(1886): హైదరాబాద్ రాజ్య ప్రధాని సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా వ్యవసాయం, రెవెన్యూ, విద్య, వైద్య రంగాల్లోచోటుచేసుకుంటున్న పరిణామాలను తెలియజేయడానికి పత్రికల ఆవశ్యకత ఏర్పడింది. ఇందులో భాగంగానే 1883లో పునూన్ అనే వ్యవసాయ రంగ ఉర్దూ మాస పత్రిక వెలువడింది. పునూన్ పత్రికకు తర్జుమాగా తెలంగాణ తొలి తెలుగు పత్రిక సేద్యచంద్రిక 1886లో ప్రారంభమైంది. బండ అచ్చు పద్ధతిలో ముద్రించిన ఈ పత్రికలో వ్యవసాయ రంగ వార్తలతోపాటు ప్రభుత్వ అధికారుల బదిలీల సమాచారం, వివిధ పాలనా సంస్కరణలు, వాటి ప్రయోజనాలు ప్రచురించారు. మౌలిన్ ఏ షఫిక్ (1892): ముస్లిం మహిళల అభ్యున్నతి కోసం మౌల్వి మొహిబ్ హుస్సేన్ నేతృత్వంలో 1892లో స్థాపించారు. ఈ పత్రిక అవలంబిస్తున్న విధానాల వల్ల నిజాం పాలకులు నిషేధించారు.
హితబోధిని(1913): తెలంగాణలో పూర్తిస్థాయి స్వతంత్ర తెలుగు పత్రికగా హితబోధిని వారపత్రిక 1913లో బండారు శ్రీనివాస శర్మ సంపాదకత్వంలో ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ నుంచి వెలువడిన ఈ పత్రిక ముద్రణా యంత్రానికి వనపర్తి సంస్థానాధీశుడు శ్రీరామభూపాల బహిరీ బలవంత్ బహదూర్ సహాయం చేశాడు.
ఆంధ్రమాత(1917): దివ్యజ్ఞాన సమాజం తరఫున ప్రచురించిన ఆంధ్రమాత పత్రిక 1917లో హైదరాబాద్‌లో ప్రారంభించారు. స్వామి వెంకటరంగా రావు సంపాదకత్వంలో వెలువడిన ఈ పత్రిక స్థాపించిన ఎనిమిది నెలలకే మూతపడింది.
తెనుగు పత్రిక(1922): తెలంగాణ తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆశించి ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవరంగారావులు 1922, ఆగస్టు 27న వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామంలో తెనుగు పత్రికను స్థాపించారు. ప్రతి ఆదివారం వెలువడే తెనుగు పత్రికలో రాజకీయం మొదలు సాహిత్యం వరకు అన్ని వార్తలను ప్రచురించేది. నాడు నిజాం పాలనలో తీసుకున్న ప్రజా వ్యతిరేకమైన విధానాలను విమర్శించి ఈ పత్రిక సమర్థవంతంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది.
నీలగిరి పత్రిక(1922): నిజాం రాష్ట్రాంధ్ర కేంద్ర జన సంఘం సభ్యులు తెలుగు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, తమ సంఘ కార్యకలాపాలు తెలియజేయడానికి ఒక పత్రికను స్థాపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా వాసి షబ్నవీస్ వెంకటరామ నర్సింహారావు సంపాదకత్వంలో 1922, ఆగస్టు 24న నీలగిరి పత్రిక స్థాపించారు.
గోల్కొండ పత్రిక(1925): తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ వ్యక్తీకరణ వేదికగా గోల్కొండ పత్రిక 1926లో ద్వైవార/ అర్ధవార పత్రికగా స్థాపించారు. సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ఈ పత్రిక రైతు అంశాలతోపాటు సాహిత్యం, గ్రంథాలయోద్యమం, మహిళాభివృద్ధి తదితర అంశాలను ప్రచురించేది. ప్రతి బుధ, శని వారాల్లో వెలువడే ఈ పత్రిక ప్రజల్లో జాతీయవాదం పెంపొందించి మితవాదులు, జాతీయవాదుల పక్షాన నిలిచింది. 1947లో ఈ పత్రికను వనపర్తి సంస్థానాధీశులు, నూకల నరోత్తమరెడ్డిలు దినపత్రికగా మార్చి ప్రచురించారు.
ఆంధ్రాభ్యుదయం(1925): కోకల సీతారామ శర్మ సంపాదకత్వంలో ఈ పత్రిక 1925లో హన్మకొండ నుంచి వెలువడింది. ఈ పత్రిక గ్రాంథిక భాషా వాదాన్ని సమర్థించి సమాజాభివృద్ధి, చారిత్రిక పరిశోధనలపై వ్యాసాలు ప్రచురించేది. తెలంగాణ గ్రంథాలయోద్యమానికి ఈ పత్రిక పెద్దపీట వేసి వార్తలను ప్రచురించేది.
దేశబంధు పత్రిక(1926): బెల్లంకొండ నరసింహాచార్యుల సంపాదకత్వంలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ దగ్గరలోని వడ్డేపల్లి గ్రామం నుంచి 1926లో వెలువడింది. మూలధనంతో కాకుండా ఇతరుల నుంచి రుణం తీసుకొని ప్రారంభించిన ఈ పత్రిక ట్యాగ్‌లైన్ ఆంధ్ర విజ్ఞాన ప్రబోధన మాస పత్రిక.
సుజాత పత్రిక(1927): సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో తెలంగాణలోని పండితులు 1927 జనవరిలో సుజాత అనే మాస పత్రికను స్థాపించారు. ఈ పత్రికలో వ్యాసాలు, కవిత్వం, చలం లాంటి వారి కథలు, నాటికలు పసుదూముల నృసింహశర్మ సంపాదకత్వంలో ప్రచురించేవారు.
రయ్యత్ పత్రిక(1927): నిజాం రాష్ట్ర జనసంఘం సభ్యులైన మందముల నర్సింగరావు సంపాదకత్వంలో రయ్యత్ అనే ఉర్దూ వార పత్రిక 1927లో ప్రారంభమైంది. ఈ పత్రికను 1929లో నిజాం ప్రభుత్వం నిషేధించగా తిరిగి 1932లో పున: ప్రారంభమైంది.
హైదరాబాద్ టెలిగ్రాఫ్(1882): ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్ టెలిగ్రాఫ్ 1882లో స్థాపించారు.
హైదరాబాద్ రికార్డ్ (1885): 1885లో స్థాపించిన ఈ పత్రిక ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించింది. హైదరాబాద్ రెసిడెంట్ పాలకుడిని స్థానిక సీజర్గా అభివర్ణించడంతో 1892లో బ్రిటిష్ రెసిడెన్సీ ఈ పత్రికను నిషేధించింది.
భాగ్యనగర్ పత్రిక(1936): మాదిరి భాగ్యరెడ్డి వర్మ సంపాదకత్వంలో భాగ్యనగర్ వార పత్రిక ప్రచురించారు. ఆ తర్వాత కాలంలో ఈ పత్రిక ఆది హిందూ పత్రికగా పేరు మార్చి మాస పత్రికగా ప్రచురించారు.
మీజాన్ పత్రిక(1941): గులాం మహ్మద్ నేతృత్వంలో భాగ్యనగర్ వార పత్రిక ప్రచురితమైంది. ఈ పత్రికకు సంపాదకులుగా అడవి బాపిరాజు, ఉప సంపాదకులుగా విద్వాన్ విశ్వం వ్యవహరించారు.
తెలంగాణ (1941–42): తెలంగాణ ప్రజానీకం దృష్టిలో ఇది తొలి దిన పత్రిక. తెలంగాణ పత్రికను దక్కన్ క్రానికల్ దినపత్రిక యజమాని రాజగోపాల్ మొదలియార్ స్థాపించారు.
శోభ పత్రిక(1947): తెలంగాణలో సాహిత్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 1947, ఆగస్టు 2న శోభ అనే సాహిత్య మాస పత్రికను స్థాపించారు. దేవులపల్లి రామానుజాచార్యుల సంపాదకత్వంలో వరంగల్ నుంచి వెలువడిన ఈ పత్రికలో ఆంధ్ర సాహిత్య, సాంస్కృతి వికాసానికి దోహదం చేసేలా వ్యాసాలు ప్రచురితమయ్యేవి.
ఇమ్రోజ్ పత్రిక (1947): 1947లో షోయబుల్లాఖాన్ సంపాదకత్వంలో ప్రారంభించిన ఇమ్రోజ్ పత్రిక నిజాం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తలు ప్రచురించింది. నిప్పుకణిక అర్థం వచ్చే ఈ పత్రికలో ఖాసిం రజ్వీని విమర్శిస్తూ సంపాదకీయాలు రాసేవాడు.