మూడేండ్లుగా వెంటాడుతున్న ముంపు.. చర్యలు తీసుకోని ఆఫీసర్లు

మూడేండ్లుగా వెంటాడుతున్న ముంపు.. చర్యలు తీసుకోని ఆఫీసర్లు
  • పెద్ద చెరువు కింద ఏటా మునుగుతున్న కాలనీలు
  • ఆక్రమణలపై చర్యలు తీసుకోని ఆఫీసర్లు
  • లోతట్టు కాలనీవాసులకు తప్పని తిప్పలు

మహబూబ్​నగర్, వెలుగు: పాలమూరులో ఏటికేడు ముంపు సమస్య తీవ్రమవుతోంది. మూడేండ్లుగా వానలు దంచి కొడుతుండడంతో చెరువుల కింద ఉన్న కాలనీలు జలమయం అవుతున్నాయి. ఏటా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని లీడర్లు, ఆఫీసర్లు ప్రకటనలు చేస్తున్నా, చర్యలు తీసుకోవడం లేదు.

మహబూబ్​నగర్  జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు దాదాపు 119 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువుకు జిల్లా కేంద్రంలోని తెట్టె చెరువు, దొడ్లోనిపల్లి చెరువు, గాండ్ల చెరువుల నుంచి నాలాల ద్వారా నీరు వచ్చి చేరేది. అలాగే ప్రేమ్​నగర్, స్టేషన్ చౌరస్తా, బాయమ్మతోట, షాషబ్​గుట్ట, న్యూటౌన్, కొత్తగంజ్, సుభాష్​నగర్, కలెక్టర్ బంగ్లా, మోనప్పగుట్ట, టీడీగుట్ట, కోయిల్కొండ క్రాస్ రోడ్డు, బస్టాండ్ చౌరస్తా, వేపూరి గేరి నాలాల ద్వారా కూడా నీళ్లు వస్తాయి. చెరువు డెవలప్  చేస్తున్నారు. మూడేండ్లుగా పూడికతీత పేరుతో ఏటా సమ్మర్ ప్రారంభంలో చెరువులోని నీటిని మొత్తం ఖాళీ చేస్తున్నారు. చెరువులోకి నీరు రాకుండా నాలాల నుంచి వచ్చే నీటిని చెరువుకు ఉన్న రెండో అలుగుకు డైవర్ట్  చేస్తున్నారు.

అయితే, బీకేరెడ్డి కాలనీ వైపు ఉన్న అలుగు వరకు వస్తున్న నాలాలు 30 ఫీట్ల వెడల్పు, 20 ఫీట్లతో ఉండగా, అలుగు దిగువన ఉన్న కాల్వలు 3 ఫీట్ల వెడల్పు, 2 ఫీట్ల లోతు మాత్రమే ఉండడంతో వరద ఉధృతిని తట్టుకోవడం లేదు. దీంతో వరద నీరంతా దిగువన ఉన్న బీకేరెడ్డి కాలనీ, మధురానగర్, భగీరథ కాలనీల్లోకి చేరుతోంది. నిరుడు కురిసిన వర్షాలకు ఈ కాలనీలు ఐదారు సార్లు ముంపునకు గురయ్యాయి. వరద తగ్గిన రెండు మూడు రోజుల వరకు ఇళ్లన్నీ బురదతో నిండిపోతున్నాయి. తాజాగా గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మళ్లీ బీకేరెడ్డి కాలనీలోకి నీరు చేరింది. 

ముందస్తు చర్యలు కరువు..

వరదలతో కాలనీలు ముంపునకు గురయ్యేంత వరకు ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిరుడు భారీ వర్షాలకు దిగువ కాలనీలు మునిగిపోవడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో అప్పటికప్పుడు నాలాలను అలుగు కాల్వలకు కాకుండా చెరువుకు లింక్  చేశారు. ఈ ఏడాది ఎండాకాలంలో డెవలప్​మెంట్  వర్క్స్​ప్రారంభించడంతో మళ్లీ నాలాలను అలుగు కింద ఉన్న కాల్వలకు లింక్ చేశారు. అయితే, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి మళ్లీ నీళ్లు కాలనీల్లోకి చేరాయి. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు కాలనీలోకి నీళ్లు వెళ్లకుండా ఇసుక సంచులను అడ్డు వేయడంతో కొంత వరకు నీటి ఉధృతి తగ్గింది. 

కుచించుకుపోయిన చెరువు..

జిల్లా కేంద్రంలో రోజు రోజుకు భూముల రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. పెద్ద చెరువు 119 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ప్రస్తుతం 60 నుంచి 70 ఎకరాలకు కుచించుకుపోయింది. కట్ట చుట్టూ పెద్ద మొత్తంలో ఆక్రమణలు జరిగాయి. బఫర్ జోన్  పరిధిలో ప్లాట్లు చేసి అమ్మేశారు. కొందరు వీటిలో ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టారు. గతేడాది వరదల సమయంలో ఆక్రమణదారులకు నోటీసులు పంపి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పినా, ఇంత వరకు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

ఇసుక సంచులు అడ్డుగా వేశాం..

ఈ విషయమై ఇరిగేషన్​ ఆఫీసర్లను వివరణ కోరగా, ఫ్లడ్ ఎక్కువగా వస్తే నీళ్లు దిగువకు వెళ్లకుండా ఇసుక సంచులు అడ్డుగా వేశామని సమాధానం ఇచ్చారు. రెగ్యులర్​గా పెద్ద చెరువు నుంచి బీకేరెడ్డి కాలనీ వైపు వరద నీరు ఎంత పోతుందో అంతే పోతుందని చెప్పారు.