భద్రాచలంలో రోడ్డెక్కిన వరద బాధితులు.. భోజనాలు కూడా పెట్టడం లేదని ఆవేదన

భద్రాచలంలో రోడ్డెక్కిన వరద బాధితులు..  భోజనాలు కూడా పెట్టడం లేదని ఆవేదన

కొత్తగూడెం జిల్లా : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతుల్లేక చాలా అవస్థలు పడుతున్నారు బాధితులు. భద్రాచలంలో ముంపు ప్రాంత ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల నిర్వహణ సరిగా లేదంటూ వరద బాధితులు రోడ్డెక్కారు. 

వరద బాధిత పునరావస కేంద్రాల్లో ఉంటున్న తమకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు తక్షణమే భోజనాలు ఏర్పాటు చేయాలని భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య అధికారులను డిమాండ్ చేశారు. భోజనాలు కూడా సమయానికి పెట్టకుండా తమను అర్ధాకలితో ఉంచుతున్నారని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.