ఎమర్జింగ్​ బ్రాండ్లకు పైసల వాన

ఎమర్జింగ్​ బ్రాండ్లకు పైసల వాన
  • పాపులర్​ బ్రాండ్లనూ వెనక్కి నెట్టేస్తున్నయ్​

న్యూఢిల్లీ: తిండి, డ్రింక్స్​, బ్యూటీ, పర్సనల్​ కేర్​ సెగ్మెంట్లకు చెందిన ఎమర్జింగ్/ఇన్సర్జెంట్​ బ్రాండ్లకు దండిగా ఇన్వెస్ట్​మెంట్లు వస్తున్నాయి. తక్కువ ధరలకు క్వాలిటీ ప్రొడక్టులను అందించే వాటిని ‘ఇన్సర్జెంట్​ బ్రాండ్లు’ అని పిలుస్తారు. 2018 నుంచి 2022 వరకు ప్రైవేట్ ఈక్విటీ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లు ఇన్వెస్ట్​ చేసిన 4.7 బిలియన్ల డాలర్లలో 75 శాతానికిపైగా వీటికే వచ్చాయి. ఇటువంటి బ్రాండ్‌‌లకు పట్టణాల నుంచి విపరీతంగా డిమాండ్ పెరుగుతోందని బైన్ & కో, డీఎస్​జీ కన్జూమర్ ​పార్ట్​నర్స్​ ‘ది ఇన్సర్జెంట్ కన్జూమర్ బ్రాండ్స్ ప్లేబుక్’ పేరుతో విడుదల చేసిన రిపోర్ట్​ పేర్కొంది. 2007 తర్వాత వచ్చిన ఇన్సర్జెంట్​ బ్రాండ్‌‌లను పరిశీలించి రిపోర్ట్​ తయారు చేసింది. 2015 నుండి మొత్తం 3 మిలియన్​ డాలర్లకు పైగా నిధులను ఇవి అందుకున్నాయి.

వీటిలో మెజారిటీ బ్రాండ్‌‌లు ఆన్‌‌లైన్‌‌లో ప్రారంభమయ్యాయి. ఇవి వినూత్నమైన ప్రొడక్టులను అందించడంతో గిరాకీ పెరుగుతోంది. “సుమారు 150 ఇన్సర్జెంట్​ బ్రాండ్‌‌లపై మేం స్టడీ చేశాం. ప్రీమియమైజేషన్​, కొత్త కేటగిరీలు రావడం వల్ల ఈ సెగ్మెంట్​మరింత వృద్ధి చెందుతోంది. 2022 నుండి 2030 వరకు కన్జంప్షన్​ గ్రోత్​లో  వీటి వాటా 45 శాతం వరకు ఉండొచ్చు. ఇవి కొత్త కస్టమర్లపై ఎక్కువగా ఫోకస్​ చేస్తున్నాయి. సాధారణ బ్రాండ్ల మార్కెట్ వృద్ధితో పోలిస్తే ఇన్సర్జెంట్​ బ్రాండ్లు సగటున రెండు లేదా మూడు రెట్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. భారతదేశంలో విజయవంతమైన ఎమర్జింగ్​​ బ్రాండ్‌‌లు నిధులను భారీగా సమీకరించుకుంటూనే డబ్బు సంపాదించుకుంటున్నాయి. ఇవి వినియోగదారుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సాధించాయి" అని బైన్ & కో పార్ట్​నర్​ ధృవ్ అగర్వాల్ అన్నారు.

పట్టణాల్లో ఎక్కువ గిరాకీ..

కొత్త బ్రాండ్‌‌లను కోరుకునే పట్టణ వినియోగదారుల వల్ల ఇటువంటి బ్రాండ్లు పాపులర్​ అవుతున్నాయి. గత నాలుగు సంవత్సరాల్లో  అప్పర్​ మిడిల్​, హై ఇన్​కమ్ వర్గాల నుంచి వీటికి భారీ సంఖ్యలో కస్టమర్లు వచ్చారు. ఈ సంఖ్య దాదాపు 15.7 కోట్ల వరకు ఉంటుందని అగర్వాల్​ వివరించారు.  ఈ కొత్త బ్రాండ్లు పాపులర్​ బ్రాండ్లకు విపరీతంగా పోటీని ఇస్తున్నాయి. మన దేశంలో ఏదైనా  బ్రాండ్​ రూ.75 కోట్ల వార్షిక ఆదాయాన్ని సాధించడానికి సుమారు ఆరు సంవత్సరాలు పడుతోంది. కానీ, ఆ తరువాతి రెండు సంవత్సరాల్లో మెజారిటీ బ్రాండ్‌‌లు రూ.200 కోట్ల వార్షిక ఆదాయ మార్కును చేరుకుంటున్నాయి. అంటే కుదుట పడ్డాక గ్రోత్​ వేగంగా ఉంటోంది.  “ఒకసారి బలమైన పునాదులు పడ్డాక వృద్ధి వేగంగా ఉంటుంది.  దీర్ఘకాలిక లాభదాయకత, పోటీని తట్టుకోవడం,  వృద్ధి ఒత్తిళ్లను అధిగమించడానికి స్థూల మార్జిన్‌‌పై ముందస్తుగా దృష్టి పెట్టడం చాలా కీలకం. వీటిలో తేడా వస్తే వ్యాపారాన్ని మూసుకోవాల్సి ఉంది. ఏ బ్రాండైనా వీలైనాంత త్వరగా లాభాల్లోకి రావాలి"  అని డీఎస్​జీ కన్జూమర్ పార్ట్‌‌నర్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరిహరన్ ప్రేమ్‌‌కుమార్ అన్నారు.