
- ఆర్టిఫిషియల్ లైట్ పెరగడమే కారణం
- ఆవాసాలు తగ్గడం, పురుగు మందులూ..
రాత్రిపూట మిణుకు మిణుకు మంటూ కనిపించే మిణుగురు పురుగులు తెలుసు కదా? ఊర్లల్ల ఉండేటోళ్లు వాటిని చూసే ఉంటరు. వాటితో ఆడుకునే ఉంటరు. అట్లాంటి ఈ పురుగులు ఇప్పుడు బతకలేకపోతున్నయట. క్రమక్రమంగా వాటి సంఖ్య తగ్గుతోందట. అమెరికాలోని బోస్టన్‌లో ఉండే టఫ్ట్స్ యూనివర్సిటీ సైంటిస్టుల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే మిణుగురుల ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడి అవి ఎంత సంఖ్యలో ఉన్నాయి, అవి ఉండే ప్రాంతాల పరిస్థితేంటో వీళ్లు అడిగి తెలుసుకున్నారు. ఆ డేటాను సేకరించారు.
మేటింగ్ కోసం..
సాధారణంగా తమ తోటి పురుగులను ఆకర్షించేందుకు మిణుగురులు ఈ లైటింగ్ ఎఫెక్ట్‌ను వాడుతుంటాయని, ఇలా గంటల తరబడి ఈ ప్రక్రియ సాగుతుందని సైంటిస్టులు వివరించారు. కానీ గత వందేళ్లలో ఆర్టిఫిషియల్ కాంతి విపరీతంగా పెరిగిందని, ప్రపంచంలోని 23 శాతం ప్రాంతంలో ఈ లైట్ ప్రభావం ఉంటోందని చెప్పారు. దీని వల్ల మిణుగురులపై ప్రభావం పడుతోందని, తమ మేటింగ్ పద్ధతిని సక్సెస్‌ఫుల్‌గా చేయలేకపోతున్నాయని వివరించారు. కొన్ని రకాల శక్తిమంతమైన ఎల్‌ఈడీల వల్ల మిణుగురుల పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు.
ఎటు పోవాలో అర్థం కాక..
పురుగులు బతికే ప్రాంతాలు కూడా తగ్గిపోతుండటంతో ఎటు వెళ్లాలో అర్థం కాక అంతరిస్తున్నాయని సైంటిస్టులు చెప్పారు. ఉత్తర అమెరికాలోని అపలేచియన్ పర్వతాల్లో ఉండే అపలేచియన్ బ్లూ ఘోస్ట్ ఫైర్ ఫ్లైలు వాటి నివాస ప్రాంతాలు తగ్గి ఇబ్బంది పడుతున్నాయని గుర్తించారు. థాయ్‌లాండ్‌లో నది ఒడ్డులు, మాంగ్రూవ్స్ ఉన్న ప్రాంతాల్లో బోట్లు తిరగడం పెరుగుతోందని.. అందుకని తీరం వెంబడి చెట్లను నరికేస్తున్నారని చెప్పారు. దీంతో వాటి ఆవాసం పోయి ఎగరలేని రకానికి చెందిన మిణుగురులు ఎటు వెళ్లాలో అర్థం కాక టూరిస్టుల కాళ్ల మధ్య నలిగి చనిపోతున్నాయన్నారు. పురుగు మందుల వాడకం కూడా ప్రభావం చూపుతోందని కనుగొన్నారు.
2 వేల జాతులకు పైగా..
ప్రపంచంలో 2 వేలకు పైగా జాతుల మిణుగురులున్నాయని, ప్రస్తుతానికైతే కొన్ని జాతులే ప్రమాదం అంచున ఉన్నాయని సైంటిస్టులు చెప్పారు. బిగ్ డిప్పర్ ఫైర్ ఫ్లైస్ లాంటివి ఎక్కడైనా బతకగలవని చెబుతున్నారు.