తెలంగాణపై జీఆర్ఎంబీ పెత్తనం!.. మహిళా ఉద్యోగులే టార్గెట్​గా వేధింపులు

తెలంగాణపై  జీఆర్ఎంబీ పెత్తనం!.. మహిళా ఉద్యోగులే  టార్గెట్​గా వేధింపులు
  • మన అధికారులకు హక్కులే లేవన్నట్టుగా వ్యవహారం
  • ఈఎన్​సీ స్థాయి అధికారి మాటకూ విలువివ్వని బోర్డు మెంబర్​ సెక్రటరీ అళగేశన్​
  • ఉద్యోగుల డిప్యూటేషన్​ మన అధికారమే అయినా.. పట్టించుకోవట్లే
  • ఓ సూపరింటెండెంట్​ డిప్యూటేషన్​ పొడిగించాలని ఈఎన్​సీ లేఖ రాసినా నిర్లక్ష్యం
  • ఉద్యోగులపై వేధింపులకు సంబంధించి అతీగతీ లేని కమిటీ

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణపై గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్ఎంబీ) పెత్తనం చెలాయిస్తున్నది. డిప్యూటేషన్లు, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగుల నియామకాలు తదితర విషయాల్లో మన రాష్ట్ర హక్కులను తొక్కేస్తున్నది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ మన ఉన్నతాధికారులకు హక్కులే లేవన్నట్టుగా వ్యవహరిస్తున్నది. బోర్డు మెంబర్​ సెక్రటరీ అళగేశన్​ తానే సుప్రీం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఓ మహిళా అధికారి డిప్యూటేషన్​ పొడిగింపుపై ఈఎన్​సీ (అడ్మిన్​) లేఖ రాస్తే..  అసలు ఆ అర్హతే ఈఎన్​సీకి లేదన్నట్టుగా అళగేశన్​ మన అధికారులకు లేఖ రాశారు. 

తాజాగా బోర్డులో ఓ సూపరింటెండెంట్​ డిప్యూటేషన్​ పూర్తవగా.. ఆయన మరో ఏడాదిపాటు ఎక్స్​టెన్షన్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఈఎన్​సీ అడ్మిన్​ ఈనెల 13న బోర్డుకు లేఖ రాశారు. మరో అధికారిని డిప్యూటేషన్​ మీద పంపే వరకు వేచిచూడాలని, అప్పటి వరకు ఆ అధికారిని కొనసాగించాలని లేఖలో కోరారు. కానీ, బోర్డు మెంబర్​ సెక్రటరీ మాత్రం.. ఈఎన్​సీ (అడ్మిన్​) లేఖనుగానీ, విజ్ఞప్తినిగానీ పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం ఎలాంటి కమ్యూనికేషన్  లేకుండానే.. ఆ సూపరింటెండెంట్​ స్థానంలో వేరే అధికారిని నియమించారు. మన ఈఎన్​సీ లేఖ రాసిన రెండు రోజులకే అంటే ఈనెల 15న ఓ మహిళా అధికారిని నియమిస్తూ ఈఎన్​సీకి లేఖ పంపారు. ఉద్యోగుల డిప్యూటేషన్​పై మనకు ఎలాంటి అధికారం లేదన్నట్టుగా అళగేశన్​ తీరుందని అధికారులు వాపోతున్నారు. 

రాష్ట్రాలకే హక్కు..

రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ఇతరత్రా వివాదాలపై మధ్యవర్తిగా ఉండేందుకు వీలుగా కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి కేంద్రం రెండు బోర్డులనూ నియమించింది. చైర్మన్, మెంబర్​ సెక్రటరీ, మెంబర్లను కేంద్రం నియమిస్తుంది. అందులో ఉద్యోగులను మాత్రం రెండు రాష్ట్రాలూ సమానంగా కేటాయించాల్సి ఉంటుంది. ఎవరిని బోర్డులకు పంపించాలన్నది పూర్తిగా రాష్ట్రాలకే కేంద్రం వదిలేసింది. కానీ, జీఆర్ఎంబీ మెంబర్​ సెక్రటరీ అళగేశన్​ మాత్రం ఆ నిబంధనలను తుంగలోకి తొక్కేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఎన్​సీ స్థాయి అధికారి లేఖలు రాసినా పట్టించుకోకుండా.. కర్రపెత్తనం చెలాయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర అధికారులను టార్గెట్​ చేసుకుని వేధింపులకూ పాల్పడుతున్నారని ఆయనపై ఫిర్యాదులు కూడా చేశారు. 

కమిటీ ఊసే లేదు..

అళగేశన్​పై గతంలోనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మహిళా ఉద్యోగులను టార్గెట్​గా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దానిపై గతంలో బోర్డు చైర్మన్​ దృష్టికీ తీసుకెళ్లారు. ఇటు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికీ ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. గత నెలలో జరిగిన బోర్డు మీటింగ్​లో ఈ వ్యవహారంపై చైర్మన్​ దృష్టికి తీసుకెళ్లగా.. ఇంటర్నల్​ విచారణ కోసం కమిటీ వేస్తామని చైర్మన్​ చెప్పారు. కానీ, ఇప్పటి వరకు బోర్డు చైర్మన్​ కమిటీ వేయలేదు. ఇటు కేంద్రం కూడా ఆ వ్యవహారాన్ని చూసీచూడనట్టు వదిలేసింది. దీంతో అళగేశన్​ ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తననెవరూ అడ్డుకోలేరన్న ధీమాతో అళగేశన్  ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఆయన వ్యవహారంపై సీరియస్​గా దృష్టి పెట్టాలని, ఇకపై ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.