- రాష్ట్ర సర్కారు నిధులివ్వకనే!
- రైల్వే ప్రాజెక్టులు లేటైతున్నయ్
- ఎంఎంటీఎస్ ఫేజ్‑2, యాదాద్రి వరకు విస్తరణకు సహకరిస్తలేదు: ఎస్సీఆర్ ఇన్చార్జ్ జీఎం సంజీవ్ కిశోర్
- కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీ నిధులు
- గత బడ్జెట్ కంటే 30% నిధులు ఎక్కువ ఇచ్చిన్రు
- వందే భారత్ రైళ్ల హబ్‌గా హైదరాబాద్ మారుతుందని ధీమా
హైదరాబాద్ / సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను రిలీజ్ చేయకపోవడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయని, కొన్ని చోట్ల ఆగిపోయాయని సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) ఇన్చార్జ్ జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ అన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్ – 2, యాదాద్రి వరకు విస్తరణకు సర్కారు సహకరించడం లేదని చెప్పారు. ఎస్సీఆర్ కు వందే భారత్ రైళ్లు ఎన్ని కేటాయిస్తారన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే.. భవిష్యత్ లో వందే భారత్ రైళ్లకు హైదరాబాద్ హబ్ అవుతుందని, ఇందులో చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్ లు కూడా ఉంటాయని ఆయన వివరించారు. కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు సంబంధించి తెలంగాణ, ఏపీకి కలిపి రూ. 10,080 కోట్లను అలకేట్ చేశారని చెప్పారు. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు గతంలో కంటే 30 శాతం ఎక్కువగా నిధులు ఇచ్చారని తెలిపారు. ఇందులో కొత్త లైన్లు, డబ్లింగ్, త్రిప్లింగ్ లైన్లు, ఎలక్ట్రిఫికేషన్ కు కోసమే రూ. 9,125 కోట్లు ఇచ్చారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఎస్సీఆర్‌కు కేటాయించిన నిధుల వివరాలను ఆయన శుక్రవారం వర్చువల్ ప్రెస్‌మీట్ లో వివరించారు. రెండు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందన్నారు. తెలంగాణకు రూ.3,048 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ.7,032 కోట్లు కేటాయించిందని వివరించారు.
కేటాయింపులు ఇట్లా..
ఎస్సీఆర్ జోన్‌లోని పలు ప్రాంతాల్లో లైన్ల విద్యుదీకరణ కోసం రూ.791 కోట్లు
రైల్వే లెవల్ క్రాసింగ్‌లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.758 కోట్లు
ట్రాక్ పునరుద్ధరణ పనుల కోసం రూ.1,040 కోట్లు
కాజీపేట వద్ద పీవోహెచ్ వర్క్ షాపు కోసం రూ.45 కోట్లు
మునీరాబాద్ – మహబూబ్‌నగర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణ ప్రాజెక్టు కోసం రూ.289 కోట్లు
భద్రాచలం– సత్తుపల్లి మధ్య లైన్ నిర్మాణానికి రూ.163 కోట్లు
మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ ప్రాజెక్టు పనులకు రూ.160 కోట్లు
అక్కన్నపేట – మెదక్ మధ్య కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు రూ.41 కోట్లు
కాజీపేట – విజయవాడ మధ్య మూడో లైన్ ప్రాజెక్టుకు రూ.592.5 కోట్లు
సికింద్రాబాద్ – మహబూబ్‌నగర్ మధ్య డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు రూ.150 కోట్లు
కాజీపేట – బల్హర్ష మూడో లైన్ కోసం రూ. 550.43 కోట్లు
గూటి – ధర్మవరం డబ్లింగ్ కోసం రూ. 100 కోట్లు
బై పాస్ లైన్ల కోసం రూ. 407 కోట్లు
పర్లి – వికారాబాద్ విద్యుదీకరణ కోసం రూ. 109 కోట్లు.
లింగంపేట – జగిత్యాల – నిజామాబాద్ విద్యుదీకరణ కోసం రూ. 39 కోట్లు
చర్లపల్లి శాటిలైట్ టర్మినల్ కోసం రూ. 70 కోట్లు
