
- కాంట్రాక్ట్.. రెగ్యులర్ కాలే
- ఈనెల 1నుంచి చేస్తామన్న ప్రభుత్వం
- నేటికీ విడుదల కాని గవర్నమెంట్ ఆర్డర్స్
- రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది ఎదురుచూపు
- హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలోనే 8వేల మంది
- తమను సర్కార్ ఏప్రిల్ ఫూల్స్ చేసిందని ఆవేదన
మంచిర్యాల, వెలుగు : రెగ్యులరైజేషన్ కోసం ఏడేండ్లుగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కు రాష్ర్ట ప్రభుత్వం మరోసారి హ్యాండిచ్చింది. రాష్ర్టవ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న 11 వేల మందిని ఏప్రిల్1న రెగ్యులరైజ్ చేస్తామని ఫిబ్రవరి 6న అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్‌లో ప్రకటించింది. తమ 20 ఏండ్ల కల నెరవేరనుందని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఖుషీ అయినప్పటికీ మళ్లీ నిరాశే మిగిలింది. నేటికి పదో తారీఖు వచ్చినా ప్రభుత్వం రెగ్యులరైజేషన్ ఆర్డర్స్ రిలీజ్ చేయకుండా తమను ఏప్రిల్ ఫూల్ చేసిందని మండిపడుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బడ్జెట్ లెక్కలే కారణమా...?
రాష్ర్ట ఆర్థిక పరిస్థితి కొన్నేండ్ల నుంచి రోజురోజుకూ దిగజారుతోంది. ఖజానా ఖాళీ కావడంతో రెగ్యులర్ ఎంప్లాయీస్‌కు నెలనెలా జీతాలు చెల్లించడానికే సర్కారు తిప్పలు పడుతోంది. ఆయా డిపార్ట్మెంట్ల వారీగా 20వ తారీఖు దాకా వేతనాలను అందిస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌ను రెగ్యులరైజ్ చేయడానికి సర్కారు సాహసించడం లేదని తెలుస్తోంది. 11వేల మంది ఎంప్లాయీస్ జీతభత్యాలకు నెలకు రూ.380 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.4వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేసింది. ఈ కారణంగానే ప్రభుత్వం కుంటిసాకులు చెప్తూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ ఎంప్లాయీస్‌తో సమానంగా కష్టపడుతున్నప్పటికీ సమాన వేతనం పొందలేకపోతున్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్‌కు వచ్చే జీతంలో సగం, అంతకంటే తక్కువతోనే సరిపెట్టుకుంటున్నారు. పీఆర్సీ, టీఏ, డీఏలు, హెచ్ఆర్ఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి అదనపు బెనిఫిట్స్ కు నోచులేకపోతున్నారు.
కల నెరవేరకుండానే రిటైర్మెంట్..
కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ విషయంలో సర్కారు 'ఒకడుగు ముందుకు... రెండడుగులు వెనక్కు' అన్నట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ప్రకటనలు చేయడం, కోర్టు కేసుల రూపంలో అడ్డంకులు రావడం పరిపాటిగా మారింది. చివరకు లీగల్ చిక్కులు తొలగిపోయి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసినప్పటికీ రెగ్యులరైజేషన్ ఆర్డర్స్ రాకపోవడంతో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నారాజ్ అవుతున్నారు. జీవో నంబర్ 16 ప్రకారం రాష్ర్టవ్యాప్తంగా 11వేల మందికి గాను మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలోనే మెజారిటీ సంఖ్యలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో సుమారు 5వేల మంది, హెల్త్ డిపార్ట్మెంట్లోని వివిధ విభాగాల్లో మరో 3వేల మంది ఉన్నారు. గత 23 సంవత్సరాలుగా రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తూ కొంతమంది రిటైర్ అయ్యారు. మరికొందరు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. తమ కల నెరవేరకుండానే పలువురు వివిధ కారణాలతో చనిపోయారు.
రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది..
రాష్ర్టంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇక ఉండరని, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ మేరకు 2016 ఫిబ్రవరి 26న ప్రభుత్వం రెగ్యులరైజేషన్ జీవో నంబర్ 16న రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన 2014 జూన్ 2కు ముందు పూర్తిస్థాయి కాంట్రాక్ట్ పద్ధతిలో నెలవారి పారితోషికాన్ని పొందుతున్న ఉద్యోగులను రెగ్యులైజ్ చేయడానికి గైడ్‌లైన్స్ జారీ చేసింది. రాష్ర్టవ్యాప్తంగా 2000 సంవత్సరం నుంచి వివిధ డిపార్ట్మెంట్లలో 11,103 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్టు లెక్క తేల్చింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ఎట్టకేలకు నిరుడు డిసెంబర్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఏప్రిల్ 1న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌ను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది.
సర్కార్ ఏప్రిల్ ఫూల్ చేసింది...
నేను ఇరవై ఏండ్ల నుంచి జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. నాతో సమానఈ సర్వీస్, సీనియారిటీ ఉన్న రెగ్యులర్ లెక్చరర్లకు రూ.లక్షకు పైగా వేతనం చెల్లిస్తుండగా, నాకు మాత్రం రూ.50వేల లోపే వస్తోంది. నాలాగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 5వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్నారు. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 11 వేల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌ను ప్రభుత్వం ఏప్రిల్ 1న రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మా అందరినీ ఏప్రిల్ ఫూల్స్‌ను చేసింది.
- నరేందుల రవీంద్రకుమార్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మంచిర్యాల