ఈ సమ్మర్​లో మస్త్ బీర్లు అమ్మాలె

ఈ సమ్మర్​లో మస్త్ బీర్లు అమ్మాలె
  • ఈ సమ్మర్​లో మస్త్ బీర్లు అమ్మాలె
  • ఐపీఎల్ కూడా ఉంది..సేల్స్ డబుల్ కావాలె
  • బార్లు, పబ్​లు, వైన్స్​కు ఎక్సైజ్​ శాఖ టార్గెట్
  • 2 నెలల్లో కోటిన్నర కేస్​ల బీర్లు అమ్మాలని ఒత్తిడి  
  • ఈ ఏడాది రూ.20 వేల కోట్ల ఆదాయానికి ప్లాన్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీర్ల అమ్మకాలను డబుల్ చేయాలని ఎక్సైజ్ శాఖకు సర్కార్ టార్గెట్ పెట్టింది. ఈ రెండు నెలలు సమ్మర్ కావడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఉండటంతో బీర్లు మామూలుగానే కాస్త ఎక్కువగా అమ్ముడుపోతాయని.. ఇదే అదునుగా అమ్మకాలు మరింత ఎక్కువగా జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ రెండు నెలల్లో యావరేజ్ కంటే రెట్టింపు స్థాయిలో సేల్స్ ఉండేలా చూడాలని ఆదేశించింది. దీంతో బార్లు, పబ్​లు, వైన్స్​లకు ఎక్సైజ్ శాఖ టార్గెట్లు పెట్టి మరీ సేల్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో దాదాపు కోటికిపైనే బీరు కేస్​లు అమ్ముడుపోయేలా ఆయా మద్యం డిపోల నుంచి లిఫ్ట్ చేయిస్తున్నారు. ఎక్కడా కూడా నో స్టాక్ అనకుండా.. ఆయా బ్రాండ్ల బీర్​లను అందుబాటులో ఉంచాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. రోజువారీ సేల్స్​ను బట్టి.. ఎక్కడైనా తక్కువ అమ్మకాలు జరిగితే సీరియస్ వార్నింగ్​లతో పాటు సేల్స్ పెంచేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయా వైన్​షాప్ ల ఓనర్లు  గ్రామాల్లో ఉండే బెల్ట్ షాప్​లకు ఉద్దెర బ్యారం మీద బీర్లు సప్లై చేస్తున్నారు. ఎండాకాలం చల్లని బీరు తాగేందుకు మద్యం ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. దానికి తోడు ఐపీఎల్ కూడా కలిసిరావడంతో మధ్యాహ్నం  నుంచే మ్యాచ్​లు వీక్షిస్తూ బీర్లను సేవిస్తున్నారు. ఈ టైంను మరింత క్యాష్ చేసుకునే విధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, సంగారెడ్డి సిటీ సెంటర్లతో పాటు మండల కేంద్రాల్లోనూ సేల్స్ పెంచుతున్నారు.   

ఈసారి బీర్ కేస్​లు 6 కోట్లు దాటాలె   

ఈ ఏడాది లిక్కర్ తో పాటు బీర్ కేస్​లను మరింతగా పెంచాలని ఎక్సైజ్ శాఖ టార్గెట్ గా పెట్టుకున్నది. గతేడాది కంటే కోటిన్నర కేసుల బీర్లు ఎక్కువగా అమ్మాలని అనుకుంటున్నది. పోయిన ఆర్థిక సంవత్సరంలో 4.78 కోట్ల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈసారి ఐఎంఎల్ లిక్కర్ కేస్​లు కూడా 4 కోట్ల కేస్​లకు పెంచాలని ప్లాన్ చేశారు. కానీ బీర్ల సేల్స్​కు ఏప్రిల్, మే నెలలే కీలకం కావడంతో వాటి అమ్మకంపైనే ఎక్సైజ్ శాఖ ప్రధానంగా దృష్టి పెట్టింది. రోజుకు యావరేజ్​గా 4 లక్షల కేసుల బీర్లు అమ్మాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఐపీఎల్ మొదలైన మార్చి 31వ రోజు ఏకంగా 4.33 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఈ నెల 4న 3.50 లక్షల కేసుల బీర్లు అమ్మినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా సెలవు కారణంగా మద్యం డిపోల నుంచి లిక్కర్, బీర్ లిఫ్ట్ చేయకపోతే.. ఆ తర్వాతి రోజు రెట్టింపు స్థాయిలో కేస్​లు లిఫ్ట్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఇలా ఈ రెండు నెలల్లో కోటిన్నర కేస్​ల బీర్లు అమ్ముడుపోయేలా చేయాలని చూస్తున్నారు. గతేడాది ఒక్క ఏప్రిల్‌లోనే 49.92 లక్షలు, మే నెలలో 55.72 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. గత మూడు నెలల్లో బీర్ల అమ్మకాలు చూస్తే.. జనవరిలో 34.23 లక్షల కేసులు, ఫిబ్రవరిలో 38 లక్షలు, మార్చిలో 47.59 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.

 రూ. 20 వేల కోట్ల ఆదాయం టార్గెట్​

పోయిన ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ అమ్మకాలతో వ్యాట్ కాకుండా వచ్చిన ఇన్​కం దాదాపు రూ.19 వేల కోట్లుగా ఉంది. ఈసారి ఇంకో వెయ్యి కోట్లు అదనంగా పెంచుకోవాలని ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టుకున్నది. 2021–22లో రూ.30,783 కోట్ల విలువైన 3.7 కోట్ల లిక్కర్ కేస్​లు, 3.47 కోట్ల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. అదే 2022–23 సంవత్సరానికి వచ్చేసరికి రూ.35,148 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్ముడయింది. ఇందులో 3.51 కోట్ల లిక్కర్​, 4.78 కోట్ల బీర్ కేస్​లు ఉన్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖకు (వ్యాట్ కాకుండా) వచ్చిన ఆదాయం రూ.19 వేల కోట్లుగా ఉన్నది. ఈసారి దాదాపు రూ.20 వేల కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.