- బిల్లులోని అంశాలను మార్చే యోచనలో సర్కారు
- స్క్రీనింగ్ టెస్ట్ బోర్డుకే.. భర్తీ బాధ్యత వర్సిటీలకే అప్పగించే చాన్స్
- గతంలో వెనక్కి తీసుకున్న ఫైల్‌ను సరిచేసే పనిలో ఆఫీసర్లు
- లీగల్ చిక్కులు, పైరవీలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఏ వర్సిటీకి ఆ వర్సిటీ సొంతంగా నోటిఫికేషన్లు ఇచ్చుకునే వెసులుబాటును పక్కనపెట్టి, మళ్లీ ‘కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు’ ద్వారానే నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనితో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడొచ్చని సర్కారు యోచిస్తోంది.
ప్రధానంగా యూనివర్సిటీ నియామకాల్లో జరిగే పైరవీలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. ఇందుకోసం గతంలో రూపొందించిన కామన్ బోర్డు బిల్లులోని వివాదాస్పద అంశాలను సవరించి, కొత్త గైడ్ లైన్స్ ఇచ్చే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం అసెంబ్లీలో ‘కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు’ బిల్లును పాస్ చేసింది. అయితే, దీనిపై అప్పటి గవర్నర్ తమిళిసై సందేహాలు వ్యక్తం చేస్తూ ఫైల్‌ను రాష్ట్రపతికి పంపారు.
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా బోర్డు ఏర్పాటు ఉందంటూ కేంద్ర హోంశాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీంతో నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసి మళ్లీ పంపిస్తామని తాజాగా ప్రస్తుత సర్కారు ఆ ఫైల్‌ను వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని యూజీసీకి విద్యాశాఖ ఆఫీసర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టు ఉద్యోగులను మినహాయించి, మిగిలిన పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే, ఆ పోస్టులను మినహాయిస్తే రోస్టర్ పాయింట్లలో ఇబ్బందులు వచ్చే చాన్స్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సమస్యకు న్యాయపరమైన ఆటంకాలు ఎదురవ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
- ఆలస్యమవుతుందనే ‘హైబ్రిడ్’ మోడల్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత ఏ యూనివర్సిటీకి ఆ వర్సిటీయే ఖాళీలను నింపుకునేలా అనుమతినిస్తూ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కానీ, రాష్ట్రంలో ఎక్కువ యూనివర్సిటీలు ఉండటంతో, అవి విడివిడిగా నోటిఫికేషన్లు ఇస్తే ప్రక్రియ ఏళ్ల తరబడి సాగుతుందని, రోస్టర్ పాయింట్లు, మెరిట్ లిస్టుల విషయంలో కన్ఫ్యూజన్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
అందుకే స్ర్కీనింగ్ టెస్టు నిర్వహించి, ఫలితాలు ఇచ్చే బాధ్యతను మాత్రమే బోర్డుకు అప్పగించి.. ఆ తర్వాత మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం అపాయింట్‌మెంట్ ఇచ్చే బాధ్యతను వర్సిటీలకు వదిలేయాలనే ‘హైబ్రిడ్ మోడల్’ను పరిశీలిస్తున్నారు. ఈ లెక్కన కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్న పోస్టులను మినహాయించి, సుమారు 440 వరకూ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
- యూజీసీ నిబంధనలకే మొగ్గు
గతంలో కేంద్ర హోం శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, యూజీసీ నిబంధనలకు లోబడి ఈ బోర్డు విధివిధానాలను రూపొందించాలని సర్కారు నిర్ణయించింది. బోర్డు కేవలం ఒక ఏజెన్సీలా పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుందని, తుది ఎంపికలో వర్సిటీల స్వయంప్రతిపత్తికి భంగం కలగదని స్పష్టం చేయనుంది.
త్వరలోనే దీనిపై సర్కారు పెద్దలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఆరు నెలల్లోగా ఈ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకురావాలని, లేకపోతే నియామకాలు మరింత జాప్యం అయ్యే ప్రమాదం ఉందని విద్యాశాఖ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
