
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మేడారంలో సమ్మక్క- సారలమ్మ జాతరకు మరో నాలుగు నెలలే మిగిలుంది. కానీ ఏటూరునాగారం ఐటీడీఏకు నేటికీ రెగ్యులర్ పీవోను సర్కారు నియమించలేదు. దగ్గర దగ్గర కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశమున్న జాతరకు ఆ స్థాయిలో ఏర్పాట్లు, పర్యవేక్షణ అవసరం. కానీ లీడర్లు, ఆఫీసర్ల అవినీతి కారణంగా జాతర పనులు ప్రతిసారీ నాసిరకంగా జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఐటీడీఏకు ఐఏఎస్ ఆఫీసర్‌ను పీవోగా నియమించి జాతర ఏర్పాట్లను, పనులను పకడ్బందీగా చేపట్టాల్సిన సర్కారు.. ఇప్పటికే రెండు జిల్లాలకు కలెక్టర్‌గా ఉన్న కృష్ణ ఆదిత్యకే ఇన్చార్జి పీవోగా బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో నాసిరకం పనులు
ఏటూరునాగారం ఐటీడీఏకు పర్మినెంట్ పీవో ఉన్న టైంలోనే మేడారం మహా జాతర పనులు అత్యంత నాసిరకంగా జరిగాయి. కాంట్రాక్టర్ల ముసుగులో లీడర్లు.. జాతర ముందు హడావిడిగా పనులు చేపట్టి, కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారు. జంపన్నవాగులో మూడుచోట్ల రూ.12 కోట్లతో చెక్‌డ్యాంలు నిర్మించగా, ఏడాది గడవక ముందే ఒక చెక్ డ్యాం కొట్టుకుపోయింది. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ, గిరిజన సంక్షేమ శాఖ తరఫున రూ.2 కోట్లతో 6 షెడ్లను నిర్మించారు. లూజ్ మట్టిలోనే బేస్‌మెంట్లు కట్టడం, సిమెంట్ కాంక్రీట్ పనులకు వాటర్ క్యూరింగ్ చేయకపోవడంతో ఏడాది గడవక ముందే ఆ షెడ్లు పాడైపోయాయి. తాడ్వాయి నుంచి నార్లాపూర్ వరకు రూ.1.20 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు వేసిన రెండు రోజులకే పైకి తేలింది. కల్వర్టులను సీసీతో కాకుండా మట్టితో నిర్మించి చేతులు దులుపుకొన్నారు. జంపన్నవాగు పక్కనే ఉన్న రోడ్డు నుంచి కన్నెపల్లి వరకు గతంలో సీసీ రోడ్డు వేశారు. అది దెబ్బతిన్నదని 2018లో రూ.30 లక్షలకు పైగా ఖర్చుచేసి సీసీ రోడ్డుపై కొత్తగా బీటీ వేశారు. రెండేళ్లు గడిచేసరికి బీటీ మొత్తం కొట్టుకుపోయి సీసీ రోడ్డు కనిపిస్తోంది. ఇలా మేడారంలో గతంలో జరిగిన పనుల్లో నాణ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు పీవో కూడా లేకపోతే పనులపై కనీస పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లు, లీడర్లకు అడ్డూ అదుపు ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే పీవోను నియమించి, మేడారం పనులు క్వాలిటీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నేతలు కోరుతున్నారు.
ఆగస్టు నుంచి పీవో పోస్టు ఖాళీ
ఉమ్మడి వరంగల్‌జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏను 1985లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది ఆరు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. తాడ్వాయి మండలంలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతర కూడా ఈ ఐటీడీఏ పరిధిలోకే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులన్నింటినీ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నుంచే విడుదల చేస్తుంది. ఈ జాతర కోసం ఇప్పటికే రూ.112 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు ప్రపోజల్స్పంపించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. పనుల టెండర్ల దగ్గర నుంచి పర్యవేక్షణ దాకా ఐటీడీఏ పీవో దగ్గరుండి చూసుకోవాలి. వాస్తవానికి ఐటీడీఏ పరిధిలో ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్ లాంటి కొన్ని కీలక శాఖలతో పాటు 29 శాఖలు పని చేస్తాయి. ఇంతటి కీలకమైన ఐటీడీఏకు గతంలో సర్కారు ఐఏఎస్ ఆఫీసర్లను పర్మినెంట్ ఐటీడీఏ పీవోలుగా నియమించేది. కానీ కొంతకాలంగా ఏటూరునాగారం ఐటీడీఏపై సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. ఇక్కడ 18 నెలల పాటు పీవోగా సేవలందించిన హన్మంతు ఆగస్టు 10న బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి రెగ్యులర్ పీవో పోస్టు ఖాళీగానే ఉంటుండగా, భూపాలపల్లి, ములుగు జిల్లాల కలెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణ ఆదిత్యకు ప్రభుత్వం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది.