విద్యావ్యవస్థపై సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది

విద్యావ్యవస్థపై సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది

రాష్ట్రంలో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు వారి పిల్లల్ని చదివించేందుకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫీజుల కోసం పేరెంట్స్​వారి రక్తాన్ని  ప్రైవేటు, కార్పొరేటు సంస్థల కాళ్ల దగ్గర ధారపోస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే బలపడిన ప్రైవేటు, కార్పొరేట్ శక్తులను ప్రస్తుత  ప్రభుత్వం భుజస్కందాలపై మోస్తూ మరింత వేళ్లూనుకునేందుకు మార్గం సుగమం చేసింది. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సర్కారు.. వాటిని నిర్లక్ష్యం చేస్తోంది. విద్యా సంస్థ నిర్వహణ లాభాపేక్ష లేకుండా, సమాజానికి ఉపయోగకరంగా ఉండాలని ఉన్నికృష్ణన్ వర్సెస్​ ఏపీ ప్రభుత్వం కేసులో సుప్రీం చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్19(1) ప్రైవేట్ విద్యాసంస్థలను నెలకొల్పే హక్కునిచ్చింది. కానీ విచ్చలవిడిగా వ్యాపారం చేస్తే ప్రభుత్వానికి నియంత్రించే హక్కు ఉంటుందని19(6) ఆర్టికల్ లో పేర్కొన్నది.

1982 నాటి ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టం సెక్షన్20(A) వ్యక్తుల వ్యక్తిగత హోదాలో విద్యాసంస్థలను నెలకొల్పడాన్ని నిషేధించి, సొసైటీలు, ట్రస్టులు మాత్రమే విద్యాసంస్థలను నెలకొల్పాలని పేర్కొన్నది. సొసైటీలు లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు మాత్రమేనని భారతీయ సొసైటీల చట్టం చెబుతున్నది.1983 నాటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటేషన్ ఫీజు నియంత్రణ చట్టం డొనేషన్లు, అడ్మిషన్ ఫీజులు, వన్ టైం ఫీజులు వసూలు చేయడాన్ని నిషేధించింది. అక్రమంగా అధిక ఫీజులు  వసూలు చేస్తే 3 నుంచి 7 ఏండ్ల జైలు శిక్ష విధించాలనే చట్టం ఉన్నప్పటికీ ప్రభుత్వ చర్యలు శూన్యం. ఫీజులు నియంత్రణ అధికారం  ప్రభుత్వానికుందని డీఎఫ్ఆర్ సీలు ఏర్పాటు చేసే అధికారం కూడా ఉందని ఇటీవల జీ.వో 91 కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

అన్ని విద్యా సంస్థలు ఆగం..

తెలంగాణ రాష్ట్రంలో పేద, బడుగు బలహీన, ఆర్థికంగా వెనుక బడిన వర్గాల విద్యార్థులు చదువుకునే సర్కారు బడులు ఎనిమిదేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సర్వేలు తేల్చాయి. దాదాపుగా అన్ని సర్వేల్లో తెలంగాణ చివరి వరుసలో ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాజకీయ అనిశ్చితి ఉన్న ప్రతీ సందర్భంలో ప్రభుత్వం ఎదో ఒక సంచలనానికి తెర లేపడం అందరికీ విదితమే. అందులో భాగంగానే జనవరిలో విద్యారంగంలో సమూల మార్పులు తెస్తామని, ఈ మేరకు కేబినెట్ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామని, వసతులు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి చెప్పారు. కానీ అకడమిక్​ఇయర్​ ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. పూర్తి స్థాయిలో బుక్స్, యూనిఫామ్స్​రాలేదు. పాఠాలు చెప్పేందుకు టీచర్లు లేరు. సౌలత్​లు సరిగా లేవు. ఇలా ఎన్నో సమస్యలతోనే బడులు నడుస్తున్నాయి.

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గురుకులాలు కూడా సర్కారు నిర్లక్ష్య వైఖరితో ఆగమైతున్నాయి.  వాటికి పక్కా భవనాలు నిర్మించడంలో సర్కారు శ్రద్ధ చూపడం లేదు. మరో వైపు విద్య, భోజన వసతి కల్పించడంలోనూ విఫలమైంది. ఇటీవల కాలంలో 50 కి పైగా సంక్షేమ, గురుకుల, మైనారిటీ వసతి గృహాల్లో ఫుడ్​పాయిజనై విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఇంటర్​ విద్యలోనూ సమస్యలే. రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించకుండా గెస్ట్ ఫ్యాకల్టీతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కోర్సులు, అడ్మిషన్స్ పెంచడం స్వాగతించదగ్గ అంశమే అయినా ఆ మేరకు వసతులు, ఫ్యాకల్టీని పెంచాలి. 

ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలె.

రాష్ట్రంలో తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్​ఆర్​సీ) సూచనలు పాటించకుండా, ఇష్టానుసారం కొత్తగా ప్రైవేట్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం, అవి అధిక ఫీజులు వసూలు చేస్తున్నా.. పట్టించుకోక పోవడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలుపుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కేంద్రాలుగా నిలిచిన యూనివర్సిటీలు స్వరాష్ట్రంలో నిధులు లేక, నియామకాలు లేక అధ్వాన స్థితిలో కొనసాగుతున్నాయి. వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా, ప్రతిష్టాత్మకమైన కాకతీయతో సహా ఇతర వర్సిటీలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో  అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బడులను, కాలేజీలను, యూనివర్సిటీలను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి. సంక్షేమ, గురుకులాల్లో అన్ని వసతులు కల్పించాలి. 

- జీవన్
ఓయూ రీసెర్చ్ స్కాలర్, ఏబీవీపీ సేట్ట్ వరిక్ంగ్ కమిటీ మెంబర్