నిధులు లేక నీరసిస్తున్న లోకల్ బాడీస్

నిధులు లేక నీరసిస్తున్న లోకల్ బాడీస్

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలోని  గోదావరి, మానేరుతో పాటు ఇతర నదుల్లోని ఇసుక రీచ్​ల ద్వారా ఏటా వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న సర్కారు దానిపై స్థానిక సంస్థలకు వచ్చే రాయల్టీని తన ఖాతాలో వేసుకుంటోంది. దాదాపు మూడేండ్లుగా రాయల్టీ చెల్లించకపోవడంతో రాష్ర్టవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. గతంలో అన్ని రకాల మైనింగ్​కార్యకలాపాలపై లోకల్​బాడీస్​కు రాయల్టీ వస్తుండగా ప్రభుత్వం వాటన్నింటిని రద్దు చేసి ఇసుకపై మాత్రమే చెల్లిస్తోంది. కొంతకాలంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, ఇసుక రాయల్టీ రాకపోవడంతో చిన్న చిన్న పనులు చేయాలన్నా ఫండ్స్​ లేక స్థానిక సంస్థల ప్రతినిధులు పరేషాన్​అవుతున్నారు.  

సాండ్​టాక్సీతో దండిగా ఆదాయం 

ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వానికి సాండ్​ పాలసీ అంటూ లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరిగినప్పటికీ అరకొర ఆదాయమే వచ్చేది. తెలంగాణలో టీఆర్ఎస్ ​ప్రభుత్వం వచ్చాక ఇసుక రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించింది. 2015 జనవరిలో సాండ్​ టాక్సీ పాలసీ (ఆన్​లైన్​ బుకింగ్​)ని తీసుకొచ్చింది. టీఎస్ఎండీసీ (తెలంగాణ స్టేట్​మినరల్ ​డెవలప్​మెంట్​ కార్పొరేషన్​) ద్వారా గోదావరి, మానేరు, మంజీరా, మూసీ, కృష్ణా నదులతో పాటు పట్టా భూముల్లో ఇసుక రీచ్​లకు పర్మిషన్​ ఇచ్చింది. ఈ రీచ్​ల ద్వారా ఏటేటా ఇసుక అమ్మకాలు పెరుగుతూ, అదే స్థాయిలో ప్రభుత్వానికి రాబడి సైతం పెరిగింది. రాష్ర్టవ్యాప్తంగా 2014–15 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం అక్టోబర్​ 14 వరకు 9.47 కోట్ల మెట్రిక్​ టన్నుల ఇసుక రవాణాకు రూ.5,193 కోట్ల ఆదాయం సమకూరింది.  

రాయల్టీ, డీఎంఎఫ్​ ఇలా.. 

టీఎస్ఎండీసీ ద్వారా జరిగిన ఇసుక అమ్మకాలపై క్యూబిక్ మీటర్​కు రూ.40 చొప్పున రాయల్టీ, దానిపై 30శాతం డీఎంఎఫ్ (డిస్ర్టిక్ట్​ మినరల్ ​ఫండ్​) చెల్లించాలి. కానీ ఆన్​లైన్​లో ఇసుక బుక్ చేసుకున్న డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయి. అందులో నుంచి రాయల్టీని టీఎస్ఎండీసీ ద్వారా మైనింగ్ డిపార్ట్​మెంట్​కు రిలీజ్ చేస్తే అక్కడి నుంచి జడ్పీ అకౌంట్​లో జమ చేయాలి. ఇందులో జిల్లా పరిషత్​లకు 25 శాతం, మండల పరిషత్​లకు 50 శాతం, సంబంధిత గ్రామ పంచాయతీలకు 25 శాతం నిధులు కేటాయించాలి. కానీ మూడేండ్లుగా  ఆ పని చేయడం లేదు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గోదావరిలో 40 లక్షల 42వేల క్యూబిక్​ మీటర్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం 2020లో పర్మిషన్​ఇచ్చింది.టీఎస్​ఎం డీసీ 5 లక్షల క్యూబిక్​ మీటర్ల చొప్పున ఎనిమిది రీచ్​లుగా విభజించి ఇసుక అమ్మకాలు చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ ​12 వరకు 28 లక్షల క్యూబిక్​ మీటర్ల ఇసుక రవాణా జరిగింది. స్థానిక సంస్థలకు రాయల్టీ క్యూబిక్​ మీటర్​పై రూ.40 చొప్పున రూ.11.20 కోట్లు, దీనిపై 30 డీఎంఎఫ్​ కలిపి మరో రూ.3.36 కోట్లు.. మొత్తం రూ.14.56 కోట్లు రావాల్సి ఉంది.   

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 2020 మార్చి నుంచి ఇసుక అమ్మకాల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఈ జిల్లాలో అమ్మిన ఇసుకకు సంబంధించి రూ.30 కోట్ల రాయల్టీ నిధులు స్థానిక సంస్థలకు ఇవ్వాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంది.