టెన్త్‌‌ అయ్యాక ఏడ చదువాలె?

టెన్త్‌‌ అయ్యాక ఏడ చదువాలె?

మహబూబ్​ నగర్​, వెలుగు :
కేజీ టూ పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్‌‌‌‌ అందిస్తున్నామని చెబుతున్న సర్కారు అందుకు తగ్గ ఏర్పాట్లు మాత్రం చేయడం లేదు.  టెన్త్ కంప్లీట్ చేసిన స్టూడెంట్లు ఇంటర్‌‌‌‌‌‌‌‌ చదవాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో 72 మండలాలు ఉండగా.. 25 మండలాల్లో జూనియర్‌‌‌‌‌‌‌‌ కాలేజీలు లేవు.  కాలేజీల ఏర్పాటు కోసం ఆఫీసర్లు ప్రతి ఏటా ప్రపోజల్స్‌‌‌‌ పంపుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో స్టూడెంట్లు పక్కమండలాలు, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కాలేజీలకు వెళ్తున్నారు. చాలావరకు స్థానికంగా ఉన్న ప్రైవేట్ కాలేజీల్లోనే జాయిన్ అవుతున్నారు.  ప్రైవేటులో డబ్బులు కట్టే స్థోమత లేనివారు టెన్త్‌‌‌‌తోనే చదువును ఆపేస్తున్నారు. 

41,992 మంది స్టూడెంట్లు టెన్త్ పాస్
ఈ ఏడాది పాలమూరులో 11,575 మంది స్టూడెంట్లు, నాగర్​కర్నూల్​లో 10,171, వనపర్తిలో 6,408,  గద్వాలలో 6,783, నారాయణపేటలో 7,055 మంది కలిపి 41,992 మంది టెన్త్​పాస్​ అయ్యారు. వీరంతా ఈ అకడమిక్​ ఇయర్​ నుంచి జూనియర్ కాలేజీల్లో జాయిన్ అవుతున్నారు. ఇందులో జిల్లా కేంద్రాలు, జూనియర్‌‌‌‌‌‌‌‌ కాలేజీలు ఉన్న మండలా పరిధిలో ఉన్న  స్టూడెంట్స్‌‌‌‌ ఒకే గాని, కాలేజీలు లేని ఏరియాలో ఉన్న స్టూడెంట్లు ప్రాబ్లమ్స్ ఫేస్​చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో మేజర్ పంచాయతీలు, మండలాల కేంద్రాలకు కాలి నడకన వెళ్లి, అక్కడి నుంచి బస్సులో కాలేజీలకు చేరుతున్నారు. బస్సు కొంచెం లేట్​అయినా టైమ్‌‌‌‌కు కాలేజీకి చేరుకోలేకపోతున్నారు. సాయంత్రం నాలుగున్నరకు కాలేజీ వదిలినంక ఇంటికి వచ్చేసరికి రాత్రి అవుతోంది. 
 47 మండలాల్లో కాలేజీలు. 
పాలమూరు జిల్లాలో 16 మండలాలు ఉండగా హన్వాడ, మహ్మదాబాద్, గండీడ్​, రాజాపూర్​, మూసాపేట, చిన్నచింతకుంట మండలాల్లో ,  నారాయణపేట జిల్లాలో 11 మండలాలు ఉండగా కృష్ణ, నర్వ, మరికల్, దామరగిద్ద మండలాల్లో,  గద్వాల జిల్లాలో 12 మండలాలు ఉండగా కేటీదొడ్డి, ఉండవెల్లి, రాజోలి, ఇటిక్యాల, శాంతినగర్​ మండలాల్లో, నాగర్​కర్నూల్​జిల్లాలో 20 మండలాలు ఉండగా లింగాల, తెల్కపల్లి, ఉప్పునుంతల, ఊర్కొండ, పెద్ద కొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో, వనపర్తి జిల్లాలో13 మండలాలు ఉండగా.. మదనాపురం, చిన్నంబావి, రేవల్లి, శ్రీరంగాపురం మండలాల్లో గవర్నమెంట్ జూనియర్​ కాలేజీలు లేవు.  ఇందులో 11 మండలాలు కాగా.. 14 పాతవి మండలాలు.  

ప్రపోజల్స్​పంపినా అప్రూవ్​ ఇవ్వట్లే
 పాలమూరు జిల్లాలోని ఉమ్మడి గండీడ్, హన్వాడ, చిన్నచింతకుంట మండలాల్లో కాలేజీల ఏర్పాటు కోసం హయ్యర్​ ఎడ్యుకేషన్​కు ప్రతిపాదనలు పంపినా ఇంత వరకు సాంక్షన్‌‌‌‌ ఇవ్వట్లేదు.  ఉమ్మడి గండీడ్​ మండలంలోని మహ్మదాబాద్‌‌‌‌లో జూనియర్​ కాలేజీని ఏర్పాటు చేయాలని కమిషనర్​ ఆఫ్​ ఇంటర్మిడియట్​ బోర్డ్​ (సీఐఈ)కు నవంబరు 25, 2014లో ప్రతిపాదన పంపారు. సర్వే నంబర్​ 414లో రెండు ఎకరాల స్థలం కూడా అందుబాటులో ఉందని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత  మే 18, 2016లో కాలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ (సీడీఈ)ని ఏర్పాటు చేశారు. అలాగే కార్పస్​ ఫండ్ కింద రూ.3.12 లక్షల డిపాజిట్​ చేయడానికి కూడా ముందుకు వచ్చారు.   అయినా ఇప్పటి వరకు సాంక్షన్ ఇవ్వలేదు. 

ప్రైవేట్​కాలేజ్​లో చదువుతున్న
మాకు దగ్గరలో గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీ లేదు. దీంతో నంచర్ల గేట్​లో ఉన్న ఓ ప్రైవేట్​ కాలేజ్​లో చేరిన. ప్రస్తుతం సెకండ్​ ఇయర్​ చదువుతున్న. పాలమూరు, పరిగి గవర్నమెంట్​ కాలేజీలు ఉన్నయి. కానీ, చాలా దూరం. అందుకే మా ఇంట్లో వాళ్లు ఇక్కడి ప్రైవేట్​ కాలేజీ​లో చేర్పించారు. ఈ కాలేజీ కూడా మా ఊరి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- విజయలక్ష్మి, షేక్​పల్లి, మహ్మదాబాద్​ మండలం

చదువనీకె టైమ్‌‌ దొర్కుతలేదు
మా మండలంలో గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీ​ లేదు. దీంతో నేను పాలమూరులోని  ఎంవీఎస్​ జూనియర్​ కాలేజీ​లో బైపీసీ ఫస్ట్​ ఇయర్​లో జాయిన్​ అయ్యా. మా ఊరి నుంచి ఈ కాలేజీ 30 కిలోమీటర్ల దూరం ఉంది. రోజూ 60 కిలోమీటర్లు తిరగాల్సి వస్తోంది. టైం మొత్తం తిరగడానికే పోతోంది. చదువుకోవడానికి టైం కూడా దొరుకుతలేదు.  
-ప్రవీణ్​ కుమార్, గాధిర్యాల్​, మహ్మదాబాద్ మండలం