- ఆరు నెలల కింద వరదలతో ఐదు జిల్లాల్లో తీవ్ర నష్టం
- నీట మునిగిన వేలాది ఎకరాల పంటలు
- ఒక్క రూపాయి పరిహారం కూడా రాలే
జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్రంలో ఆరు నెలల కింద కురిసిన భారీ వర్షాలు గోదావరి పరివాహక ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. 36 ఏండ్ల తర్వాత గోదావరి ఉగ్రరూపం దాల్చి తీర గ్రామాలను ముంచెత్తింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇండ్లు, వాకిలి వదిలేసి అడవుల్లో తలదాచుకున్నారు. మరికొందరు ప్రభుత్వ పునరావాస కేంద్రాలను ఆశ్రయించారు. వీరికి ప్రభుత్వ సాయం ఇంతవరకు అందలేదు.
రెండు జిల్లాల్లో పర్యటించిన సీఎం
గోదావరి వరద ముంపు ప్రాంతాల పరిశీలన కోసం జూలై 18న భద్రాచలం, ములుగు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేవలం భద్రాచలం జిల్లాలోనే రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని మాటిచ్చారు. భద్రాచలం, ములుగు జిల్లాల్లో కరకట్టలు కట్టి వరద గ్రామాల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తామన్నారు. ఇండ్లు కూలిపోయి రోడ్డున పడ్డ పేదలకు కొత్తిండ్లు కట్టిస్తామని, మునిగిపోయిన పంటలకు పరిహారం ఇస్తామని అభయమిచ్చారు. కానీ భూపాలపల్లి, ములుగు, భద్రాచలం జిల్లాల్లోని 25,955 బాధిత కుటుంబాలకు 25 కిలోల చొప్పున బియ్యం, రూ.10 వేల నగదు అందించి చేతులు దులుపుకున్నారు.
కొత్త ఇండ్ల నిర్మాణాలకు పైసలియ్యలే!
అధికారిక లెక్కల ప్రకారమే ఐదు జిల్లాల్లో 25,955 కుటుంబాలు వరద ముంపునకు గురయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో 955 ఇండ్లు పాక్షికంగా, 51 ఇండ్లు పూర్తిగా, ములుగు జిల్లాలో 184 ఇండ్లు పాక్షికంగా, 25 ఇండ్లు పూర్తిగా, పెద్దపల్లి జిల్లాలో 18 ఇండ్లు పూర్తిగా, 591 ఇండ్లు పాక్షికంగా నేల మట్టమయినట్లు ఆఫీసర్లు ప్రభుత్వానికి రిపోర్ట్ పంపారు. కానీ, ప్రభుత్వం ఒక్కరికి కూడా కొత్తిల్లు కట్టివ్వలేదు. బాధితులు ఇల్లు నిర్మించుకోవడానికి నిధులివ్వలేదు. వర్షాలు, వరదలతో నీట మునిగిన ప్రతి ఇంట్లో కరెంటు మీటరు సహా, గదుల్లో లైట్లు, ఫ్యాన్లు, మంచాలు, బట్టలు, గిన్నెలు, కూలర్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు పాడైపోయాయి. బురదతో బియ్యం తడిసిపోగా, బట్టలు పనికిరాకుండా పోయాయి. పూరి గుడిసెలు నేలమట్టమయ్యాయి.
కరకట్ట పనులు మొదలుకాలే!
వరదలతో యేటా వేలాది మంది ఇండ్లు మునిగి నిరాశ్రయులవుతున్నారు. జూలై నెలలో వర్షాలకు మంచిర్యాల, మంథని, భధ్రాచలం వంటి పట్టణాలు నీట మునిగాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాచలం జిల్లాల్లో వందలాది గ్రామాల ప్రజలు ఊళ్లొదిలి అడవుల్లో తలదాచుకున్నారు. వరద ముంపును తప్పించడానికి శాశ్వత పరిష్కారంగా గోదావరి నది పొడవునా కరకట్టలు నిర్మిస్తామని సీఎం ములుగు జిల్లా రామన్నగూడెం పర్యటన సందర్భంగా జూలై18న హామీ ఇచ్చారు. తాను హైదరాబాద్‌కు వెళ్లగానే ములుగు, భద్రాచలం జిల్లాల్లో కరకట్ట పనులు మొదలవుతాయన్నారు. ఇది జరిగి ఆరునెలలవుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. మళ్లీ భారీ వర్షాలు పడితే ఊళ్లు మునగడం ఖాయమని బాధితులు అంటున్నారు.
పంటలు మునిగితే పరిహారం అందించలే!
వరదల కారణంగా భూపాలపల్లి, ములుగు, భద్రా చలం జిల్లాలలో అత్యధిక పంటలకు నష్టం వాటిల్లింది. భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌పూర్, పలిమెల, ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాలలోని వేలాది ఎకరాలు మునిగాయి. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ తో, అన్నారం బ్యారేజీ డౌన్ స్ట్రీమ్ వాటర్‌తో మహదేవపూర్ మండలంలోని పొలాలు, చేన్లు ఇసుక మయమయ్యాయి. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో 18 వేల ఎకరాలు మునగ్గా, 5 వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. మూడు జిల్లాల్లో 50 వేల ఎకరాలకు పైగా పంటలకు నష్టం కలిగినట్లు ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ఆఫీసర్లు నివేదికలు పంపారు. ఆరు నెలలవుతున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్ లో గతేడాది జూలై 9న ఇల్లు కూలి జయమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగర్ కు చెందిన జయమ్మ తన అల్లుడు నీలకంఠ సత్యనారాయణ ఉంటున్న గాంధీనగర్ కు వచ్చారు. ములుగు ఏజెన్సీలో వర్షానికి గోడలు నానిపోయి తెల్లవారుజామున ఇల్లు నేలమట్టమైంది. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న జయమ్మ అక్కడికక్కడే మరణించింది. అయినా ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి నయాపైసా రాలేదు.
భూపాలపల్లి జిల్లాలో గత జూలై నెలలో కురిసిన భారీవర్షాల ప్రభావంతో పంట చేలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో ఈ ఒక్క జిల్లాలోనే 32,607 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారికంగా గుర్తించి రూ.16 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇది జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా ప్రభుత్వం నుంచి రూపాయి పరిహారం రాలేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత జూలైలో వర్షాలకు బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలంలో కలిపి 15 వేల ఇండ్లు మునిగాయి. తిండి లేక, ఇంట్లో ఉండే పరిస్థితులు లేక వేలాది మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. వీరిని ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ రూ.1,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. కానీ కుటుంబానికి 25 కిలోల రైస్, కిలో కందిపప్పు, రూ.10 వేల చొప్పున పరిహారం అందించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కరకట్ట పనులు ఇంకా మొదలే పెట్టలేదు.
రూ.లక్షన్నర వరకు నష్టపోయా
మేడిగడ్డ బ్యారేజీకి దగ్గరలో ఎకరానికి రూ.40 వేల చొప్పున రూ.1.20 లక్షలు చెల్లించి మూడెకరాల భూమి కౌలుకు తీసుకున్న. ఖరీఫ్‌లో పత్తి పంట సాగు చేసి రబీ సీజన్ నాటికి మిర్చి వేయడం అలవాటు. ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెట్టి మూడెకరాల్లో పత్తి గింజలు నాటిన. జూలై నెలలో కురిసిన వర్షాలకు గోదావరి ఉప్పొంగి వారం రోజుల పాటు నీళ్లున్నాయి. దీంతో పంట నాశనమైంది. మేడిగడ్డ బ్యారేజీ కరకట్ట తెగి భూమి అంతా కోతకు గురైంది. దీంతో నాకు ఒక్కనికే రూ.లక్షన్నర నష్టం జరిగింది. ప్రభుత్వం నుంచి నయాపైసా రాలే.
- గద్దె దేవేందర్, బొమ్మాపూర్ రైతు, మహాదేవపూర్ మండలం