ఆరు మ్యాచుల్లో ఫైనల్ వరకు వెళ్లి తప్పుకున్న జిమ్నాస్ట్

V6 Velugu Posted on Aug 03, 2021

టోక్యో ఒలింపిక్స్​లో సిమోన్​ బైల్స్​కు ట్విస్టీస్​ అనే మానసిక రుగ్మత అడుగడుగునా అడ్డుపడుతోంది. కుంగదీస్తోంది. రేపు ఏమవుతుందోనని భయపెడుతోంది. అందుకే ఆ గాయంపై గెలవడానికి ఐదు ఈవెంట్స్​లో  ఓటమిని ఒప్పుకుంది ఈ  అమెరికన్​ స్టార్​ జిమ్నాస్ట్​​.  అయితే, ఇవాళ జరగబోయే బ్యాలెన్స్​ బీమ్​ ఫైనల్​లో మరో అమెరికన్​ జిమ్నాస్ట్​ సునీ లీతో కలిసి పార్టిసిపేట్​ చేయనుంది బైల్స్​.  ఈ న్యూస్​తో బైల్స్​ ఫ్యాన్స్​ ఫుల్​ ఖుష్​లో ఉన్నా.. అసలు బైల్స్​కి ఏమైంది అన్న ప్రశ్నలు అభిమానుల్ని వదలట్లేదు. ​

బైల్స్​ను ఓడించిన ట్విస్టీస్​!
అమెరికా స్టార్​ జిమ్నాస్ట్​ సిమోన్​ బైల్స్​ ఒకసారి ఒంటిని విల్లులా వంచేస్తోంది. ఇంకోసారి బాణంలా దూసుకెళ్తుంది. కానీ, ఈ సారి టోక్యో ఒలింపిక్స్ ఫైనల్స్​ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పి అందరికి షాకిచ్చింది. టీమ్​ ఈవెంట్స్​తో కలిపి మొత్తం ఆరు ఈవెంట్స్​లో  ఫైనల్​కి దూసుకెళ్లింది ఈ వరల్డ్ నెంబర్​ వన్​ జిమ్నాస్ట్​. కానీ, మానసిక ఆరోగ్యం బాగాలేదంటూ  ఇప్పటికే ఐదు  ఈవెంట్ల నుంచి తప్పుకుంది. ఈరోజు జరిగే బీమ్​ ఫైనల్స్​లో  మాత్రం పార్టిసిపేట్​ చేస్తుంది. అయితే రియో ఒలింపిక్స్​లో నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం​ సాధించి వరల్డ్ ఛాంపియన్​షిప్​లలో 19 మెడల్స్​ గెలుచుకున్న బైల్స్​​కి టోక్యో ఒలింపిక్స్​లో ఏమైంది? ఆమె మానసిక ఆరోగ్యాన్ని అంతలా దెబ్బతీసిన  విషయాలేంటి? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

సమస్యలు కొత్త కాదు
ఈరోజు ప్రపంచానికి స్టార్​ జిమ్నాస్ట్​గా  తెలిసిన 24 ఏళ్ల  బైల్స్​​కి సమస్యలు కొత్తేం కాదు. బైల్స్​అమెరికాలోని ఒహాయోలో 1997లో  పుట్టింది. ఆమె​ తల్లి డ్రగ్స్​, ఆల్కహాల్ మత్తులో పడి​ ​కుటుంబాన్ని గాలికి వదిలేసింది. దాంతో  బైల్స్​​తో పాటు తన ముగ్గురు తోబుట్టువులు దిక్కులేని పక్షులయ్యారు. పిల్లల దీనస్థితిని చూడలేక మూడేళ్ల బైల్స్​ని, తన చెల్లి ఆండ్రియాని అమ్మమ్మ, తాతయ్య చేరదీశారు. మరో ఇద్దరు తోబుట్టువుల్ని బంధువులు దత్తత తీసుకున్నారు. అలా మూడేళ్ల వయసులో తల్లికి దూరమవ్వడం. మిగిలిన ఇద్దరు తోబుట్టువుల తోడు కూడా లేకపోవడం బైల్స్​ని మానసికంగా కుంగదీసింది. కానీ, అమ్మమ్మ తాతయ్య ఇచ్చిన ధైర్యంతో ముందుకెళ్లింది. 

జిమ్నాస్టిక్స్​ జర్నీ
ఆరేళ్ల వయసులో మొదటిసారి జిమ్నాస్టిక్​ సెంటర్​ చూసి జిమ్నాస్టర్​ కావాలనుకుంది బైల్స్​. ఆ గోల్​ని చేరుకోవడానికి చదువుకి దూరంగా జరిగింది. సరదాలు, స్నేహితులు అన్నింటినీ పక్కనబెట్టింది. ప్రతిరోజూ గెలుపు కోసం పోరాడింది. తన కష్టానికి ఫలితమే రియో ఒలింపిక్స్​లో సాధించిన నాలుగు గోల్డ్​ మెడల్స్​. రియో ఒలింపిక్స్​లో బైల్స్​ పెర్ఫార్మెన్స్​ చూసి ప్రపంచమంతా చప్పట్లు కొట్టింది. ఆమె విన్యాసాలు చూసి ‘ ఇవి డేంజరస్​ ఫీట్స్..ఎవరూ ట్రై చేయొద్ద’ని జడ్జ్​లు వార్నింగ్​ ఇచ్చారంటే ఆమె పెర్ఫార్మెన్స్​ ఏ రేంజ్​లో ఉందో ఊహించొచ్చు.  కానీ, రియో ఒలింపిక్స్​ తర్వాత బైల్స్​ బయటపెట్టిన కొన్ని నిజాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఆ చేదు అనుభవాలే ఆమెని మెంటల్​గా డిస్టర్బ్​ చేశాయి. 

ఎన్నో వేధింపులు..
ట్విట్టర్​ వేదికగా తాను ఎదుర్కొన్న వేధింపులపై  2018 లో మొదటిసారి మాట్లాడింది బైల్స్​.  ​జిమ్నాస్టిక్​ స్పోర్ట్స్​ డాక్టర్​ ‘ల్యారీ నాస్సర్’​ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. ‘నాకిష్టమైన ఆటని వదులుకోలేక.. స్పోర్ట్స్​ డాక్టర్ చేష్టల్ని భరించలేక నరకం చూశాన’ని పబ్లిక్​గా చెప్పింది బైల్స్​.‘నన్ను అందరూ హ్యాపీ అండ్ ఎనర్జిటిక్​ అమ్మాయి అనుకుంటారు. కానీ, నేను  ఆ టైంలో లోలోపల ఎంత కుమిలిపోయానో నాకే తెలుసు. మళ్లీ టోక్యో ఒలింపిక్స్​ ట్రైనింగ్ కోసం అదే జిమ్నాస్టిక్​ సెంటర్​కి​ వెళ్లాలంటే భయ మేసింద’ని కూడా చెప్పింది బైల్స్​. చైల్డ్​ పోర్నోగ్రఫీ, 330 మంది అమ్మాయిల్ని  వేధింపుల కేసు నాస్సర్​పై నమోదయ్యాకే బయటపెట్టింది బైల్స్​.

అన్నయ్య అరెస్ట్
ఆ టైంలోనే మరో కోలుకోలేని దెబ్బ తగిలింది బైల్స్​కి. 2018లో బైల్స్​అన్న టెవిన్​ బైల్స్​ థామస్​  ముగ్గురిని హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు. 2019 లో అన్న గురించి ట్విట్టర్​లో ఒక పోస్ట్​ పెట్టింది బైల్స్​ ‘మా అన్నయ్య​ అరెస్ట్​ నన్నుచాలా కుంగదీసింది. అలాగే ఈ ఇన్సిడెంట్​లో చనిపోయిన వాళ్లని తలుచుకుంటే మనసు చలించిపోతుంది. కానీ, నేను వాళ్ల బాధని తగ్గించడానికి ఏం చేయలేన’ని మనసులోని బాధని ట్విట్టర్​లో రాసింది బైల్స్​​.ఈ సంవత్సరం జూన్​లో బైల్స్​ అన్నయ్య నిర్దోషిగా రిలీజ్​ అయినప్పటికీ ఆ ఇన్సిడెంట్​ నుంచి బయటికి రాలేకపోయింది బైల్స్​.

ట్విస్టీస్​తో బాధపడుతున్నా!
తన ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​లో ‘ట్విస్టీస్’​ అనే  జబ్బుతో బాధపడుతున్నట్టు చెప్పింది బైల్స్.  ట్విస్టీస్​ వల్ల  జిమ్నాస్టిక్స్​ పోటీలో ఏదైనా ఫీట్​చేస్తున్నప్పుడు ​ మైండ్​ బ్లాంక్​ అవుతుంది. మైండ్​ నుంచి శరీరానికి సిగ్నల్స్​ ఆగిపోతాయి.  దాంతో ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం అన్నది జడ్జ్​​ చేయలేరు అథ్లెట్స్​. ఏం చేయాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోతారు. ఇలాంటి స్థితిలో బైల్స్​ టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనగలదా? లేదా? అన్న అనుమానాలు అందర్నీ వెంటాడాయి. అందరూ అనుకున్నట్టుగానే వాటన్నింటి ప్రభావం బైల్స్​ మెంటల్​ హెల్త్​పై పడింది. 

అంచనాలూ మైనస్సే
ఇన్నింటి మధ్య నలిగిపోతున్న బైల్స్​​​ని తనపై ఉన్న అంచనాలు కూడా కుంగదీశాయి. ఇంతకుముందు  బైల్స్​​పై ఇప్పుడున్నన్ని ఎక్స్​పెక్టేషన్స్​ లేవు. కానీ, రియో ఒలింపిక్స్ తర్వాత ఆమె ఆటపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నప్పటికీ ఈ ఎక్స్​పెక్టేషన్స్​ వల్లే 2018లో బైల్స్​ వరల్డ్​ ఛాంపియన్​షిప్​లో పాల్గొనాల్సి వచ్చింది బైల్స్​. ఇప్పుడు నెంబర్​ వన్​ అథ్లెట్​గా తన పేరుని కాపాడుకోవాలి. తన సత్తా స్పాన్సర్లు, అభిమానుల్ని సంతృప్తిపరచాలి. ఇవన్నీ బైల్స్​పై ​ఒత్తిడి పెంచాయి.

మానసిక ఆరోగ్యమే ముఖ్యం
ఒలింపిక్స్​లో ‘నేను నాకోసం కాకుండా వేరెవరి కోసమో ఆడుతున్నట్టు అనిపించింది..ఆ ఆలోచన  నన్ను చాలా బాధపెట్టింది’ అని చెప్పింది బైల్స్​. అలాగే ‘మనసు ఎక్కడో పెట్టి ఆటలాడి గాయాలపాలు అవ్వలేను అనుకుని కొన్ని పోటీల నుంచి తప్పుకున్నా’ అని చెప్పింది. బైల్స్​​ తన మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడాక చాలామంది ఆమెకి మద్దతుగా నిలిచారు. ఒబామా దంపతులు, స్పానిష్​ బాస్కెట్​ బాల్​ స్టార్​ గోసల్​, మరికొందరు స్టార్​ స్పోర్ట్స్​ పర్సన్స్​ కూడా  ట్విట్టర్​ వేదికగా బైల్స్​కి  అండగా నిలుస్తున్నారు. రియో ఒలింపిక్స్​లో బైల్స్​ చేసిన విన్యాసాలకి ప్రపంచమంతా చప్పట్లు కొట్టింది. ఆమె విన్యాసాలు చూసి ‘ ఇవి డేంజరస్​ ఫీట్స్..ఎవరూ ట్రై చేయొద్ద’ని జడ్జ్​లు వార్నింగ్​ ఇచ్చారంటే ఆమె పర్ఫార్మెన్స్​ ఏ రేంజ్​లో ఉందో ఊహించొచ్చు. 

Tagged tokyo, Olympics, gymnastics, Simone Biles, twisties

Latest Videos

Subscribe Now

More News