వీడిన మిస్టరీ: నవ వధువును నరికి చంపింది భర్తే

వీడిన మిస్టరీ: నవ వధువును నరికి చంపింది భర్తే

బొమ్మనపల్లి మర్డర్​ కేసును ఛేదించిన కరీంనగర్​ పోలీసులు 
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన నవ వధువు మర్డర్​కేసు మిస్టరీ వీడింది. భర్తే అతి కిరాతకంగా భార్యను కత్తితో పొడిచి, గొడ్డలితో నరికి చంపినట్లు తేలింది. సీపీ కమలాసన్​రెడ్డి సోమవారం కమిషనరేట్​లో కేసు వివరాలు వెల్లడించారు. బొమ్మనపల్లికి చెందిన మ్యాదర అనిల్(26)కు హుజూరాబాద్​కు చెందిన గరిగె ప్రవళ్లికతో రెండు నెలల క్రితం పెండ్లయ్యింది. అనిల్​కు హుస్నాబాద్​లో బ్యాటరీల రిపేరింగ్​షాపు ఉంది. కాగా ప్రవళ్లిక తనకంటే ఎక్కువ చదువుకుందని, తరచూ ఎవరితోనో ఫోన్​లో మాట్లాడుతుందని అనిల్​భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పెండ్లయ్యాక వచ్చిన మొదటి ఆషాఢ మాసం కావడంతో ఇటీవల ప్రవళ్లిక పుట్టింటికి వెళ్లింది. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పి అనిల్ ఈనెల18న భార్యను బొమ్మనపల్లికి తీసుకొచ్చాడు. 23న భార్యను హత్య చేయాలని ప్లాన్​చేశాడు. రోజూ మాదిరిగానే 23న ఉదయం షాపుకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత స్నేహితుడి బైక్​పై ఇంటికి వచ్చాడు. ఆ టైంలో ప్రవళ్లిక ఫోన్​మాట్లాడుతూ ఉంది. భర్తను చూసి ఫోన్ కట్​చేసి ఏమైనా పనిమీద వచ్చావా అని అడగడంతో అనిల్​కు అనుమానం రెట్టింపు అయ్యింది. పని మీదే వచ్చానని చెప్పి లోపలికి వెళ్లాడు. భార్య మంచంపై పడుకొని ఫోన్ చూస్తుండగా టీవీ ఆన్​చేసి ప్లాన్ ​ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడను కోశాడు. ఇద్దరూ పెనుగులాటలో మంచం మీద నుంచి కిందపడగా అనిల్ వెంటనే గొడ్డలితో నరికి చంపాడు.