జనగామ జిల్లాలో ముగ్గురు విద్యార్థినీలు అదృశ్యం

జనగామ జిల్లాలో ముగ్గురు విద్యార్థినీలు అదృశ్యం

జనగామ జిల్లాలో ముగ్గురు విద్యార్థినీలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. జనగామ  ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినీలు మిస్సింగ్ అయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ముగ్గురు విద్యార్థినీలు లేరని ఉపాధ్యాయులు గుర్తించారు. ఇదే విషయాన్ని వెంటనే వారి తల్లిదండ్రులకు పాఠశాల హెడ్ మాస్టర్ వలబోజు కృష్ణ మూర్తి సమాచారం అందించారు. కంగారు పడిన తల్లిదండ్రులు స్కూలుకు చేరుకున్నారు. మిగతా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అన్ని చోట్ల వెతికారు. తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి ఆరా తీశారు. చివరకు ఎక్కడా ఆచూకీ తెలియకపోవడంతో స్కూల్ యాజమాన్యంతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ముగ్గురు విద్యార్థినీల తల్లిదండ్రులు. 

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. శనివారం (ఆగస్టు 5న) ఉదయం స్కూలుకు వచ్చిన తర్వాత ఎక్కడకు వెళ్లారు..? ఎలా వెళ్లారు..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్కూలు దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు.. తమ పిల్లలు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.