ముంబైలో ఇండియా కూటమి భేటీ.. ఎన్డీయేను ఓడించడమే లక్ష్యం

ముంబైలో ఇండియా కూటమి భేటీ..  ఎన్డీయేను ఓడించడమే లక్ష్యం

ముంబైలో ఆగస్టు 31న ఇండియా కూటమి భేటీకానుంది. ఇప్పటికే వివిధ పార్టీల అగ్రనేతలు ముంబైకి చేరుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి మూడో మీటింగ్ ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీన ముంబైలో నిర్వహిస్తున్నారు.

ఈ కూటమి తొలి సమావేశం పాట్నాలో, రెండో మీటింగ్ బెంగళూరులో నిర్వహించారు. ఇప్పుడు ముంబైలో జరుగుతున్న కీలకమైన మూడో సమావేశంలో అందరూ కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రతిపక్షాలు రోడ్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం ఉంది. 

కూటమి లోగోను ఆవిష్కరించడంతో పాటు కోఆర్డినేషన్ కమిటీని ప్రకటించే చాన్స్ ఉంది. కూటమిని నడిపించేందుకు కోఆర్డినేటర్ లేక చైర్ పర్సన్ ఎంపికపై, సీట్ల పంపకాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఈ మీటింగ్ లో మరిన్ని పార్టీలు కూటమిలో చేరే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి కామన్ అజెండా తయారు చేసేందుకు పలు కమిటీలనూ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

కన్వీనర్ ఎవరు?  

ఇండియా కూటమి కన్వీనర్ రేసులో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఉన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీకి బాధ్యతలు అప్పగించాలని చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరు ఖరారైందని ప్రచారం జరుగుతోంది. అయితే తాను రేసులో లేనంటూ నితీశ్ ప్రకటించారు.