హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాగానాలొద్దు

హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాగానాలొద్దు

న్యూఢిల్లీ: సీడీఎస్ బిపిన్ రావత్ ఆకస్మిక మృతి అందర్నీ కలచివేసింది. రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ లో కుప్పకూలింది. ఈ ఘటనలో రావత్, ఆయన భార్య మధులికా రావత్ తోపాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ కొందరు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) స్పందించింది. ప్రమాదం మీద ఎటువంటి ఊహాగానాలు వద్దని, త్వరలోనే నిజానిజాలు బయట పడతాయని స్పష్టం చేసింది. 

‘డిసెంబర్ 8న సంభవించిన హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ట్రై సర్వీస్ కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీని వేశాం. ఈ ఘటనపై విచారణ త్వరితగతిన పూర్తవుతుంది. అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటివరకు ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి గౌరవ సూచకంగా ఎలాంటి ఊహాగానాలను వ్యాప్తి చేయొద్దని కోరుతున్నాం’ అని ఐఏఎఫ్ ట్వీట్ లో పేర్కొంది. సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని సూచించింది.