న్యూఢిల్లీ : ఇండియన్ ఎకానమీ చాలా బలంగా ఉందని, కంపెనీలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు సంస్కరణలను ఆయన హైలెట్ చేశారు. కార్పొరేట్ ట్యాక్స్ రేటు కోత లాంటి ప్రభుత్వం తీసుకున్న పలు సంస్కరణలు ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. స్థానిక సంస్థలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడితే.. ఇండియాలో ఫారిన్ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి కాన్ఫిడెన్స్ వస్తోందని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం తగ్గించిన కార్పొరేట్ ట్యాక్స్ రేట్ల కోత గురించి పలు దేశాల్లో మాట్లాడామని, గతేడాదే ఈ పన్ను రేట్లను తగ్గించినట్టు పేర్కొన్నారు. 30 శాతంగా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను 15 శాతానికి తగ్గించడం చరిత్రాత్మకమని అన్నారు. ఇక ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ వంతని, మన దేశ కార్పొరేట్ కంపెనీలు ప్రపంచానికి తమ సత్తా ఏమిటో చూపించాల్సి ఉందని చెప్పారు. ఇండియన్ కంపెనీలు ముందుకు వచ్చి, పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు. తొలి ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడైనా ఇంటి నుంచే ప్రారంభం కావాలని, దేశీయ కంపెనీలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడితే, ఫారిన్ కంపెనీలు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి మరింత కాన్ఫిడెన్స్ ను పెంచవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి మనల్ని ఉద్దేశించి గురువారమే ప్రసంగించారని, ఈ ప్రసంగంలో ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆహ్వానించినట్టు సీఐఐ వెబినార్‌లో సభ్యులను ఉద్దేశించి ఠాకూర్ మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థను మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని, ‘కమాండ్ అండ్ కంట్రోల్’ మోడ్ నుంచి దాన్ని ‘ప్లగ్ అండ్ ప్లే’ మోడ్‌లోకి తీసుకెళ్లాలని ఇండియన్ కంపెనీలకు ఠాకూర్ సూచించారు. గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్, సన్‌రైజ్ సెక్టార్లలో ఉన్న చాలా అవకాశాలు ఉన్నాయని, గ్రోత్ రివైవింగ్‌పై ఆశాభావంతో ఉన్నట్టు ఠాకూర్ అన్నారు. ఇండియన్ కంపెనీలను తాము నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. గత కొన్నేళ్ల నుంచి ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ మందగించిందని అన్నారు. ఈ కష్ట సమయంలో ఇన్వెస్ట్‌మెంట్లను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటుందని తెలిపారు. ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌ను కూడా ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు.
కోల్ సెక్టార్‌లోకి ప్రైవేట్ వ్యక్తులు….
రక్షణ రంగంలో ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) పరిమితిని ప్రస్తుతం ఉన్న 49 శాతం నుంచి 74 శాతానికి పెంచామని తెలిపారు. అదేవిధంగా కోల్ కమర్షియల్ మైనింగ్‌లోకి ప్రైవేట్ రంగ ప్లేయర్లను కూడా ప్రభుత్వం అనుమతించినట్టు పేర్కొన్నారు.

