సీఎం డైరెక్షన్.. జెట్​ స్పీడ్​ యాక్షన్​

సీఎం డైరెక్షన్.. జెట్​ స్పీడ్​ యాక్షన్​
  • ఎంక్వయిరీ జరుగుతుండగానే
  • ఆరోగ్య శాఖను తన చేతుల్లోకి తీసుకున్న కేసీఆర్
  • శనివారం మధ్యాహ్నానికే ముగిసిన విచారణ..
  • భూ కబ్జా ఆరోపణలు నిజమేనని తేల్చిన ఆఫీసర్లు

శుక్రవారం:

  •     మధ్యాహ్నం 3 గంటలకు 
  •     సీఎం, సీఎస్‌‌కు రైతుల ఫిర్యాదు‌‌
  •     4 గంటలు : మీడియాకు లీకులు
  •     5.30: టీవీ చానళ్లలో ప్రచారం
  •     7.00: విచారణకు ఆదేశం
  •     9:00: ఈటల ప్రెస్ మీట్

శనివారం:

  •     ఉదయం 5 గంటలు: అచ్చంపేటకు పోలీసులు
  •     6 గంటలు:  విజిలెన్స్‌‌, రెవెన్యూ బృందాల రాక
  •     10 గంటలు: మెదక్ కలెక్టర్ రాక
  •     ఒంటి గంట: అడిషనల్ డీజీ పూర్ణచందర్‌‌‌‌ విజిట్‌‌
  •     2 గంటలు:  ముగిసిన విచారణ, ఆక్రమణలు నిజమేనంటూ కలెక్టర్ వెల్లడి
  •     2 గంటలకే గవర్నర్‌‌‌‌కు సీఎం సిఫారసు..ఈటల వద్ద ఉన్న హెల్త్ మినిస్ట్రీ కేసీఆర్‌‌‌‌కు ట్రాన్స్‌‌ఫర్
  •     2:15: గవర్నర్ ఆమోదం

హైదరాబాద్, వెలుగు: మంత్రి ఈటల రాజేందర్‌‌పై భూ కబ్జా ఆరోపణలపై విచారణ స్వయంగా సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే సాగింది. హుటాహుటీన అధికారులు జెట్‌ స్పీడ్‌లో ఎంక్వైరీ ముగించారు. ఈ నివేదిక వచ్చాక దాన్ని అడ్డం పెట్టి నేడో రేపో ఈటలను కేబినెట్‌ నుంచి తప్పించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి ఈటల దగ్గరున్న వైద్య ఆరోగ్య శాఖను సర్కారు తొలగించింది. ప్రభుత్వ సలహా మేరకు ఆ శాఖను సీఎం కేసీఆర్​కు బదిలీ చేస్తూ గవర్నర్ ఉత్తర్వు లిచ్చారు.  మెదక్ జిల్లా అచ్చంపేటలో అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఈటలపై శుక్రవారం ఆరోపణలు వచ్చాయి. తమ భూములు ఆక్రమించినట్లు అచ్చంపేట రైతులు ఫిర్యాదు చేయటం మొదలు.. కొన్ని గంటల వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాలన్నీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. సొంత టీవీ చానళ్లలో ప్లాన్ ప్రకారం అదే స్టోరీ ప్రసారమవటం.. వెనువెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించటం.. గంటల వ్యవధిలోనే చర్యలకు దిగటం ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. కొంతకాలంగా పార్టీలో ధిక్కార స్వరం వినిపించిన ఈటలను సాగనంపేందుకే కేసీఆర్ కుట్ర పన్నినట్లు రాజకీయ పార్టీలన్నీ దుమ్మెత్తి పోశాయి. స్వయంగా పార్టీ అధినేత డైరెక్షన్ కావటంతో ఈటల ఎపిసోడ్​పై టీఆర్ఎస్ లీడర్లందరూ సైలెంట్​గా ఉండిపోయారు.

జెట్ స్పీడ్ విచారణ

సీఎం ఆదేశించటంతో ఈటలపై విచారణ జెట్ స్పీడ్​తో ముగిసింది. శనివారం పొద్దున్నే అధికార యంత్రాంగం ఆఘమేఘాల మీద అచ్చంపేటకు చేరుకుంది. కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తుతో ఆరు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి సర్వే చేశారు. ల్యాండ్ సర్వే డిపార్ట్​మెంట్ ఆఫీసర్లు.. ఈటలకు చెందిన జమున హ్యాచరీస్​తోపాటు, చుట్టు పక్కల ఉన్న అసైన్ట్ భూముల్లో డిజిటల్ సర్వే చేశారు. అడిషనల్ కలెక్టర్ రమేశ్, తూప్రాన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్, మాసాయిపేట తహసీల్దార్ మాలతి.. రెవెన్యూ రికార్డుల ఆధారంగా సర్వే నంబర్ల వారీగా ఏ భూమి ఎవరి పేరుమీద ఉంది? అది పట్టానా? అసైన్​మెంట్ భూమా? అనేది పరిశీలించారు. అక్కడ నిర్మించిన షెడ్లు, కాంపౌండ్ వాల్ ఫొటోలు, వీడియో తీసుకున్నారు. మరోవైపు శుక్రవారం రాత్రి నుంచి 10 విజిలెన్స్‌‌ టీమ్స్‌‌ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్‌‌చేశాయి. అసైన్డ్‌‌ ల్యాండ్స్‌‌ బెన్‌‌ఫిషర్స్‌‌ డేటా కలెక్ట్‌‌ చేశాయి. విజిలెన్స్ ఎస్పీ మనోహర్ ఆధ్వర్యంలో అధికారులు సీఎంకు ఫిర్యాదు చేసిన 8 మందిని పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ ఏడాది ఎంత భూమి కేటాయించారు. ప్రస్తుతం ఆ భూమి పరిస్థితి ఏమిటనేది ఆరా తీశారు. విజిలెన్స్ డీజీ పూర్ణచందర్​రావు అచ్చంపేటకు చేరుకొని విచారణ తీరును పరిశీలించారు. ఏసీబీ అధికారులు కూడా వచ్చి అసైన్డ్ భూముల వ్యవహారంపై ఆరా తీశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు విచారణ కొనసాగింది. ఈటలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు దాదాపుగా నిజమేనని తేల్చారు. ఈలోపే ఈటల మంత్రిత్వ శాఖను తొలిగిస్తూ సీఎం నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

66 ఎకరాలు కబ్జా చేసినట్టు రిపోర్ట్​

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో మంత్రి ఈటల రాజేందర్ 66 ఎకరాలు కబ్జా చేశారని విచారణ కమిటీ తేల్చినట్లు తెలిసింది. ఈ మేరకు 6 పేజీల నివేదికను సీఎస్ సోమేశ్ కుమార్‌‌కు మెదక్ కలెక్టర్ హరీశ్ పంపారు. సీఎస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. శనివారం విచారణ జరిపింది. మంత్రిపై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరించింది. అసైన్డ్‌‌దారులను ఒక్కొక్కరిగా పిలిచి మాట్లాడింది. మరోవైపు రోడ్డు వైడెనింగ్‌‌ పనుల్లో చాలా చెట్లను నరికివేసినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీనిపై కూడా సీఎస్‌‌కు కలెక్టర్ హరీశ్ నివేదికను ఇచ్చినట్టు 
తెలిసింది.

ప్లాన్‌ ప్రకారమే నాపై భూకబ్జా ఆరోపణలు చేశారు. వాస్తవాలు త్వరలోనే తేలుతాయి. నా నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి.   నా శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేసినట్లు తెలిసింది. ఇందుకు సంతోషిస్తున్న. సీఎంకు శాఖలపై సర్వాధికారాలు ఉంటాయి. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్న.  
‑ మంత్రి ఈటల రాజేందర్