వేడెక్కుతున్న గజ్వేల్ మున్సిపాలిటీ రాజకీయం

వేడెక్కుతున్న గజ్వేల్ మున్సిపాలిటీ రాజకీయం
  • చైర్మన్ అవినీతి చిట్టా విప్పుతున్న అసంతృప్త కౌన్సిలర్లు!
  • వాట్సప్ గ్రూపుల్లో వైరల్ గా మారిన  మెసేజ్ లు
  • దిద్దుబాటు చర్యల్లో ఎమ్మెల్సీ

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : సీఎం కేసీఆర్ ఇలాకాలో వాట్సప్​ వార్​ నడుస్తోంది. కేసీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో మున్సిపల్  చైర్మన్ రాజమౌళి గుప్తాపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీస్​ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. చైర్​పర్సన్​ అవినీతికి పాల్పడుతున్నారంటూ అసంతృప్తిలో ఉన్న కౌన్సిలర్లు చేస్తున్న ఆరోపణలు వాట్సప్​ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. వారం రోజుల కింద అవిశ్వాస నోటీసును కలెక్టర్ కు అందజేసిన తరువాత 14 మంది కౌన్సిలర్లు క్యాంప్​కు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ‘చైర్మన్ అవినీతికి పాల్పడుతున్నందునే తాము అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ నోటీస్​ ఇవ్వాల్సి వచ్చింది. పార్టీ అధిష్టానానికి మేం విధేయులం’ అంటూ వారు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోతోపాటు దీనికి సబంధించిన పలు మెసేజ్​లు ఇప్పుడు వాట్సప్​ గ్రూప్​ల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

చైర్మన్​పై వస్తున్న ఆరోపణలు.. వైరల్​గా మారిన మెసేజ్​లు..

l   ‘గజ్వేల్–-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి జరగలేదని అంటున్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా  కనీసం మనస్సాక్షికైనా  భయపడండి. మీ అవినీతికి సంబంధించిన ఆధారాలు అన్ని మేం తయారు చేశాం. ఇప్పటికే మీరు చేసిన పనుల వల్ల పార్టీ పరువు ప్రజల్లో మసకబారిపోయింది. మీరు చేసిన అవినీతిని ప్రజల్లో పెట్టి మరింత బజారు పాలు చేయడానికి మేం సిద్ధంగా లేం. పార్టీకి మేం పూర్తి విధేయులుగా ఉన్నాం. అధిష్టానం వద్ద మాత్రమే మా గోడును వినిపించుకుంటాం. గజ్వేల్​లో పార్టీని కాపాడుకోవడానికి అన్ని విధాలా మేం సంసిద్ధులమై ఉన్నాం. మున్సిపల్ పాలనా వ్యవహారాల్లో మీ కుమారుడు జోక్యం ఎందుకు? జోక్యం చేసుకోవడం లేదని చెబుతున్న మీరు ఈ విషయాన్ని  దైవసాక్షిగా  చెప్పగలరా? మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు మాత్రమే ఉండే మున్సిపల్ అఫీషియల్ గ్రూప్​లో మీ కొడుకు నంబర్ ఎందుకు ఉంది? మన పాలన వ్యవహారాలు ఆఫీస్ వ్యక్తిగత విషయాలు ఆయనకు తెలియాల్సిన అవసరం ఏముంది?’ అంటూ అసంతృప్త కౌన్సిలర్లు చేస్తున్న వాట్సప్ మెసేజ్ లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 

l    ‘గతంలో గవర్నమెంట్ హాస్పిటల్, మణికొండ భూపతిరావు సత్రం కబ్జా విషయంలో మీ కుమారుడి ప్రమేయం ఉందన్న విషయం వాస్తవం కాదా? మున్సిపాలిటీలో  కాంట్రాక్ట్ పనులను యూజీడీ కాంట్రాక్టర్ తో పనులు చేయించి  డబ్బులు డ్రా చేసుకున్న విషయం నిజం కాదా?  మధుశ్రీ ఇన్ఫ్రా, సిద్దిపేట కాంట్రాక్టర్ సుగుణాకర్ తో కలిసి కాంట్రాక్టులు చేసింది ఎవరో తెలియదా?  ముట్రాజ్ పల్లి గ్రామ ప్రజలు  భూముల విషయంలో మీ కుమారుడు ఇబ్బంది పెడుతున్నారని వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ లు పెట్టిన విషయం వాస్తవం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ పరువు తీసే ఎన్నో పనులు చేసినవు. మీ అవినీతికి సంబంధించిన ఆధారాలు అన్నీ పార్టీ అధిష్టానానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ పెట్టిన మెసేజ్ లు వాట్సప్ గ్రూపుల్లో వైరల్ గా మారాయి. 

ఇరువర్గాలతో ఎమ్మెల్సీ సంప్రదింపులు

సీఎం ఇలాకాలో మున్సిపల్ అవిశ్వాస నోటీసు రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుండటంతో ఎమ్మెల్సీ యాదవరెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు క్యాంపులో ఉన్న కొందరు కౌన్సిలర్ల తో యాదవరెడ్డి మాట్లాడుతున్నారు. అవిశ్వాస రాజకీయాల వల్ల పార్టీ పరువు బజారునపడుతుందని, ఏవైనా అభిప్రాయబేధాలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలనే దిశగా ఎమ్మెల్సీ ప్రయాత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది.