అమరగిరి పర్యాటకానికి పైసా ఇవ్వని ప్రభుత్వం

అమరగిరి పర్యాటకానికి పైసా ఇవ్వని ప్రభుత్వం

నాగర్​కర్నూల్, వెలుగు: కొండల మధ్య ప్రవహించే కృష్ణానది, పచ్చటి దుప్పటి కప్పుకున్నట్లు కనిపించే నల్లమల అడవి.. చారిత్రక ఆనవాళ్లు, ఆధ్యాత్మికత, పవిత్రత ఉట్టిపడే అమరగిరి అభివృద్ధిపై నేతల హామీలు మాటలకే పరిమితమవుతున్నాయి. నాగర్​కర్నూల్ ​జిల్లా కొల్లాపూర్ మండలం కృష్ణాతీరంలో ఉన్న అమరగిరిలో  చారిత్రకంగా ఎన్నో విశేషాలున్నాయి. పచ్చటి కొండల మధ్య  ప్రవహించే కృష్ణమ్మ.. ఒడ్డున జాలరులు, చెంచులు, గిరిజనుల నివాసాలతో అమరిగిరి ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. రుషులు అమరత్వం పొందిన ప్రాంతం కావడంతో అమరగిరిగా పేరు వచ్చిందంటారు.

ఈ ప్రాంతాన్ని డెవలప్​ చేస్తామని రాష్ట్ర  టూరిజం అధికారులు కాగితాల మీద ప్లానింగ్ రాసుకుపోవడమే తప్ప పైసా ఇవ్వడం లేదు. కేంద్రం ఇచ్చే స్వదేశీ దర్శన్​ నిధులే దిక్కవుతున్నాయి.  అమరిగిరిని డెవలప్​ చేసేందుకు 2020లో కొల్లాపూర్​ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఫారెస్ట్, టూరిజం అధికారులతో మీటింగ్​ నిర్వహించారు. మంత్రులు శ్రీనివాస్​గౌడ్, కేటీఆర్​ అమరగిరిలో ఎకో టూరిజం,హెర్బల్​ఫామ్స్, కాటేజీలు, బోటింగ్​ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పినా ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. 

పడవల్లోనే పోవాలే..

కృష్ణానది తీరాన ఉన్న అమరగిరి గ్రామానికి 4 కి.మీ. దూరంలో కృష్ణా నది మధ్యలో చీమలతిప్ప దీవి ఉంది. ఇందులో పురాతన అంకాలమ్మ కోట ఉంది. మల్లయ్య సెలలో పురాతన శివాలయం ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి పడవలే ఆధారం. నాటు పడవల్లో  వెళ్తుంటారు. పడవలు నిలపడానికి  జెట్టీల నిర్మాణం అవసరం కాగా లీడర్లు, ఆఫీసర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎటువంటి వసతులు లేకపోయినా ప్రకృతి ప్రేమికులు అమరగిరికి తరలివస్తున్నారు. వీకెండ్స్​లో ఈ ప్రాంతంలోని రమణీయ అందాలను చూస్తూ తన్మయులవుతున్నారు. 

ఎవరూ పట్టించుకుంటలేరు

అమరగిరి ప్రాంతంలోని విశేషాలు బయటి ప్రపంచానికి తెలియడం కోసమైనా ఈప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ చేయాలి. ఇప్పటికే ఎమ్మెల్యే, టూరిజం అధికారులు, మంత్రుల చుట్టూ స్థానికులంతా తిరిగి అలసిపోయారు. అమరిగిరి అభివృద్ధిపై ఆశలు వదులుకుంటున్నారు. కృష్ణా  తీరంలోని నల్లమల కొండలపై దొరికే అత్యంత అరుదైన వనమూలికలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలను వెలుగులోకి తెస్తే స్థానిక యువతకు కొంత ఉపాధి లభిస్తుంది. – భరత్​యాదవ్, అమరగిరి