నీళ్ల సౌలత్​కు మెట్ల బావులు

నీళ్ల సౌలత్​కు మెట్ల బావులు

మనదేశంలోకి నాగరికత వచ్చినట్టే రాజులొచ్చారు. ఆ తర్వాత రాజ్యాలూ వెలిశాయి. విలాసమైన భవనాలు కట్టుకున్నారు. వాటికి కోటలు పెట్టారు. అక్కడక్కడ కట్టడాలూ కట్టారు. ఈ రాజుల్లో ప్రజల అవసరాలను గుర్తించిన ప్రభువులు కూడా ఉన్నారు. కాలం గిర్రున తిరిగింది. రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు. కానీ, వారు అందించిన తరగని సంపద ఇప్పుడు జనం కండ్ల ముందు ఉంది. వారసత్వ సంపద కింద కొన్ని టూరిస్ట్​ ప్లేస్​లు  గుర్తించారు, కొన్ని ప్లేస్​లు మాత్రం కనుమరుగయ్యాయి. ఆ కాలంలో కట్టిన ‘మెట్ల బావులు’ మాత్రం ఇప్పటికీ సామాన్యులకు ఉపయోగపడుతున్నాయి. గ్రౌండ్​ వాటర్​ లెవల్స్​ను కాపాడుతూ మనదేశంలో  మెట్ల బావులు ముందున్నాయి. 

మనదేశంలో నీటి సమస్య వచ్చినప్పుడల్లా గ్రౌండ్​ వాటర్​ లెవల్స్​ చర్చకు వస్తాయి. గ్రౌండ్​ వాటర్​ కాపాడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ నీటి నిల్వలను కాపాడటంలో మెట్ల బావులది చాలా ఇంపార్టెంట్​ రోల్​. మనదేశంలో ఎక్కువ నీటి సమస్య ఉండే రాజస్థాన్​లో వేలఏండ్ల కిందటే ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. ప్రజల అవసరాల కోసం మెట్ల బావులను కట్టారు. వర్షపు నీళ్లను ఒడిసి పట్టడం ద్వారా ఈ బావులు నిండుతాయి. నిండుకుండల్లా ఉండే ఈ బావులు కేవలం నీటిని అందించడమే కాదు గ్రౌండ్​ వాటర్​ లెవల్స్​ను కూడా పెంచుతాయి. అప్పటి ఆ బావులనే ప్రభుత్వాలు ఇప్పటికీ కాపాడుతూ నీటి సమస్యను జయిస్తున్నాయి. ఈ మెట్ల బావులే కరువు ప్రాంతాలలో ఏడాది పొడవునా నీటిని అందిస్తూ..  నీటి ఎద్దటి రాకుండా ఆదుకుంటున్నాయి.  యునెస్కోలెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలను స్టోర్​ చేసిన దేశం మనదే. ఈ స్టోరేజీ అంతా కూడా మెట్ల బావుల వల్లే సాధ్యమైందని యునెస్కో చెప్పింది. 

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి
రాజస్తాన్​లోని అభనేరి అనే ఊర్లో ఇది ఉంది.  మన దేశంలో ఎన్నో రకాల అద్భుత కట్టడాలలో ఇది కూడా ఒకటి. దీంట్లో మొత్త 3,500 మెట్లు ఉంటాయి. వంద ఫీట్లలోతు (30 మీటర్లు) ఉంటుంది. మొత్తం 13 అంతస్తులు ఉంటాయి. ఎనిమిదో శతాబ్దంలో ‘నికుంభ’ వంశానికి చెందిన ‘చంద’ అనే రాజు ఈ బావిని కట్టించాడు. అందుకే దీన్ని ‘చాంద్‌‌ బవోరి’  అంటారు.. ఈ బావి దగ్గర టెంపరేచర్​  చుట్టుపక్కల టెంపరేచర్​తో పోలిస్తే అయిదారు డిగ్రీల తక్కువగా ఉంటుంది. అందుకే ఈ బావికి ఒక పక్క ఉన్న గదుల్లో ఆనాటి రాజులు విశ్రాంతి తీసుకునేవారు. ఏడాది పొడవునా ఈ బావిలో నీళ్లు ఉంటాయి. ఎప్పుడూ ఎండిపోయింది లేదు. ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వేసవి కాలంలో వేడికి తట్టుకోలేక చల్లదనం కోసం ఆ బావి దగ్గరకొస్తారు. వేసవి కాలంలో అడుగున ఎక్కడో  కనిపించే నీళ్లు, వర్షాకాలం వస్తే పై వరకు వస్తాయి. ఈ బావిలోకి దిగడానికి మూడువైపులా మెట్లు ఉన్నాయి. నాలుగో వైపు అందమైన మంటపాలు ఉన్నాయి. బావి సమీపంలోనే ‘హర్షత్‌‌ మాత’ ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు బావిలోని నీటితో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్నాకే ఆలయంలోకి వెళతారు. ఇక్కడ వెలసిన అమ్మవారు ఊరంతటికీ తేజస్సును అందిస్తుందనేది ప్రజల నమ్మకం. అందుకే ఊరి పేరు ‘అభానగరి’గా ప్రసిద్ధి. రానురాను అదే ‘అభనేరి’గా మారింది. అయితే వెయ్యి సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం కావడంతో అనేక మెట్ల బావులు మరుగున పడిపోయాయి. ఇప్పుడున్న నీటి వ్యవస్థ వాటి ఇంపార్టెన్స్​ను గుర్తించలేదు. చాలావరకు శిథిలావస్థలో ఉన్నాయి.  కొన్ని పూర్తిగా కనుమరుగయ్యాయి.  ఇటీవల  మనదేశంలో తీవ్రమైన నీటి సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఈ మెట్ల బావుల గురించి ఆలోచించాయి. దేశ చరిత్రలో తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కోవడానికి ఈ మెట్ల బావులే కారణం అయ్యాయని అన్నారు కూడా. 

టూర్జి మెట్లబావి
జోధ్‌‌పూర్ ఓల్డ్ సిటీ మధ్యలో ‘టూర్జి కా ఝల్రా’ మెట్ల బావి ఉంది. జోధ్​పూర్​లో ఇది చాలా యునిక్​ ప్లేస్​. 18వ శతాబ్దంలో కట్టిన ఇసుకరాతి మెట్ల బావి ఇది. అప్పటి రాజు అభయ్ సింగ్ భార్య దీన్ని నిర్మించారు. అయితే దీన్ని ప్రభుత్వాలు రిపేర్ చేయకపోవడంతో మొన్నటి వరకూ నిరుపయోగంగా పడి ఉంది. మెట్ల బావుల ఇంపార్టెన్స్​ గుర్తించిన అధికారులు ఇటీవల దాన్ని రిపేర్​ చేయించారు. 14లక్షలు ఖర్చు చేసి బావి మొత్తాన్ని శుభ్రం చేశారు. నీటిని నింపి వ్యవసాయానికి, ఇంటి పనులకు ఈ మెట్ల బావి నీటిని వాడుతున్నారు. ఇప్పుడు  రోజుకు దాదాపు 28 మిలియన్ లీటర్ల (6.2 మిలియన్ గ్యాలన్లు) నీరు జోధ్​పూర్​ నగరమంతా ఈ బావి నుంచే అందుతున్నాయి. 

రాణి కీ వావ్​ 
గుజరాత్​లోని రాణికి వావ్ (రాంకీ వావ్ ) మన దేశంలో ప్రముఖ మెట్ల బావి. ఇది సరస్వతీ నది ఒడ్డున ఉంది. 11వ శతాబ్దపు చాళుక్య రాజు భీమI భార్య ఉదయమతి దీన్ని కట్టారు. 1980 లలో భారత పురావస్తు శాఖ దీన్ని డెవలప్​ చేసింది. ఇది 2014 నుండి యునెస్కో గుర్తింపు పొందింది. ఈ బావిలో గొప్ప శిల్పకళ కనిపిస్తుంది. ఈ శిల్పాలలో విష్ణువు దశావతారాలైన కల్కి, రామ, నరసింహ, వామన, వారాహతోపాటు నాగకన్య, యోగిని వంటి అందమైన స్త్రీల శిల్పాలు ఉన్నాయి.  సోలా శృంగార అని  పిలిచే 16 రకాల శైలుల్లో అందమైన శిల్పాలు ఉన్నాయి.  ఈ బావి 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు.  88 అడుగుల లోతు ఉంటుంది. ఈ బావి అడుగున ఓ సొరంగం ఉంది. అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదట. అయితే ఇదంతా  ఒకప్పుడు. ఇప్పుడు పూర్తిగా మట్టితో నిండిపోయిందని చెబుతారు. 

మన దగ్గర
మన తెలంగాణలో మెట్ల బావులు వందల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో ఓరుగల్లు మెట్ల బావి ముఖ్యమైనది.  వరంగల్‌‌లోని శివనగర్‌‌ ప్రాంతంలో చారిత్రక మెట్లబావి ఉంది. దీన్ని అక్కడి వారు ‘పెద్ద కోనేరు, పద్నాలుగు మోటల బావి, దిగుడు బావి, స్నానాల బావి, అంతస్తుల బావి, చంద్రకళ బావి’ అని కూడా పిలుస్తారు. దీన్ని కాకతీయుల కాలంలో కట్టారు. కాకతీయుల తొలి రాజధాని వరంగల్‌‌లోని కోట పరిసర ప్రాంతాల్లో 150 నుంచి 200 బావులున్నాయనేది అంచనా. మరొకటి కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఉన్న దిగుడు బావి. కామారెడ్డి- ఎల్లారెడ్డిపేట రోడ్​లో ఇది ఉంటుంది. 18వ శతాబ్దంలో నిజాం కాలంలో దీన్ని కట్టారు. దగ్గరికి వెళ్లి చూస్తే తప్ప, ఇక్కడ మెట్ల బావి ఉన్న సంగతి తెలియదు. నేలమట్టం నుంచి కిందకు 20 మీటర్ల లోతులో ఈ బావిని కట్టారు. ఈ బావి వంద అడుగుల లోతు ఉంటుంది.