మల్లారెడ్డిని నిలదీసిన మేడ్చల్ కలెక్టరేట్ భూ నిర్వాసితులు

మల్లారెడ్డిని నిలదీసిన మేడ్చల్ కలెక్టరేట్ భూ నిర్వాసితులు

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ కలెక్టరేట్​ కు భూములిచ్చిన తమకు నష్టపరిహారం ఎప్పుడిస్తరని మంత్రి మల్లారెడ్డిని నిర్వాసితులు నిలదీశారు. శామీర్ పేట పరిధిలోని అంతాయిపల్లిలో మేడ్చల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం కోసం అప్పట్లో ఆ గ్రామ రైతులు భూములు ఇచ్చారు. వారికి ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. దీంతో తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని ఆ గ్రామానికి చెందిన బాధిత రైతులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారికి పీసీసీ అధికార ప్రతినిధి, జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మద్దతు తెలిపారు.

అదే సమయంలో మంత్రి మల్లారెడ్డి కలెక్టరేట్ కు రావడంతో రైతులు అడ్డుకున్నారు. భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్యకు కూడా వెనకాడబోమని మంత్రిని హెచ్చరించారు. మంత్రిని కలిసి తమ బాధను చెప్పుకుంటామంటే పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రెండు, మూడు రోజుల్లో పూర్తి వివరాలతో తన దగ్గరకొస్తే.. 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పి మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.