కామారెడ్డిలో హీటెక్కుతున్న రైతుల ఉద్యమం

కామారెడ్డిలో హీటెక్కుతున్న రైతుల ఉద్యమం

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా8 గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమం తీవ్రమవుతోంది. రైతులు వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో రైతుల ఉద్యమంతో జిల్లాలో పొలిటీకల్​ హీట్​ కూడా పెరుగుతోంది. మాస్టర్​ ప్లాన్​ వ్యవహారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్​లను టెన్షన్​ పెడుతోంది. డ్రాఫ్ట్​ మాస్టర్​ ప్లాన్​ను 2022 నవంబర్​ చివరిలో ప్రకటించారు. ఇందులో చూపెట్టిన ఇండస్ర్టియల్​ జోన్​, గ్రీన్​ జోన్, రీక్రియేషన్​ జోన్​, 100 ఫీట్లు, 80 ఫీట్ల రోడ్ల ప్రతిపాదనలపై ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  కామారెడ్డి మున్సిపాల్టీ పరిధిలోని అడ్లూర్​, ఇల్చిపూర్, టెకిర్యాల్​, లింగాపూర్​, పాతరాజంపేట, రామేశ్వర్​పల్లిలో పాటు సదాశివనగర్​ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన  రైతులంతా రైతు ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడ్డారు. 45 రోజులుగా ఆందోళనలు చేస్తునారు. జిల్లా కేంద్రంలో రైతుల భారీ ర్యాలీ,  కలెక్టరేట్ ఎదుట ధర్నా, జిల్లా కేంద్రం బంద్​  పోగ్రాములు సక్సెస్​ అయ్యాయి. దీంతో  రైతుల ఉద్యమం రాష్ర్ట వ్యాప్తంగా చర్చగా మారింది. దీంతో అధికార పార్టీపై ముఖ్యంగా స్థానిక లీడర్లపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు మరింత కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీంతో ఈ ఎమ్మెల్యేలు ఎటూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. 

పట్టున్న గ్రామాల్లోనే  ఉద్యమం..

మున్సిపాల్టీలో విలీనమైన లింగాపూర్, టెకిర్యాల్, అడ్లూర్​, రామేశ్వర్​పల్లి, ఇల్చిపూర్, పాతరాజంపేట గ్రామాలతో పాటు, సదాశివనగర్​ లో  బీఆర్​ఎస్​కు  పట్టుంది. కానీ,  మాస్టర్​ ప్లాన్​పై  ఈ గ్రామాల  నుంచే వ్యతిరేకత రావడంతో బీఆర్​ఎస్​ నాయకులు ఇరకాటంలో పడ్డట్టైంది. మాస్టర్​ ప్లాన్​ను కంప్లీట్​గా రద్దు చేయించేందుకు ఒత్తిడి తెచ్చేందుకు కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. అలాగే  ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేస్తామని ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే గంప గోవర్ధన్​తో  సమావేశమయ్యారు. ఆ తర్వాత గ్రామాలకు  వెళ్లి  నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ  రైతులు ససేమిరా అన్నారు.  ఏ రైతుకు కూడా నష్టం జరగకుండా మాస్టర్​ ప్లాన్​ను మారుస్తామని, డీటీసీపీ, కన్సల్టెన్సీ తప్పిదంతో మాస్టర్​ ప్లాన్​ వివాదానికి కారణమైందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. రైతు పయ్యావుల రాములు ఆత్మహత్యపై, కలెక్టరేట్​ ఎదుట రైతుల ఆందోళనపై ఎమ్మెల్యే జాజాల  సురేందర్​  కామెంట్లు తీవ్ర దుమారం లేపాయి. ఇలా  రైతులు వ్యతిరేకిస్తున్న మాస్టర్​ ప్లాన్​ వల్ల బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రైతులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలితం ఇవ్వడం లేదు.