పేరుకే రెండు దేశాల ఆట.. అసలు సమరం అంతా కోహ్లీ vs పాకిస్థాన్

పేరుకే రెండు దేశాల ఆట.. అసలు సమరం అంతా కోహ్లీ vs పాకిస్థాన్


భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రేజ్ ఆకాశాన్ని దాటేస్తుంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కి వర్షం పడే ఛాన్స్ కూడా లేకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నేపాల్​ను చిత్తుచేసి గ్రాండ్ గా టోర్నీని స్టార్ట్ చేసిన పాక్..నేడు శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా భారత్ తో సమరానికి సిద్ధమవుతుంది. మరో వైపు ఆసియా కప్ లో టీమిండియాకు ఇదే తొలి మ్యాచ్. మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయ్యే ఈ మ్యాచ్ మొబైల్ లో హాట్ స్టార్ లో ఫ్రీగా చూడొచ్చు.

 
విరాట్ పైనే అందరి దృష్టి:

సాధారణ మ్యాచుల్లో నిలకడగా రాణించే విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్ మీద మ్యాచ్ అంటే పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోతాడు. చూడడానికి ఇది భారత్ పాకిస్థాన్ మ్యాచ్ అయినా అందరి దృష్టి విరాట్ కోహ్లీ మీదే ఉండడం గ్యారంటీ. విరాట్ కోహ్లీకి ఉన్న భారీ ఫాలోయింగ్ ఒక కారణమైతే, పాకిస్థాన్ మీద ట్రాక్ రికార్డ్ మరొక కారణం. దీంతో ఈ రోజు కింగ్ చెలరేగిపోవడం ఖాయమని అభిమానులతో పాటు యావత్తు దేశం ఆశిస్తుంది. ఒక్కసారి క్రీజ్ లో కుదురుకున్నాడంటే విరాట్ ని ఆపడం ఎవరి తరం కాదు. ఈ విషయం పాకిస్థాన్ బౌలర్లకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా వన్డేల్లో విరాట్ ప్రస్తుతం నెక్స్ట్ లెవల్ ఫామ్ లో ఉన్నాడు. ఒకసారి కోహ్లీ పాకిస్థాన్ మీద గత రికార్డ్ పరిశీలిస్తే..
 
ఆ రెండు ఇన్నింగ్స్ లు ప్రత్యేకం:

2012లో ఆసియా కప్ లో భాగంగా భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచులో కోహ్లీ శివాలెత్తిన సంగతి తెలిసిందే. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని చేజ్ చేసే క్రమంలో ఒక్కడే వారియర్ లా 183 పరుగులు చేసి టీమిండియాకి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఆసియా కప్ చరిత్రలోనే బెస్ట్ ఇన్నింగ్స్. ఇక్కడి నుంచి కింగ్ ప్రవాహం ఎక్కడా ఆగలేదు. 50 ఓవర్ వరల్డ్ కప్, ఆసియా కప్, టీ 20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అనే తేడా లేకుండా భారీ ఇన్నింగ్స్ లు ఆడుతూ పాకిస్థాన్ కి పీడకలలా మారాడు. ఇక గతేడాది జరిగిన టీ 20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచులో కోహ్లీ సంచలన ఇన్నింగ్స్ ఇంకా అందరి మైండ్ లో అలాగే ఉంది. ఒకదశలో జట్టు స్కోర్ 40 పరుగులైనా లేకుండా నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లీ చూపించిన పోరాట స్ఫూర్తి అమోఘం. ముఖ్యంగా చివరి 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైన దశలో హారీస్ రౌఫ్ బౌలింగ్ లో చివరి రెండు బంతులని సిక్సర్లుగా మలచి టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించడం ఎవరు మర్చిపోగలరు.   

 ALSO READ :పల్లెకెలెలో ఎండ వచ్చింది.. మ్యాచ్ కు లైన్ క్లియర్ చేసిన వరుణుడు

అవి కూడా గ్రేట్ ఇనింగ్స్ లే:

2015 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచులో పాకిస్థాన్ మీద సెంచరీ, 2012 టీ 20 వరల్డ్ కప్ లో చేసిన 78 పరుగులు, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో విలువైన 81 పరుగులు 2019 వన్డే ప్రపంచ కప్ లో చేసిన 77 పరుగులు భారత విజయంలో కీలక పాత్ర పోషించాయి. మరి పాకిస్థాన్ అంటే చెలరేగిపోయే కోహ్లీ ఈ రోజు ఎలాంటి భారీ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి.