మేడిగడ్డను పరిశీలించిన..ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ

మేడిగడ్డను పరిశీలించిన..ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ
  • బ్యారేజీ వద్ద 7.30 గంటల పాటు అధ్యయనం
  • ఇంజినీర్లతో సమీక్ష అనంతరం రామగుండానికి
  • నేడు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలన

జయశంకర్‌‌ భూపాలపల్లి/ మహాదేవ్‌‌పూర్‌‌, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన బ్యారేజీల అధ్యయనం కోసం నేషనల్‌‌ డ్యామ్‌‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌డీఎస్‌‌ఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నది. కమిటీ చైర్మన్‌‌ చంద్రశేఖర్‌‌ అయ్యర్,  సభ్యులు ఎస్‌‌హెచ్‌ఆర్‌‌ పాటిల్‌‌, శివకుమార్‌‌శర్మ, రాహుల్‌‌కుమార్‌‌ సింగ్‌‌, అమితాబ్‌‌ మీనా తదితరులు ఉదయం 9.30 గంటలకే  మేడిగడ్డ చేరుకొని

 బ్యారేజీని అన్ని కోణాల్లో  పరిశీలించారు. ప్రధానంగా భూమిలోకి కుంగిన, దెబ్బతిన్న పిల్లర్లు, బ్లాక్‌‌ 7లోని ఫౌండేషన్‌‌ దగ్గర గంటల తరబడి విచారణ జరిపారు. కాగా, ఎన్‌‌డీఎస్‌‌ఏ ఎక్స్‌‌పర్ట్‌‌ టీమ్‌‌ పర్యటన కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టులను ఎల్‌‌ అండ్‌‌ టీ సంస్థ ప్రతినిధులు అడ్డుకున్నారు. స్థానిక‌ ఇరిగేషన్‌‌ ఇంజినీర్లు, పోలీసుల సహకారంతో ఎవరినీ బ్యారేజీ వైపు రానివ్వలేదు. 

ఏడున్నర గంటలపాటు పరిశీలన 

ఎన్‌‌డీఎస్‌‌ఏ ఎక్స్‌‌పర్ట్‌‌ టీమ్‌‌ చైర్మన్‌‌ చంద్రశేఖర్‌‌ అయ్యర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు దాదాపు ఏడున్నర గంటలపాటు మేడిగడ్డ వద్ద విచారణ జరిపారు. తమకు వచ్చిన అనుమానాలను ఎప్పటికప్పుడు స్థానిక ఇంజినీర్ల ద్వారా నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించారు. ముందుగా బ్యారేజీ పైనుంచే 7వ బ్లాక్‌‌లో కుంగిన పిల్లర్లను, వీషేప్​లోకి మారిన రోడ్డును  పరిశీలించారు. దాదాపు రెండు గంటలపాటు బ్యారేజీ పైనుంచే కుంగిన 11 పిల్లర్లను చెక్ చేశారు.  అనంతరం అప్‌‌ స్ట్రీమ్‌‌ వైపు కిందికి దిగి బ్యారేజీ 7వ బ్లాక్​కు చేరుకున్నారు.

ఒక్కో పిల్లర్‌‌ దగ్గరికి వెళ్లి  ఏ మేరకు భూమిలోకి కుంగాయో అంచనా వేశారు. 20వ పిల్లర్‌‌ 4 ఫీట్లకు పైగా, 19వ పిల్లర్‌‌3 ఫీట్లకు పైగా భూమిలోకి కుంగినట్టు నిర్ధారించుకున్నారు.  పిల్లర్లకు ఏర్పడిన క్రాక్స్ కొలతలను తీసుకున్నారు.  సిమెంటు బ్లాకులు ఏ మేరకు భూమిలోకి దిగబడ్డాయో చెక్ చేశారు. వాటర్ డిశ్చార్జి అయ్యేటప్పుడు ఎంత దూరం ఒత్తిడి పడుతున్నదో స్థానిక ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత డౌన్ స్ట్రీమ్ వైపునకు చేరుకుని 7వ బ్లాక్ మొత్తం నడుస్తూ ప్రతి పిల్లర్​ను చెక్ చేశారు.

 సుమారు 3 గంటలపాటు డౌన్‌‌ స్ట్రీమ్‌‌లోని పిల్లర్లను పరిశీలించారు.  సాయంత్రం 5.30 గంటలకు మేడిగడ్డ కంట్రోల్ రూం బిల్డింగ్​కు చేరుకొని అక్కడి నుంచి  డౌన్‌‌ స్ట్రీమ్‌‌ వైపు వేసిన వాక్‌‌ వే బ్రిడ్జి పై నుంచి పిల్లర్లను, వాటర్ డిశ్చార్జ్ ఏరియాను పరిశీలించారు. అనంతరం ఎల్ అండ్ టీ క్యాంప్ ఆఫీస్ కు చేరుకొని ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించి రామగుండం వెళ్లారు. శుక్రవారం అన్నారం బ్యారేజీ, ఆ తర్వాత సుందిళ్ల బ్యారేజీని పరిశీలించనున్నట్టు తెలిసింది.