మెఘా కంపెనీతో ఇరిగేషన్​ ప్రిన్సిపల్​ సెక్రటరీకి లింకేంది? 

మెఘా కంపెనీతో ఇరిగేషన్​ ప్రిన్సిపల్​ సెక్రటరీకి లింకేంది? 
  • సంచలనం రేపుతున్న ‘ది న్యూస్​ మినిట్’​ స్టోరీ
  • కాళేశ్వరం కాంట్రాక్ట్​ కంపెనీతో ఇరిగేషన్​ ప్రిన్సిపల్​ సెక్రటరీకి లింకేంది? 
  • విచారణ జరపాలని ప్రతిపక్షాల డిమాండ్
  • భారీ ప్రాజెక్టులు చేస్తున్న మేఘా

రాష్ట్రంలో ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​కు సారథ్యం వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూతురు పెండ్లికి ‘మేఘా’ కంపెనీ ఏర్పాట్లు  చేసినట్లు గురువారం ‘ది న్యూస్ మినిట్’ వెబ్​సైట్​ ప్రచురించిన ఇన్వెస్టిగేటివ్  స్టోరీ దుమారం రేపుతున్నది. అటు పెద్దాఫీసర్లలోనూ.. ఇటు పారిశ్రామిక వర్గాల్లోనూ ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఐఏఎస్ ఆఫీసర్ కూతురు పెండ్లికి, ఆ బడా కంపెనీకి మధ్య సంబంధమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి. 

మేఘా కాంట్రాక్టు కంపెనీ రాష్ట్రంలో కాళేశ్వరంతోపాటు పాలమూరు, మిషన్​ భగీరథ, ఇతర ఎన్నో ప్రాజెక్టులను చేపడుతున్నది. దాదాపు రూ.1.15 లక్షల కోట్ల భారీ ఖర్చుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. అదే ప్రాజెక్టుకు నోడల్ ఆఫీసర్ గా, ఇరిగేషన్ విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీగా రజత్ కుమార్ ఉన్నారు. కాళేశ్వరం కాంట్రాక్టర్స్​కు, ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న ఐఏఎస్ కు మధ్య ఉన్న అనధికార సంబంధం తమ దగ్గరున్న ఆధారాలతో బయటపడిందని ‘ది న్యూస్ మినిట్’ స్టోరీలో ప్రస్తావించింది.


హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్​ రజత్ కుమార్ కూతురు పెండ్లి ఇటీవల జరిగింది. దీనికి కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను చూస్తున్న మేఘా ఇంజనీరింగ్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్​లిమిటెడ్​ సంస్థ ఏర్పాట్లు చేసినట్లు ‘ది న్యూస్​ మినిట్​’ స్టోరీని ప్రచురించింది. పలు ఆధారాలను బయటపెట్టింది. పెండ్లి వేడుకలకు, దావత్​కు దాదాపు రూ. 50 లక్షలకుపైగా ఖర్చవగా.. అందులో రూ. 23 లక్షలను మేఘా కంపెనీ ఇతర కంపెనీల పేర్లతో చెల్లించినట్లు వివరించింది. స్టోరీలో ప్రస్తావించిన వివరాల ప్రకారం.. 

బిగ్​వేవ్​ ఇన్​ఫ్రా పేరిట..!

హైదరాబాద్​లోని పేరొందిన స్టార్ హోటళ్ల  వేదికగా ఐదు రోజులపాటు రజత్ కుమార్ తన కూతురు పెండ్లి  వేడుక నిర్వహించారు. డిసెంబర్ 17 నుంచి 21 మధ్య జరిగిన ఈ వేడుకకు ఈవెంట్లు, డిన్నర్లు, హోటల్ రూముల ఏర్పాట్లను మేఘా కంపెనీ ప్రతినిధులే చూసుకున్నారని, ఈవెంట్లను బుక్ చేసినట్లు ఈ మెయిల్, ఇన్ వాయిస్ డేటాను ‘ది న్యూస్ మినిట్’ ఆధారాలతో ప్రచురించింది. 

తాజ్ హోటల్ గ్రూపుకు బిగ్ వేవ్ ఇన్​ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బిల్లులు చెల్లించిందని, ఇదో మిస్టరీ కంపెనీ అని అనుమానాలు వ్యక్తం చేసింది. మేఘాకు చెందిన వివిధ సంస్థల డైరెక్టర్లే ఇందులో ఉన్నారని, అందుకే ఈ పెండ్లి ఏర్పాట్లు, బిల్లులతో మేఘా కంపెనీకి సంబంధం ఉందని బయటపెట్టింది. స్వయంగా రజత్ కుమార్, ఆయన ఓఎస్డీ ప్రభాకరరావు, ఇద్దరు మేఘా  ప్రతినిధులతో కలిసి ఇదంతా కో ఆర్డినేట్ చేసినట్లు తెలిపింది. పెండ్లికి ఐదు నెలల ముందే హోటళ్లలో రూమ్స్​ను బుక్​ చేశారని, నిరుడు జూలై 31న  బుకింగ్స్​​కోసం హోటళ్లకు మెయిల్స్​ వెళ్లాయని, అంతకు ఒక్క నెల ముందు (జూలై 1న) బిగ్​ వేవ్​ ఇన్​ఫ్రా కంపెనీని ఏర్పాటు చేశారని ‘ది న్యూస్​ మినిట్​’ వివరించింది. కంపెనీ అడ్రస్​ను పట్టుకొని తాము వెతకగా.. అక్కడ ఎలాంటి కంపెనీ లేనట్లు తేలిందని పేర్కొంది. 

ఒక్కో ప్లేట్​కు రూ. 16,520

డిసెంబర్ 20న తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో 70 మంది అతిథులకు రజత్ కుమార్ ఖరీదైన విందు ఇచ్చారు. ఒక్కో ప్లేట్ కు రూ. 16,520 చొప్పున బిల్లింగ్ అయిందని స్టోరీలో ‘ది న్యూస్​ మినిట్’ పేర్కొంది. ఎప్పుడు ఏం జరిగింది.. ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి.. వంటి పలు విషయాలను ప్రస్తావించింది. అయితే.. వీటిలో నిజాలు లేవని, తన కూతురి పెండ్లి ఏర్పాట్లు తానే స్వయంగా చేసుకున్నానని వెబ్​సైట్​కు రజత్ కుమార్​ వివరణ ఇచ్చారు. తమ కంపెనీకి, ఆ పెండ్లికి సంబంధం లేదని, వ్యక్తులుగా ఎవరైనా సహకరిస్తే అది తమ కంపెనీకి అంటగట్టడం సరైంది కాదని తమ స్టోరీ పబ్లిష్ అయిన వెంటనే మేఘా కంపెనీ వివరణ ఇచ్చిందని ‘ది న్యూస్ మినిట్’ పేర్కొంది. స్టోరీ పబ్లిషింగ్​కు ముందు వివరణ అడిగితే కంపెనీ ఇవ్వలేదని, పబ్లిష్​ అయిన తర్వాత వివరణ ఇచ్చినట్లు తెలిపింది.

కాళేశ్వరంలో అవినీతికి నిదర్శనం

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్ కు లక్షల కోట్ల సొమ్మును దోచిపెట్టినందుకు టీఆర్ఎస్ పెద్దలతోపాటు ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా ప్రతిఫలాలు తీసుకుంటున్నారు. ఇరిగేషన్ ముఖ్య అధికారి బిడ్డ పెండ్లికి బడా కాంట్రాక్టర్ బిల్లులు కట్టారని ఆధారాలతో వచ్చిన స్టోరీనే ఇందుకు నిదర్శనం. రైతులకు, ప్రజలకు ఒక్క పైసాకు పనికి రాకపోయినా పెద్దలకు మాత్రం ఈ ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతోంది.  ఇరిగేషన్ అక్రమాలపై నేను మొదటి నుంచీ చెప్తున్నదానికి ఇది మరో రుజువు. దీనిపై సమగ్ర విచారణకు బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విచారణ జరిపించకపోతే అక్రమాలను ఒప్పుకున్నట్లే. 

‑ వివేక్​ వెంకటస్వామి, 
బీజేపీ నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ కమిటీ మెంబర్​

ఇది క్విడ్​ ప్రో కో కాదా?

ఫైవ్‌‌‌‌ స్టార్‌‌‌‌ హోటల్‌‌‌‌లో ఇరిగేషన్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌  కూతురు పెండ్లికి స్పాన్సర్‌‌‌‌ ఎవరు? ఇది క్విడ్‌‌‌‌ ప్రో కో కాదా? ఒక భారీ సంస్థ తమ షెల్‌‌‌‌ కంపెనీ బిగ్‌‌‌‌వేవ్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రా ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ ద్వారా ఖరీదైన వివాహ ఏర్పాట్లు చేసినట్టుగా  మీడియా సంస్థ డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌‌‌‌లు సేకరించింది. సీఎంవోలో పనిచేసే ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌ మెంట్‌‌‌‌ సీనియర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌కు, ఇరిగేషన్‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌కు మధ్య ఉన్న అనుబంధంపై విచారణకు ఆదేశించాలి. 
‑ రేవంత్​రెడ్డి, పీసీసీ చీఫ్​

అనైతికతకు అద్దంపడుతున్నది

బ్యూరోక్రాట్లు, క్యాపిటలిస్టుల మధ్య అనైతిక, అక్రమ బంధానికి ఈ ఘటన అద్దం పడుతున్నది. ఈ వ్యవహారంపై ఎంక్వైరీ జరిపించాలి. దీన్ని ట్విట్టర్​లో కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా, సెంట్రల్‌‌ విజిలెన్స్‌‌ కమిషన్‌‌, డీవోపీటీ దృష్టికి తీసుకెళ్లా. 
‑ దాసోజు శ్రవణ్‌‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి

సీబీఐ విచారణ జరిపించాలి 

చిన్న ఉద్యోగులు తప్పులు చేస్తేనే ఏసీబీ, విజిలెన్స్‌‌తో దాడులు చేయించే కేసీఆర్​ ప్రభుత్వం.. ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌పై చర్యలు తీసుకోకపోతే చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న కార్పొరేట్‌‌ కంపెనీలు అందుకు ప్రతిగా ఉన్నతాధికారులకు భారీగా ముట్టచెప్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవాలను తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలి. 
‑ ఆర్‌‌.ఎస్‌‌. ప్రవీణ్‌‌ కుమార్‌‌, బీఎస్పీ స్టేట్‌‌ కో ఆర్డినేటర్‌‌