
-
2 ఎకరాలు కబ్జా జరిగినట్లు ఆరోపణలు
-
పోరాటానికి రెడీ అవుతున్న పరిరక్షణ కమిటీ
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ సహకార షుగర్ ఫ్యాక్టరీ భూముల లొల్లి మళ్లీ తెరపైకి వచ్చింది. ఆరేండ్ల కింద టీఆర్ఎస్‌కు చెందిన నేత వర్గానికి చెందిన కొందరు కబ్జాకు యత్నించగా రైతులు అడ్డుకున్నారు. మళ్లీ కొందరు ఇటీవల ఈ భూముల ఆక్రమణకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు ఆ వైపు చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
92 ఎకరాల్లో ఎన్సీఎస్ఎఫ్..
బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలో రద్దీ ఎక్కువగా ఉండి చెరుకు క్రషింగ్‌లో జాప్యం జరిగేది. దీంతో రైతులు చెరుకు మద్దతు కొల్పోయే వారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ బోధన్ డివిజన్, ఆర్మూర్సబ్ డివిజన్‌లోని చెరుకు రైతుల సౌలభ్యం కోసం వారి భాగస్వామ్యంతో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఫ్యాక్టరీ కోసం1962లో అప్పటి సర్కార్ జాన్కంపేట గ్రామ పరిధిలో 92 ఎకరాలు భూములను కొనుగోలు చేశారు. ఇందులో కార్మికులకు క్వార్టర్స్, ఫ్యాక్టరీ, చెరుకు రవాణా చేసే ట్రాక్టర్లు, లారీల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. భూమిని 40 ఫీట్ల రోడ్డుతో పాటు ఆఫీసర్లు, కార్మికులకు క్వార్టర్స్ నిర్మించారు. మోలాసిస్ ట్యాంకర్ల ఏర్పాటు చేశారు. మిగితా స్థలం ఫ్యాక్టరీ ఆధీనంలో ఉంది.
ఆక్రమణకు యత్నాలు..
ఫ్యాక్టరీ లే ఆఫ్‌తో ఈ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. 2015లో బోధన్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి వర్గానికి చెందిన కొందరు 3.24 ఎకరాలు తమదని డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ పత్రాలతో భూమిని చదును చేసి అక్రమణకు ప్లాన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్సీఎస్ఎఫ్పరిరక్షణ కమిటీ, రైతులు అడ్డుకున్నారు. భూములను కాపాడాలని కోరుతూ పరిరక్షణ కమిటీ రైతులు, అఖిల పక్షం నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడంతో కోర్టుకు వెళ్లారు. దీంతో కలెక్టర్ నేతృత్వంలో ఆఫీసర్ల బృందం అధ్యయనం చేసి కోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. హైకోర్టు నుంచి స్టే రావడంతో ఆక్రమణకు బ్రేకులు పడ్డాయి.
మరోసారి ప్లాన్..
తాజాగా కొందరు వలస కార్మికులు, మరి కొందరు ఫ్యాక్టరీ పక్కన ఉన్న నివాసిత ప్రాంతాలను అనుకుని తాత్కాలిక నిర్మాణలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సుమారు 2 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. ఓ వర్గం జనాభా ఇక్కడ స్థిరపడి భూములను కాజేయాలని చూస్తోందని ఎన్సీఎస్ఎఫ్ పరిరక్షణ కమిటీ ఆరోపిస్తోంది. ఇప్పటికైనా సర్కారు స్పందించి ఫ్యాక్టరీ స్థలాలపై రీసర్వే జరిపి కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కబ్జాకు ప్రయత్నిస్తున్నరు
ఎన్సీఎస్‌ఎఫ్ భూములను కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నరు. 2015లో అధికార పార్టీ లీడర్లు చదును చేస్తే రైతులు అడ్డుకున్నారు. అయినా వారు ఇప్పటికీ అక్కడక్కడ గుడిసెలు వేస్తుస్తున్నరు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ భూముల చుట్టూ కంచె నిర్మించాలి. - కొండె సాయిరెడ్డి, ఎన్సీఎస్ఎఫ్ పరిరక్షణ కమిటీ ప్రతినిధి