డాక్టర్లలోనూ సూసైడ్స్ ఎందుకు?

డాక్టర్లలోనూ సూసైడ్స్ ఎందుకు?

వైద్యోనారాయణో హరి అన్న నానుడి నిజం. ప్రతి వృత్తి దేనికదే సాటి అయినప్పటికీ వైద్య వృత్తి వాటికి భిన్నమైనది. మృత్యువు చివర అంచుల దాకా వెళ్లిన వారికి ప్రాణం పోసే శక్తి గల వైద్య వృత్తి పవిత్రమైనది. తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టేసి, ఎదుటి వ్యక్తి  ప్రాణాలు కాపాడాలనే  లక్ష్యంతో వైద్య విద్యను ఎంచుకుంటున్న స్టూడెంట్స్, డాక్టర్లు తమ ప్రాణాలనే  తీసుకుంటున్నారు. ఒత్తిడితో కూడిన పనిగంటలు, నిద్రలేమి, మానసిక అనారోగ్యం, సీనియర్ల వేధింపులు  కారణాలు ఏవైనా సరే.. బలవంతంగా ఊపిరి తీసుకుంటున్న  వైద్య విద్యార్థుల సంఖ్య దేశవ్యాప్తంగా ఎక్కువే. తెలంగాణలో వారం వ్యవధిలోనే  ఇద్దరు వైద్యవిద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. రాష్ట్రంలో తాజాగా మరో డాక్టర్ తుపాకీతో కాల్చుకొని ప్రాణం తీసుకున్నాడు.​

కలవరపరిచే గణాంకాలు

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో వైద్య కళాశాలలను, అత్యధిక వైద్యుల జనాభాను కలిగి ఉన్న భారతదేశంలో 529 వైద్య కళాశాలల నుంచి ప్రతి సంవత్సరం 80,000 మందికి పైగా వైద్య పట్టభద్రులు బయటకు వస్తున్నారు. డాక్టర్లలో ఆత్మహత్య ప్రమాదం సాధారణ జనాభాలో కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.  వైద్య విద్యార్థుల్లో ఆత్మహత్య ఆలోచనలు1.8% నుంచి 53.6% వరకు ఉన్నాయి. ప్రాంతీయ అధ్యయనాల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ రాష్ట్రాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉన్నది. అనస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ విభాగాల నుంచే ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ(ఐజేపీ 2021) లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 2010 – 2019 మధ్య కాలంలో వైద్యులు చేసిన మెటా-విశ్లేషణలో ఒత్తిడితో కూడిన పనిగంటలు, నిద్రలేమి, మానసిక అనారోగ్యం, వేధింపుల కారణాల వల్ల ఎక్కువ మంది పీజీ వైద్య విద్యార్థులు  బలవుతున్నారని తేలింది. ఆ స్టడీ 358  వైద్యుల ఆత్మహత్యలను నమోదు చేసింది. -యూజీ విద్యార్థులు125 ఉండగా, పీజీ విద్యార్థులు 105,  వైద్యులు 128 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పీజీ విద్యార్థుల ఆత్మహత్యల్లో 20 శాతం వర్క్‌‌‌‌ప్లేస్ వేధింపుల వల్లే, అందులోనూ 70% మంది 30 సంవత్సరాల కంటే ముందే ప్రాణాలను పోగొట్టుకోవడం బాధాకరం. 

మెడిసిన్ చదవడం కేక్ వాక్ కాదు

చాలా మంది విద్యార్థులు వైద్య వృత్తిలో కొనసాగడానికి, దాన్ని ఎంచుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. డాక్టర్ కావాలనే ఆశలు,అంచనాలు వాస్తవికతల మధ్య అంతరం తెలుసుకోలేకపోతుంటారు. దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 1,166 మంది విద్యార్థులు మెడిసిన్ చదువుకు స్వస్తి పలికినట్లు ఎన్ఎమ్ సీ వెల్లడించింది. ఎన్ఎమ్ సీ ఇచ్చిన వివరాల ప్రకారం.. ఎంబీబీఎస్ లో 160 మంది, పీజీ జనరల్ సర్జరీలో114 మంది, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ లో 50 మంది, గైనకాలజీలో 103, ఎంఎస్ ఈఎన్ టీలో 100, ఎండీ జనరల్ మెడిసిన్ లో 56, ఎండీ పీడీయాట్రిక్స్ లో  54, ఇతర విభాగాల్లో 529 మంది వైద్యవిద్యను మధ్యనే వదిలి వెళ్లిపోయినట్లు తేలింది. అంటే మెడిసిన్ లేదా వైద్య వృత్తిని చదవడం, తర్వాత ప్రాక్టీసు చేయడం కేక్ వాక్ కాదు ! అలాగే వైద్య వృత్తి పట్ల పట్టుదల, దీక్ష ఉన్న విద్యార్థులూ ఉంటారు, ఉన్నారు.

సాయం కోరడం నామోషీ కాదు

మానసికంగా ఎవరు ఇబ్బంది ఎదుర్కొంటున్నా, పక్కవారి సాయం కోరండ ఎప్పుడూ నామోషీ కాదు. జీవితం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. అడిగితే సాయం చేయాలనుకునే వారు చాలా మంది ఉంటారు. ఆత్మహత్య ఆలోచనలు వస్తే.. ఎక్కువ మందితో కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. మన దేశంలో వైద్యవృత్తి లో కూడా ఇతర విభాగాల వైద్యులకు మానసిక సమస్యలు, వైద్యం గూర్చి సరియైన అవగాహన లేకపోవడం బాధాకరం. అంతేకాకుండా ఇప్పటికి కూడా వైద్య వృత్తిలో మానసిక ఆరోగ్యం నిషిద్ధ అంశంగా చూడటం మరీ ఘోరం. ప్రతి జీవితం విలువైనది. విద్యార్థులకు సురక్షితమైన అభ్యాస వాతావరణాన్ని అందించాలి. దేశవ్యాప్తంగా వైద్యుల ఆత్మహత్యలకు విద్యాపరమైన ఒత్తిడి ఒక ప్రధాన కారణం. ఈ దిశలో వ్యవస్థలో మార్పులు అవసరం. విద్యార్థుల్లో ఒత్తిడితో కూడిన ఆత్మహత్యల సంఘటనలను నిరోధించేందుకు కౌన్సెలింగ్, సహాయక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలి. అన్ని వైద్య కళాశాలల్లో తప్పనిసరిగా 24 గంటల హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌ను ఏర్పాటు చేయాలి, డీన్ లేదా ప్రిన్సిపల్ అధ్యక్షతన ఒక అంతర్గత ఉన్నత-స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని వైద్య కళాశాలల్లో వ్యాధిని నివారించేందుకు మానసిక వైద్య శాస్త్రంలో అనుభవమున్న, అంకితభావం గల సైకియాట్రిస్ట్ ల తో కమిటీ నియమించాలి. యువత జీవితాలకు అకాల నష్టాన్ని నివారించడానికి అవసరమైన శిక్షణ అందించడంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ(ఐపీఎస్) నాయకత్వ పాత్ర పోషించవచ్చు.  సాయం కోరడంలో గోప్యత అడ్డంకిగా మారకుండా ఉండటానికి ఆన్‌‌‌‌లైన్ మద్దతు, సంరక్షణ వనరులు ఉండాలి. 

ఆత్మహత్యలకు కారణాలు ఏంటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం సాధారణ జనాభాలో కంటే మానసిక రుగ్మత కలిగిన రోగుల్లో ఆత్మహత్య  ప్రమాదం పది రెట్లు ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నిరాశ 30%, పదార్థ -వినియోగ సంబంధిత రుగ్మతలు18%, స్కిజోఫ్రెనియా14%, వ్యక్తిత్వ లోపాలు 13% కాగా.. భారతదేశంలోని వైద్య విద్యార్థులు, నిపుణులలో  విద్యాపరమైన ఒత్తిడి ఆత్మహత్యలకు ప్రధాన కారణమని, ఆ తర్వాత మానసిక అనారోగ్యం, వేధింపులు ఉన్నాయని తేలింది. ఒత్తిడితో కూడిన సుదీర్ఘ పని గంటలు వారి మానసిక శ్రేయస్సును గణనీయంగా ప్రభావితం చేస్తాయి. వారు తరచూ ఎక్కువ గంటలు ఆకలితో అలమటిస్తారు. సమయాన్ని ఆదా చేయడానికి ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటారు, నిద్ర లేమిని కలిగి ఉంటారు. డ్యూటీ షిఫ్ట్‌‌‌‌ల మధ్య తగినంత విశ్రాంతి తీసుకోరు. అధిక స్థాయి వ్యక్తిగత అంచనాలు, ప్రాణాంతకమైన మాదకద్రవ్యాలను సులభంగా యాక్సెస్ చేయడం, ఉదాసీనత, మరణం పట్ల నిర్భయత వంటివి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.  

– డా. బి. కేశవులు, రిటైర్డ్​ అసిస్టెంట్​ప్రొఫెసర్, ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల