రాష్ట్రంలో 1.51 కోట్ల వెహికల్స్.. సబ్సిడీపై 19,607 ట్రాక్టర్లు

రాష్ట్రంలో 1.51 కోట్ల వెహికల్స్.. సబ్సిడీపై 19,607 ట్రాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నవంబర్ 2022 నాటికి రిజిస్టర్ అయిన వెహికల్స్ సంఖ్య 1.51 కోట్లకు చేరినట్లు తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్ లుక్–2023 రిపోర్టులో ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఎరువుల వినియోగం తొమ్మిదేళ్లలో భారీగా పెరిగిందని, ఇసుక అమ్మకాల ద్వారా వేలాది కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,51,13,129 వెహికల్స్ ఉండగా అందులో 1,11,62,221 టూవీలర్లు ఉన్నాయి.  ట్రాక్టర్లు, ట్రాలీలు 6,82,932.. గూడ్స్ క్యారేజ్ వెహికల్స్ 5,95,659.. ఆటో రిక్షాలు 4,48,250.. మోటార్ క్యాబ్‌‌లు 1,14,564.. మ్యాక్సీ క్యాబ్‌‌లు 30,899.. విద్యాసంస్థల బస్సులు 28,672.. స్టేజ్ క్యారేజ్ వెహికల్స్ 9,400.. కాంట్రాక్ట్ క్యారేజ్ వెహికల్స్ 5,432.. ప్రైవేట్ సర్వీస్ వాహనాలు 3,051.. ఈ –  రిక్షాలు 234, ఇతర వెహికిల్స్ 86,508 ఉన్నాయి.

సబ్సిడీపై 19,607 ట్రాక్టర్లు

2014 – 15లో రాష్ట్రంలో రైతులు 25 లక్షల టన్నుల ఎరువుల వినియోగించగా.. 2021 – 22 నాటికి ఎరువుల వినియోగం 37.06 లక్షల టన్నుల (46 శాతం)కు పెరిగింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విత్తనాలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్నాటక, చత్తీస్‌‌గఢ్ కు ఎగుమతి చేస్తున్నట్లు రిపోర్టు వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వ్యవసాయ యాంత్రీకరణకు రూ.963 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా 19,607 ట్రాక్టర్లను సబ్సిడీపై ఇచ్చినట్లు తెలిపింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇసుక మైనింగ్ పాలసీ– 2014 రూపొందించి, టీఎస్ఎండీసీ ద్వారా సర్కారు ఇసుక అమ్మకాలు చేపట్టింది. డబుల్ బెడ్ రూం ఇండ్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పనులు, ఇతర ప్రభుత్వ పనులకు ఇసుక అమ్మకాల ద్వారా గతేడాది రూ.494.31 కోట్ల ఆదాయం వచ్చింది. 2014–-15 నుంచి నవంబర్ 2022 వరకు మొత్తం రూ. 5,288.30 కోట్ల రాబడి వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా పాదర్శకంగా అమ్మకాలు జరుపుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని అర్బన్ ఏరియాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 63 శాతం మంది సర్వీస్ సెక్టార్ లోనే పని చేస్తున్నారు. రూరల్ ఏరియాల్లో 66.1 శాతం మంది పెద్దవాళ్లు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, ఫిషింగ్ లో ఉపాధి పొందుతుండగా, 6 శాతం మంది కన్ స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉపాధి పొందుతున్నట్లు రిపోర్టులో వెల్లడైంది. అర్బన్ ఏరియాల్లో పనిచేస్తున్న మహిళలు.. గ్రామీణుల ఆదాయంతో పోలిస్తే రెండింతలు ఎక్కువగా సంపాదిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణ కార్మికుల రోజువారీ సంపాదన రూ.317గా ఉండగా, అర్బన్ ఏరియాలో రోజుకు రూ.440 సంపాదిస్తున్నారు.