రైతులకు ‘సర్వే’ కష్టాలు

రైతులకు ‘సర్వే’ కష్టాలు
  •     జిల్లాలో 801 అప్లికేషన్లు పెండింగ్​
  •     నెలల తరబడి ఆఫీసర్లు చుట్టూ తిరుగుతున్న రైతులు

కామారెడ్డి, వెలుగు: ధరణితో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులను భూ సర్వే డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు మరింత అవస్థలు పెడుతున్నారు. భూమి సరిహద్దు వివాదాలు, హెచ్చు తగ్గులు ఉన్న భూముల సర్వే చేయడానికి అప్లికేషన్లు పెట్టి నెలలు గడుస్తున్నా కొలతలు చేయడం లేదు. ఒక వేళ సర్వే చేసినా రిపోర్టు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 

ఇదీ పరిస్థితి..

జిల్లాలో భూ సరిహద్దు వివాదాలు, పక్క వాళ్లు అక్రమించడం,  ఒకరి భూమిలో మరొకరు కబ్జాలో ఉండడం వంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్లకు అప్లికేషన్ పెట్టడంతో పాటు,  గవర్నమెంట్ అకౌంట్‌‌‌‌లో చలానా రూపంలో డబ్బులు చెల్లించాలి. రైతు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సర్వే చేసే భూమి పక్కన ఉన్న మిగతా రైతులతో పాటు, దరఖాస్తుదారుడికి నోటీసు ఇచ్చి సర్వే చేస్తారు. మండల స్థాయిలో ఉన్న సర్వేయర్​చేసిన సర్వే నచ్చనట్లయితే రైతులు మళ్లీ డివిజన్  ఇన్‌‌‌‌స్పెక్టర్​(డీఐ), జిల్లా స్థాయిలో ఉండే అసిస్టెంట్​ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌(ఏడీ)కి అప్లయ్​చేసుకుని మళ్లీ సర్వే చేయించుకోవచ్చు. 

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో  801 అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. 9  నెలల్లో మండల స్థాయిలో సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 585 అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌లో ఉండగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో కొత్తగా 192 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 145 అప్లికేషన్లు క్లియర్ కాగా ఇంకా 632 పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. డివిజన్ ఇన్‌‌‌‌స్పెక్టర్, ఏడీ స్థాయిలో పాతవి 178 ఉండగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 80 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 89 క్లియర్​ కాగా 169 పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి.   

సాకులు చెబుతూ.. 

జిల్లాలో 22 మండలాలు ఉండగా 13 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఆరుగురు ఎగ్జామ్ కోసం సెలవు పెట్టారు. దీంతో ఏడుగురు మాత్రమే పని చేస్తున్నారు. ఈ లెక్కన మూడు మండలాలకు ఒక సర్వేయర్ ఉన్నారు. డివిజన్ స్థాయిలో ఇన్‌‌‌‌స్పెక్టర్లు నలుగురు ఉన్నారు. సర్వేయర్ల సాకు చూపుతూ రైతుల భూములు సర్వే చేయడానికి ఆఫీసర్లు ముందుకు రావడం లేదు. నెలల తర్వాత సర్వే చేసినా ఆ రిపోర్టును రైతుకు ఇవ్వడం లేదు. 

ఈ ఫొటోలో ఉన్నది ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌‌‌‌కు చెందిన రైతులు కొత్త సందీప్, కొత్త కాశీరాం. వీరికి సర్వే నంబర్​ 375లో రెండు ఎకరాల భూమి ఉంది. వీరి పేరిట పట్టాదారు పాస్​బుక్ ఉంది. కానీ భూమి మాత్రం ఇతరులు కబ్జాలో ఉంది. భూమి సర్వే కోసం 2022 ఫిబ్రవరి 16 న అప్టికేషన్​పెట్టుకున్నారు. 9  నెలల తర్వాత ఆఫీసర్లు పక్క రైతులకు నోటీసులు ఇచ్చి సర్వే చేశారు.  నెల రోజులు దాటినా ఆ సర్వే రిపోర్ట్‌‌ను అప్లికేషన్ పెట్టిన రైతులకు ఇవ్వడం లేదు. తహసీల్దార్‌‌‌‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. చాలా సార్లు సంబంధిత ఆఫీసర్లను కలిసినా ఫలితం లేదు. ఇటీవల బాధితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ సమస్య తీరలేదు.  

స్టాఫ్‌‌ లేక డిలే అవుతోంది

సర్వేయర్ల కొరత కారణంగా రైతుల  భూముల సర్వే డిలే అవుతోంది. సమస్య ఎక్కువగా ఉన్న చోట త్వరగా పరిష్కరిస్తున్నాం.   రిపోర్టులు త్వరగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.  - శ్రీనివాస్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్​