ఫీజు కట్టకుంటే ప్రాపర్టీ సీజ్​.. జీవో 59 దరఖాస్తుదారులకు ఆఫీసర్ల వార్నింగ్

ఫీజు కట్టకుంటే ప్రాపర్టీ సీజ్​.. జీవో 59 దరఖాస్తుదారులకు ఆఫీసర్ల వార్నింగ్
  •  ఫీజు పేరుతో వసూళ్లే లక్ష్యం..!
  •  జీవో 59 దరఖాస్తుదారులకు ఆఫీసర్ల వార్నింగ్
  •  రూ.లక్షల్లో కట్టుడంటే మార్కెట్​రేటేనా?

    ఖమ్మం, వెలుగు: ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్​కోసం జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్నవారికి ఆఫీసర్లు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లాస్థాయి ఆఫీసర్లే రంగంలోకి దిగి దరఖాస్తుదారులను కలుస్తున్నారు. వెంటనే ప్రభుత్వం చెప్పినట్లు డిమాండ్​ నోటీసులో ఉన్న మొత్తాన్నిచెల్లించి రెగ్యులరైజ్​చేయించుకోవాలని, లేదంటే కరెంట్ కనెక్షన్, నల్లా బిల్లు కట్ చేస్తామని, అప్పటికీ ఫీజు కట్టకుంటే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నివాసం ఉంటున్నందుకు ఇంటిని ఖాళీ చేయించి సీజ్​చేస్తామని తేల్చి చెబుతున్నారు. 59 కింద అప్లై చేసుకున్న వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఎంప్లాయీ ఉంటే వారిని బెదిరిస్తున్నారు. తమ తండ్రి, తాతల కాలం నుంచి ఉంటున్న ఇంటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు దరఖాస్తు చేస్తే, ఇప్పుడు తామెలా బాధ్యత వహిస్తామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జీవోల్లో అసలేం ఉంది...

జీవోలు 58, 59 కింద ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నందుకు రెగ్యులరైజ్​కోసం గతేడాది ప్రభుత్వం అవకాశం కల్పించింది.125 గజాల్లోపు ఉన్నవారికి జీవో 58 కింద ఫ్రీగా పట్టాలివ్వగా, అంతకంటే ఎక్కువ స్థలం ఉన్నవారికి మాత్రం రెగ్యులరైజేషన్ ఫీజు కట్టాలంటూ గతేడాది డిసెంబర్ లో ఆఫీసర్లు నోటీసులు పంపించారు. దీన్ని ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మూడు విడతలుగా చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు, మార్కెట్ ధరకు సమానంగా ఉందనే అభిప్రాయంతో చాలా మంది పైసలు కట్టలేదు. జిల్లాలో జీవో 59 కింద మొత్తం 3వేలకు పైగా దరఖాస్తులు రాగా, 2559 మందిని అర్హులుగా గుర్తించారు. ఫీజు పెద్ద మొత్తంలో ఉందని ఆందోళనలు చేయడంతో ఆ మొత్తాన్ని తగ్గించి మళ్లీ నోటీసులు పంపించారు. అయినా కేవలం250 మందే పూర్తిగా చెల్లించారు. 

చెప్పింది ఒకటి.. చేసింది మరొటి..

దరఖాస్తు టైంలో ప్రభుత్వం125 గజాలకు మించి 250 గజాల్లోపు ఇండ్లు కట్టుకుంటే ఆ ఏరియాలో ప్రభుత్వ ధరలో 25శాతం, 251 నుంచి 500 గజాల్లో కట్టుకుంటే 50శాతం, 500 నుంచి 1000 గజాల్లోపు ఇల్లు కట్టుకుంటే 75 శాతం ఫీజు చెల్లించాలి. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణతో వాటి విలువ పెరగడంతోపాటు భవిష్యత్​లో బ్యాంకు లోన్లు వస్తాయని, అమ్ముకునేందుకు కూడా అడ్డంకులు ఉండవనుకున్నారు. నోటీసుల్లో వచ్చిన ఫీజు మొత్తాన్ని చూసి షాక్ తిన్నారు. మొత్తం స్థలంలో ఇంటి నిర్మాణ స్థలానికి మాత్రమే ప్రభుత్వ శ్లాబులు వర్తిస్తుండగా, ఖాళీ స్థలానికి 100 శాతం ఫీజు చెల్లించాలని చెబుతున్నాయి. దీంతో దరఖాస్తు చేసుకున్నవారు ఖంగుతిన్నారు. శనివారం కలెక్టర్​వీపీ గౌతమ్​ సత్తుపల్లిలోని జలగంనగర్, జవహర్ నగర్, ద్వారాకాపుడి కాలనీల్లో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడారు. డిమాండ్​ఫీజు కట్టకుండా ప్రభుత్వ స్థలాల్లో ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఈ ఫొటోలో ఉన్నది నగరంలోని దివ్యాంగుల కాలనీకి చెందిన హనుమంతరావు. రేకులతో కట్టుకున్న ఇంటి స్థలాన్ని(204 గజాలు) జీవో59 కింద రెగ్యులరైజేషన్ కోసం అర్జీ పెట్టుకున్నాడు. ఫీజు కింద రూ.38,01,600 మొత్తాన్ని మూడు విడతల్లో కట్టాలంటూ ఆఫీసర్లు నోటీసులిచ్చారు. మొరపెట్టుకుంటే చివరకు రూ.13.68 లక్షలకు తగ్గిస్తూ వెంటనే కట్టాలని మరో నోటీస్ ఇచ్చారు. ఇక్కడ బేసిక్​రేటు గజానికి రూ.9500 ఉండగా ఏ లెక్క చొప్పున ఇంత మొత్తం ఫీజు వేశారని బాధితుడు ప్రశ్నించాడు. ఇల్లు కట్టుకున్న 80 గజాలకే 25శాతం ఫీజు అని, మిగిలిన124 గజాలకు వందశాతం కట్టాల్సిందేనని, ఒకట్రెండు రోజుల్లో ఫీజు కట్టకపోతే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నివసిస్తున్నందుకు ఇంటిని ఖాళీ చేయించి, ప్రాపర్టీ సీజ్ చేస్తామని ఆఫీసర్లు బెదిరిస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నాడు.

కరెంట్, నల్ల కట్ చేస్తమన్నరు...

రోజూ కూలి పనులు చేసు కుంటం. మాకు రూ.లక్షల్లో డిమాండ్ నోటీసు ఇచ్చిం డ్రు. జిల్లా సార్లే వచ్చి వెంటనే మొత్తం కట్టి రిజిస్ట్రేషన్ చేయిం చుకోవాలన్నరు. లేదంటే కరెంట్, నల్లా కట్ చేస్తామన్నరు. ఇది చాలా బాధకలిగించింది. పెద్దోళ్లు దీనిపై జర ఆదుకోవాలె.
- దేవపాటి కుమార్, జలగం నగర్, సత్తుపల్లి