పాలమూరుకు ఐటీ కంపెనీలు రాలే! టవర్ ​ప్రారంభించి 50 రోజులైనా ఒక్కటీ తీసుకురాలే...

పాలమూరుకు ఐటీ కంపెనీలు రాలే! టవర్ ​ప్రారంభించి 50 రోజులైనా ఒక్కటీ తీసుకురాలే...

పాలమూరుకు ఐటీ కంపెనీలు రాలే!

టవర్ ​ప్రారంభించి 50 రోజులైనా ఒక్కటీ తీసుకురాలే...

మహబూబ్​నగర్, వెలుగు : వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేశామని సర్కారు చెబుతున్న పాలమూరు ఐటీ టవర్ ​వెలవెలబోతోంది. ప్రారంభించి నెలన్నరయినా ఇంతవరకు ఒక్క కంపెనీ కూడా రాలేదు. దీంతో కరెంటు సప్లై కూడా నిలిపివేయడంతో ఐటీ టవర్​ చీకట్లో మగ్గుతోంది. మహబూబ్​నగర్ జిల్లాలో ఐటీ పార్క్​ఏర్పాటు కోసం దివిటిపల్లి వద్ద 2018లో 370 ఎకరాలను సేకరించారు. అదే ఏడాది జులైలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఐదెకరాల్లో రూ.40 కోట్లతో బిల్డింగ్​ నిర్మించగా , మే 6వ తేదీన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్​ గౌడ్​ ప్రారంభించారు. ఓపెన్​ చేసి 50 రోజులు దాటినా ఇంతవరకు ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేదు. ఇక్కడే స్కిల్​ డెవలప్​మెంట్ ​సెంటర్​ఏర్పాటు చేస్తామని, స్థానిక నిరుద్యోగులకు కమ్యూనికేషన్, లాంగ్వేజ్,  టెక్నికల్ ​స్కిల్స్​పై ట్రైనింగ్​ ఇస్తామని చెప్పినా.. అదీ ఏర్పాటు చేయలేదు.    

వంద కంపెనీలన్నరు.. ఒక్కటీ రాలే..

ఐటీ టవర్ ​ఏర్పాటు చేస్తున్నప్పుడు వంద కంపెనీలు వస్తాయని లీడర్లు ప్రకటించారు. టవర్​ ప్రారంభం నాటికి కనీసం 13 నుంచి 16 కంపెనీలు వస్తాయని భావించారు. ఇక్కడ  బ్రాంచ్​లను ఏర్పాటు చేయాలని విదేశీ కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నామని, ఒకటిరెండు కంపెనీలు అంగీకరించాయని కూడా మంత్రులు ప్రకటించారు. కానీ, స్థానిక కంపెనీలు కూడా ఇంత వరకు కార్యకలాపాలను ప్రారంభించలేదు.

ALSO READ:కిలో టమాటా రూ.100,,,పచ్చిమిర్చి 120..కొనలేక జనం విలవిల 

రాత్రయితే చిమ్మచీకట్లు

ఐటీ టవర్​కు కరెంట్​సప్లై చేసేందుకు పక్కనే మినీ సబ్​స్టేషన్​ఏర్పాటు చేశారు. ఐటీ టవర్​కు టీఎస్ఐఐసీ 1000 కేవీ కరెంట్​కనెక్షన్​ తీసుకుంది. టవర్​లో ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో కరెంటు బంద్​ చేశారు. దీంతో రాత్రయితే ఈ  ఏరియా అంతా చిమ్మచీకటి కమ్ముకుంటోంది. బోరు ఉన్నా కరెంటు లేకపోవడంతో మొక్కలకు నీళ్లు పట్టడంలేదు. ఫలితంగా అవన్నీ ఎండిపోతున్నాయి. టీఎస్ఐఐసీ ఐటీ టవర్​కు 1000 కేవీ విద్యుత్ ​లైన్ ​తీసుకున్నారని, కరెంటు ఎందుకు బంద్​చేశారన్నది తమకు తెలియదని ట్రాన్స్​కో అధికారులు చెప్తున్నారు. ఐటీ టవర్​లో ప్రస్తుతం ఏ కంపెనీ లేకపోవడం వల్ల లైట్లు ఆన్ ​చేయడం లేదని, కరెంట్​వృథా అవుతుందనే  బంద్​ చేశామని టీఎస్ఐఐసీ అధికారులంటున్నారు.