అనర్హులకు డబుల్‌ ఇండ్లు కేటాయించారని ధర్నా

అనర్హులకు డబుల్‌ ఇండ్లు కేటాయించారని ధర్నా
  • నిరసనగా తహసీల్దార్​ ఆఫీసు ఎదుట బైఠాయింపు  
  • జాతీయ రహదారిపై రాస్తారోకో
  • పోలీసుల జోక్యంతో ఆందోళన విరమణ 

జోగిపేట, వెలుగు : డబుల్‌ బెడ్​రూమ్ ​ఇండ్ల జాబితాలో అనర్హులను చేర్చారంటూ సంగారెడ్డి జిల్లా డాకూర్‌ గ్రామానికి చెందిన ప్రజలు బుధవారం జోగిపేటలోని తహసీల్దార్‌ ఆఫీసు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంట పాటు ఆందోళన చేసినా అధికారులు స్పందించకపోవడంతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ఎస్‌ఐ సామ్యానాయక్‌ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. అక్సాన్‌పల్లి సొసైటీ పీఏసీఎస్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేశ్​గౌడ్, ఉప సర్పంచ్‌ అజయ్, దళిత సంఘాల నాయకులు సంజీవయ్య, మల్లేశం, పద్మారావుతో పాటు మరికొందరు ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ప్రకటించి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో పోలీస్‌ స్టేషన్‌కు బలవంతంగా తరలించే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొంది. అనర్హులను ఎంపిక చేశారని ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వస్తే ఎవరూ స్పందించలేదని, అందుకే రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని గ్రామస్థులు ఎస్‌ఐకి చెప్పారు. రోడ్డుపై నుంచి లేస్తే న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి లేచి పోలీస్‌ స్టేషన్‌కు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. స్టేషన్​కు ఇన్​చార్జి తహసీల్దార్‌ అరుణోదయచారిని పిలిపించి వినతిపత్రం ఇప్పించడంతో శాంతించారు. 

20 మందిని తీసేసిన్రు

డాకూర్‌లో నిర్మించిన 104 డబుల్‌ బెడ్​రూమ్​ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులను ఆర్‌డీఓ సమక్షంలో డ్రా తీసి ఎంపిక చేశారని, కానీ లిస్టులోంచి 20 మందిని తొలగించారని గ్రామస్థులు ఆరోపించారు. అందులో అధికార పార్టీ లీడర్లు చెప్పిన పేర్లను చేర్చారన్నారు. దీనిపై సమగ్ర విచారణ  జరిపించి అర్హులకే ఇండ్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రెండు రోజుల్లో విచారణ జరిపి న్యాయం చేస్తానని ఇన్​చార్జి తహసీల్దార్‌ అరుణోదయచారి హామీ ఇచ్చారు.