ముంపు తిప్పలు ఇంకెన్నాళ్లు?

ముంపు తిప్పలు ఇంకెన్నాళ్లు?

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒనగూరిన ప్రయోజనమేమిటో తెలియదు కానీ.. గోదావరి పరీవాహక ప్రజలకు బ్యాక్​వాటర్​తోనే ఏటా తిప్పలు తప్పడం లేదు. ఎత్తిపోతల నీళ్లు పంట పొలాలను తడపడం మాట అటుంచితే.. వరద నీరు మాత్రం పంటలను, ఇండ్లను ముంచుతున్నది. తెలంగాణ వస్తే మా బతుకులు మారి పంట పొలాలు, పచ్చగా ఉంటాయని భ్రమపడ్డాం. కానీ రీ డిజైనింగ్ తో గోదారమ్మ వెనుతిరిగి, తలలు తాకట్టు పెట్టి అల్లారు ముద్దుగా కట్టుకున్న మా ఇండ్లను 10 మీటర్ల మేర కమ్మేస్తుందని గ్రహించలేకపోయాం. జూన్, జులై నెలలు వస్తే పంటలేసిన రైతులు సహా ఇండ్లలో ఉన్న ప్రజలు బ్యాక్​వాటర్​ముంపు భయంలో బతకాల్సి వస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు అసమర్థులు. ఈ జిల్లాకు తీరని అన్యాయం చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఉంటుందో తెగిపోతుందో తెలియని కడెం ప్రాజెక్టు, సామర్థ్యానికి మించి వరద నీరు కడెంలోంచి విడుదల చేస్తున్నారంటే, గోదావరి పరీవాహక గ్రామాలు పట్టణాలు ఇల్లు వదిలి తలదాచుకోవడానికి తలో దిక్కుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ప్రతీసారి వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ అంటేనే ఒక వివక్ష. పరిస్థితి విషమించిన తర్వాత, పర్యటనలకు వచ్చి  పరిశీలించడమే గానీ..  ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదు. గతంలో అనేకసార్లు, ఇంజనీర్లు, నీటిపారుదల విశ్లేషకులు ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని చెప్పినప్పటికీ, పాలకులు పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే అనేక తీర గ్రామాలను మంచిర్యాలను, చెన్నూరు మంథనీలను ముంచుతున్నది.

పంటలు నీళ్లపాలు

తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీరు వచ్చేది. ఎలాంటి ముంపు సమస్య ఉండేది కాదు.  దాన్ని పక్కన పడేసి, ప్రకృతికి విరుద్ధంగా మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, మంచిర్యాల జిల్లావాసులను, ప్రాణహిత గోదావరి నదుల పరీవాహంలోని చెన్నూరు నియోజకవర్గం ప్రజల బతుకులను, పంట పొలాలను నీళ్ల పాలు చేశారు. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేను కాళేశ్వరం ముంపు బాధిత రైతులు ఇటీవల నిలదీశారు. కాళేశ్వరం నీటి ముంపుతో ఇసుక మేటలు వేసినా.. మా పంట పొలాల అవస్థను చూసేందుకు ఎందుకు రారు? అని నిలదీశారు. నాలుగేండ్లుగా ఒక్క పైసా పరిహారం ఇవ్వడం లేదు. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన వరద నీరు, ప్రాజెక్టుల గుండా బయటికి పోయే అవకాశం లేక, పంట పొలాలను ముంచుతున్నది. ఇండ్లను బురదమయం చేస్తే రెండంతస్తులు జలంలో మునిగిపోతున్నాయి. ముంపుతో జనం పరుగులు తీస్తే విష సర్పాలు ఇంట్లోకి వస్తున్నాయి. ఒక్క నాయకుడు కూడా వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. వందల ఎకరాల పంట భూములు, నీట మునిగి కోతకు గురై కొన్ని సంవత్సరాల దాకా పంటకు నోచుకోకుండా సారవంతమైన నేల శాశ్వతంగా దెబ్బ తింటున్నది. ఏటా వరద ముంపు అనవాయితీగా మారింది. దశాబ్దాలుగా లేని ఈ దురవస్థ కాళేశ్వరం వల్లనే కదా వచ్చింది. ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇల్లు బురదమయమై, గుర్తుపట్టలేనంతగా ధ్వంసమవుతున్నాయి. ఒకరి ఇండ్లను ఒకరు చూసి, పక్కపక్క వాళ్లంతా ఒక చోటికి చేరి ఏడిస్తే, ఆ కన్నీళ్లు కాళేశ్వరంలో కలిసిపోతున్నాయి.. తప్పితే పాలకులు మాత్రం కానరావడం లేదు.

ఓ మహిళ దీన గాథ ఇదీ..

సిద్ధి వినోద, భర్త వీరయ్య మంచిర్యాల నివాసులు. 30 ఏండ్ల నుంచి అల్లం వెల్లిపాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కిరాయి ఇండ్లలో ఉండి ఎన్నో బాధలు అనుభవించి.. అప్పు చేసి మరి ఇల్లు కట్టుకున్నారు. ఎంతో ఆనందంతో బంధుమిత్రులతో కలిసి గృహప్రవేశం చేశారు. నెల తిరగకుండానే 2022 జులై12 న సుందిళ్ల బ్యారేజీ బ్యాక్ వాటర్ పోటెత్తింది. ఎగువ నుంచి వచ్చిన కడెం వరదతో ఎల్లంపల్లి నిండింది. వరదను కిందకు వదలడంతో, నీరంతా మంచిర్యాల కాలనీలను చుట్టుముట్టింది. గోదావరిలో చేరే వాగులన్నీ పోటుకమ్మి మంచిర్యాల  ఇండ్లన్నీ నీట మునిగాయి. 30 ఏండ్ల నుంచి ఎంతో కష్టపడి సొంతిల్లు కట్టుకొని అందులో ఉందామని అనుకున్న వినోద కల కల్లలైంది. వరదలో ధ్వంసమైన ఇల్లును చూసి వినోద దంపతుల గుండె పగిలింది. కొన్ని రోజులపాటు నిత్యం కుమిలిపోయిన వినోద.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నది. ఏటా ఈ వరద తిప్పలు తప్పవని ఆమె నిర్మించుకున్న ఇంటిలోనే, ఉరి వేసుకొని చనిపోయింది. ఏటా కాళేశ్వరం ముంపు శాపంగా మారుతున్నది. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు ఎంత మొత్తుకుంటున్నా.. పాలకుల్లో మాత్రం చలనం లేదు.

సర్వం కోల్పోతూ..

ముంపు తగ్గి, ఇండ్లలోకి చేరుకున్న తర్వాత 48 గంటలైనా విద్యుత్ ఇవ్వకపోవడం, నీటి సరఫరా లేకపోవడం ప్రజలను నానా  ఇబ్బందులకు గురిచేస్తున్నది. 
వీటి గురించి పట్టించుకున్న నాయకుడు లేడు. ఇంకా అనేకమంది నిరుపేదలు, తమ వంట సామాగ్రి, ఆహారపు వస్తువులు, ఇంట్లో ఉన్న దుస్తులు, దుప్పట్లు సహా అన్నీ కొట్టుకపోతాయి. తడిసి బురదతో ముద్దయి పనికిరాకుండా పోతాయి. కట్టు బట్టలు తప్ప మరేమీ లేని నిరుపేదలను ఆదరించిన వారే లేరు. ఆ పేదలకు బడులను, గుళ్లను పునరావస కేంద్రాలుగా చూపించి, వాళ్లని దొడ్లో పశువుల్లా తోలుతున్నారు. సర్వస్వం కోల్పోయిన ఆ నిరుపేదలు ముంపు తగ్గాక ఇండ్లకు వచ్చి ఆహాకారాలతో ఇండ్ల దగ్గర విలపిస్తూ, అన్నమో రామచంద్ర అంటూ.. అన్నం కోసం అలమటిస్తున్నారు.

- అందె మంగళప్రద,
రాష్ట్ర కార్యదర్శి, ప్రగతిశీల మహిళా సంఘం