పంజాబ్ను ఊడ్చేసిన ఆప్

పంజాబ్ను ఊడ్చేసిన ఆప్

పంజాబ్‌లో అద్భుతం జరిగింది. చీపురు పార్టీ ఆమ్‌ఆద్మీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది.ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ప్రకటించిన మ్యానిఫెస్టో,హామీలకు ప్రజలు ఫిదా అయిపోయారు.అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హేమాహేమీలను మట్టికరిపించింది. అధికార కాంగ్రెస్‌, ప్రాంతీయ ఆదరణ ఉన్న శిరోమణి అకాళీ దళ్‌, మరో జాతీయ పార్టీ బీజేపీలకు కామన్‌గా షాక్‌ ఇచ్చింది ఆప్‌. ఫలితాలు నువ్వే-నేనా అన్నట్టు  ఉంటాయనుకుంటే వార్ మాత్రం వన్ సైడ్ గా మారిపోయింది. పంజాబ్ ప్రజలు హస్తంకు హ్యాండ్ ఇచ్చి చీపురుకే జై కొట్టారు.అందుకే ఫలితాల్లో ఆప్ సత్తా చాటుతోంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా పయనిస్తోంది. 

రాష్ట్రంలో మొత్తం 117 సీట్లలో ఆప్ మేజిక్ ఫిగర్ ను దాటింది. దాదాపు  90 సీట్లలో లీడ్ లో కొనసాగుతోంది. కాంగ్రెస్ కేవలం 15 సీట్లలో లీడ్ లో కొనసాగుతూ సెకండ్ ప్లేస్ కే పరిమితమైంది.రెండోసారి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కన్న కలలు కల్లలుగా మిగిలిపోయాయి. ఇక అకాలీదళ్, బీజేపీ చెరో రెండు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి.పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 59. అయితే ఇప్పటికే ఆప్‌ ఆ ఫిగర్‌ను దాటేసింది. ఫోన్‌ కాల్‌ స్పందన ద్వారా ఎంపిక చేసిన సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఈ ఫలితాల్లో పంజాబ్‌ ఆప్‌ శ్రేణుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని ఆప్ ఆఫీసుల వద్ద బాణా సంచా కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు కార్యకర్తలు. డప్పులు వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.