గ్రేటర్ ​వరంగల్లో కాలనీలు మునుగుతున్నా పట్టించుకుంటలేరు

గ్రేటర్ ​వరంగల్లో కాలనీలు మునుగుతున్నా పట్టించుకుంటలేరు

హనుమకొండ/వరంగల్, వెలుగు: వానాకాలం వచ్చిందంటే చాలు గ్రేటర్ ​వరంగల్ లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పైనుంచి వచ్చే వరద నీరు సాఫీగా వెళ్లేందుకు కాలనీల్లో డ్రైనేజీలు సహా ఎలాంటి మార్గాలు లేవు. దీంతో చిన్న వాన పడినా లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయం అవుతున్నాయి. ఇలాంటి కాలనీలు నగరంలో దాదాపు 40 వరకు ఉన్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా పర్మినెంట్ ​సొల్యూషన్ ​చూపించాల్సిన లీడర్లు, ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వరదలు ముంచెత్తిన ప్రతిసారి తాత్కాలిక పనులు చేపట్టడం, ఆ తరువాత చేతులు దులిపేసుకుంటుండటంతో ప్రతి సంవత్సరం లోతట్టు కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది.

చిన్న వానకే మునుగుతున్నయ్​

ఓరుగల్లు నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో చాలావరకు సైడ్​డ్రైన్లు లేవు. గట్టివాన పడిందంటే చాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇండ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. దీంతో ఆయా కాలనీల ప్రజలు ఇండ్లు విడిచి పోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వరంగల్ లేబర్​కాలనీ నుంచి సీకేఎం కాలేజీ వరకు దాదాపు రూ.38 కోట్లతో స్మార్ట్ రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు వెంట డ్రైన్​కట్టాల్సి ఉన్నా సంబంధిత ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో ఎస్​ఆర్​​నగర్​వద్ద వరద నీరు కిందికి వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఇక్కడ రెండు డివిజన్లు కలుస్తున్నచోట వరద నీటి మళ్లింపు విషయమై వివాదం నడుస్తోంది. దీంతో పైనుంచి వస్తున్న వరదతో సాయి గణేశ్​కాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, ఎస్ఆర్​నగర్, వివేకానంద కాలనీ మొట్టమొదట ముంపునకు గురవుతున్నాయి. వరంగల్‍, కాజీపేట మూడో రైల్వే లైన్‍ పనులు జరుగుతున్న నేపథ్యంలో బొందివాగు నాలాను కొన్ని నెలలుగా మూసివేశారు. రైల్వే అధికారులతో మాట్లాడి పనులను సకాలంలో కంప్లీట్‍ చేయించి జూన్‍లోపే నాలా ఓపెన్‍ చేస్తామన్న లీడర్లు.. ఆపై పట్టించుకోలేదు. ఇప్పుడు పైనుంచి వరద రావడంతో  బొందివాగు నాలాను జేసీబీతో ఒక్కసారిగా ఓపెన్‍ చేయడంతో నీరంతాఎన్‍టీఆర్‍ నగర్‍, బృందావన్‍ కాలనీ, సాయినగర్‍, సంతోషిమాత టెంపుల్‍ ఏరియా, మైసయ్యనగర్‍తో పాటు వరంగల్‍ అండర్‍ బ్రిడ్జి, పెరకవాడ, శివనగర్‍లోని ఇండ్లల్లోకి నీరు చేరింది. ఎన్‍టీఆర్‍ నగర్‍ లో మూడు, నాలుగు రోజుల తర్వాత సైతం మోకాళ్ల లోతు నీరు అలానే ఉంది. 

భద్రకాళి బండ్‍ గోడతో.. 

వరంగల్‍ హంటర్‍ రోడ్‍లో ఉండే ఎన్‍టీఆర్‍, బృందావన్‍కాలనీ, సాయినగర్‍ కాలనీలకు గతంలో భారీ వర్షాలు పడితే వరదనీరు వచ్చేది. అదేటైంలో భద్రకాళి చెరువు పక్కనుంచి సాఫీగా వెళ్లి 12 మోరీల కచ్చా నాలాలో కలిసేవి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భద్రకాళి బండ్‍ ఏర్పాటు చేసిన అధికారులు దీని చుట్టూ పెద్ద ఎత్తున డ్రైనేజీ కట్టారు. దీని గోడ ఎన్‍టీఆర్‍ కాలనీ నుంచి వరద వెళ్లే ప్రాంతంలో అడ్డుగా మారింది. వరదనీరు కిందికి పారే ప్రాంతంలోని శ్మశానవాటిక, ప్రార్థన మందిరం చుట్టూ ప్రహారీ కట్టారు. దీంతో గతంలో మాదిరి వరదనీరు వెళ్లడం లేదు. దీంతో ఎన్‍టీఆర్‍ కాలనీలో వరదనీరు అక్కడే నిలిచింది. మరో వారం పాటు ఎటువంటి వానలు లేకుంటే కొద్దికొద్దిగా ఈ నీరు బయటకు వెళ్లే అవకాశం ఉంది. వర్షం పడితే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. ఇకనైనా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా సరైన డ్రైన్లు, కల్వర్టులు నిర్మించి ముంపు పరిస్థితులు ఏర్పడకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు.

రూ. 250 కోట్లు కేటాయించినా..

రెండేండ్ల కిందట వచ్చిన వరదలతో వరంగల్​నగరం తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వం పునరుద్ధరణ పనుల కోసం రూ.250 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో డ్యామేజ్​ అయిన రోడ్లు, డ్రైన్లు, నాలాలు డెవలప్​ చేయాల్సి ఉంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా కొత్తగా డ్రైన్లు, కల్వర్టులు, ఇతర ఏర్పాట్లు చేయాలి. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. గ్రేటర్​ ఆఫీసర్లు ఈ సీజన్​ ప్రారంభంలోనే నగరం మొత్తం మీద దాదాపు 40 కాలనీలకు ముంపు ప్రమాదం ఉందని గుర్తించారు. ఆఫీసర్లు గుర్తించిన ఆయా కాలనీల్లో ముందస్తు చర్యల్లో భాగంగా డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించడం, పైనుంచి వచ్చే వరద వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

కానీ సమస్యలు గుర్తించడం తప్ప వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. దీంతో వరద నీళ్లు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఇండ్లన్నీ నీట మునగడంతో జనాలు పునరావాస కేంద్రాల బాట పట్టాల్సి వస్తోంది. కాలనీలు నీట మునిగి లీడర్లు, ఆఫీసర్లను అక్కడి ప్రజలు నిలదీసినపుడు మాత్రం అప్పటికప్పుడు టెంపరరీ వర్క్స్​చేపట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. చిన్న పైపులు ఉన్న చోట్లా కాస్త పెద్దవి పెట్టడం, వరద నీరు ఆగుతున్న ప్రాంతాల్లో కచ్చా డ్రైన్లు తవ్వడం  తప్ప పెద్దగా చేస్తున్నదేం కనిపించడం లేదు. సమస్య శాశ్వత నివారణకు ప్లాన్​ చేయకపోవడంతో ఏటా లోతట్టు ప్రాంతాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.