రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తి

రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తి

ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారింది అంటే దానికి నైతిక విలువలు లేని రాజకీయ పార్టీలు, నాయకులే కారణం. రాజ్యాంగాన్ని మార్చాలని అంటాడు ఒక రాజకీయ నాయకుడు. మరొక రాజకీయ నాయకుడు మువన్నెల జెండా మార్చాలి అంటాడు. మరొకడోచ్చి దేశం పేరు మార్చాలంటాడు. దేశంలో రాజకీయ అధికారం చాలాకాలం అల్ప జనుల గుత్తాధిపత్యంలో ఉండటం వల్ల సమాజానికి విఘాతం కలిగించేలా వీళ్లందరూ తయారయ్యారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయానికి, ప్రజాస్వామ్యానికి వీళ్లంతా బద్ధ వ్యతిరేకులు. దేశానికి శత్రువులు వీళ్లే. అప్రజాస్వామిక వాదులైన వీరికి దేశంలో స్థానం లేదు. ప్రజలే సరైన సమయంలో వీరికి బుద్ధి చెబుతారు. అప్పటి వరకు మనమంతా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అదే నిజమైన దేశభక్తికి నిదర్శనం.

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 ఏండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ జెండా పండుగ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. కానీ, రాజ్యాంగ మూలాలను, లక్ష్యాన్ని, గొప్పతనాన్ని మాత్రం మరిచిపోయారని అనిపిస్తోంది. భారత రాజ్యాంగం విశిష్టతను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రస్ మాటలను మనం గుర్తుచేసుకోవాలి. ప్రపంచంలోని రాజ్యాంగాలన్నింటినీ తాను చదివానని, బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ఢీ కొట్టింది కనిపించలేదని, ఒకవేళ ప్రపంచంలోని దేశాలన్నీ భారత రాజ్యాంగాన్ని అమలు చేసినట్లయితే ఐదేండ్లలో ప్రపంచంలోని మొత్తం పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఉగ్రవాదం శాశ్వతంగా అంతరించిపోతాయని అభివర్ణించారు. అదే విధంగా మనదేశంలో కూడా ఒక సందర్భంలో రాజ్యాంగాన్ని కీర్తిస్తూ.. మరొక సందర్భంలో విమర్శిస్తూ రాజకీయ నాయకులు అవకాశవాద రాజకీయం చేస్తూ ఉంటారు. పేద కూలి నుండి కుబేరుని వరకు అందరికీ సమాన హక్కులు కల్పించింది మన రాజ్యాంగం. దానిని కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి అవుతుంది.
అహర్నిశలు శ్రమించి..
ప్రాచీన భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలతో నిండి ఉన్నదే భారత రాజ్యాంగం. అందుకే రాజ్యాంగం అనేది ఒక రివల్యూషనరీ డాక్యుమెంట్, కౌంటర్ ఐడియాలజీ, డాక్యుమెంట్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్, నేషనల్ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్. దేశమంటే ఒక సామాజిక సమ్మేళనం. రాజ్యాంగం కూర్పును మనం గమనిస్తే రెండేండ్ల 11 నెలల 18 రోజులు పట్టిందని అందరికీ తెలుసు. కానీ రాజ్యాంగానికి ఒక రూపు రావటానికి, ఎన్ని నిద్ర లేని రాత్రులు పుస్తక పఠనం కోసం, రాయటానికి ఖర్చు చేశారో ఎవరికీ తెలియదు. రాజ్యాంగ రచనా కాలంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన పూర్తి సమయాన్ని, మేథస్సును రాజ్యాంగ రచనపై కేంద్రీకరించి తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి దేశ సేవలో ముందున్నారు. వాటికి ఎప్పటికీ విలువ కట్టలేం. దేశభక్తిని గుండెల్లో నింపుకుని ఒక పౌరుడిగా దేశం కోసం కఠోర శ్రమ చేసి దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం, ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి తన కుటుంబాన్ని త్యాగం చేసి సొంత ఆస్తి అంటూ ఏమీ లేకుండా దేశం కోసమే మరణించారాయన.
సవరించే వెసులుబాటు కల్పించిన్రు
భారత రాజ్యాంగాన్ని 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు(ప్రస్తుతం 12), 22 భాగాలతో ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగంగా రూపొందించడానికి 11 సమావేశాలు 165 రోజులు జరిగాయి. 114 రోజులు ముసాయిదా రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నారు. 9 డిసెంబర్ 1946న మొట్టమొదటి సమావేశం జరిగితే 29 ఆగస్టు 1947న రాజ్యాంగ రచన సభ, డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకున్నారు. 7,635 ఆర్టికల్స్ సవరణ గూర్చి సభ ముందు ఉంచగా 2,473 ఆర్టికల్స్ చర్చించారు. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని, ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుందని ముందే గమనించి మారుతున్న దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం 2021 అక్టోబర్ వరకు 105 సవరణలు జరిగాయి. కెనడా లాంటి దేశాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ మార్పు చేసే అవకాశం లేదు. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల ఐదు నెలలు పట్టింది. అదే విధంగా ఆస్ట్రేలియాలో 128 ఆర్టికల్స్ తో రూపొందించుకున్న రాజ్యాంగం కోసం తొమ్మిది సంవత్సరాలు పట్టింది. దక్షిణాఫ్రికాలో 153 ఆర్టికల్స్ తో రూపొందించడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. అమెరికా అయితే థామస్ జఫర్సన్ నాయకత్వంలో 7 ఆర్టికల్స్ ను నాలుగు నెలల్లో పూర్తి చేశారు.
రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం
రాజకీయ పార్టీలు, వ్యక్తులు, వారి కోరికలు, రాజకీయాల వంటి అంశాలపైన రాజ్యాంగం పనితీరు ఆధారపడి ఉంటుంది. రాజకీయ పార్టీలు అనుసరించే పద్ధతులు, మార్గాల గురించి తెలియకుండా రాజ్యాంగంపై ప్రకటనలు చేయడం వ్యర్థం. ప్రస్తుత రాజకీయ పార్టీలను వాటి పనితీరును మనం పరిశీలిస్తే అడ్డూ, అదుపూ లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు, దేశ సంపదను లక్షల కోట్లలో స్కామ్ చేసిన వారు హుందాగా దేశం దాటి పోతుంటే పట్టించుకోని వారు.. వలస కూలీలను మాత్రం రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారు. ఒకపక్క నిరుద్యోగం, ఆకలి చావులు, చైల్డ్ లేబర్ మొదలగు సామాజిక రుగ్మతలతో దేశం అల్లాడిపోతోంది. రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు తమ బలహీనతలను ఆసరాగా తీసుకుని రాష్ట్రాల అభివృద్ధి అన్యాక్రాంతం చేస్తున్నాయి. రాష్ట్రాల్లోని పార్టీలు, నాయకులు ప్రజా ప్రయోజనాలను మరచి వారి స్వార్థ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కు ఉన్న 23 పథకాలను రద్దు చేశారు. ఇక తెలంగాణలో పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నామని చెబుతున్న పాలకులు.. వాటిని ఎలక్షన్ స్కీమ్స్ గా మార్చారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వాటిని అమలు చేస్తున్నారు. ఈ విధంగా రాజకీయ పార్టీలు, నాయకుల పనితీరు రాజ్యాంగం ఆశించిన విధంగా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి, లక్ష్యాలకు వ్యతిరేకంగా పని చేస్తుంటే వాటి నుంచి మెరుగైన ఫలితాలను ఎలా ఆశించగలం. ‘‘ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా అది అమలు చేయవలసిన వారు చెడ్డవారైతే అది చెడు చేస్తుంది.. అదే ఒక రాజ్యాంగం ఎంత చెడ్డదైనా అది అమలు చేయవలసిన వారు మంచి వారైతే అది  మంచి చేస్తుంది’’ అన్న అంబేడ్కర్ మాటలు ఇప్పటికీ అక్షర సత్యాలుగా ఉన్నాయి.
ప్రజాస్వామ్యం అసలు ఉందా?
ప్రస్తుతం మనదేశంలో మనుషులు ప్రేమించుకోవటం నిషిద్ధం, కట్టుకునే బట్టలపై ఆంక్షలు, తినే అన్నంపై పెత్తనం, మతంపై ఆధిపత్యం, అధికారం, ఆర్థిక వనరులపై గుత్తాధిపత్యం, కులాల మధ్య అంతరాలు పెంచుతూ చేస్తున్న పనులు చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది. ప్రజాస్వామ్యం ఒక రూపంగా కాక ఒక వాస్తవంగా కూడా ఉండాలంటే మొదటగా సాంఘిక, ఆర్థిక లక్ష్యాలను సాధించాలి. ఇందుకోసం మనం రాజ్యాంగబద్ధ పద్ధతులకు కట్టుబడి ఉండాలి. రక్తపాత పద్ధతులను వదిలి వేయాలి. జాన్ స్టువర్ట్ మిల్ చెప్పినట్లు స్వతంత్ర్యాన్ని ఎటువంటి గొప్ప వ్యక్తి పాదాల వద్దా ఉంచకూడదు. అదే విధంగా అధికారం ఇవ్వకూడదు. అందువల్ల ఆ వ్యక్తి సంస్థలను/వ్యవస్థలను మార్చి వేసే అవకాశం ఉందని అంటాడు. అదే విధంగా  ఐరిష్ దేశ భక్తిపరుడు డానియల్ కనేల్ మాట్లాడుతూ ఏ వ్యక్తి తన గౌరవాన్ని కోల్పోయి, ఏ స్త్రీ తన శీలాన్ని కోల్పోయి, ఏ దేశము తన స్వతంత్ర్యాన్ని కోల్పోయి కృతజ్ఞతలు చెల్లించకూడదు అంటారు.
రాజకీయ భక్తి.. నాయకారాధన మంచిది కాదు
రాజకీయభక్తి, నాయకారాధన దిగజారుడుతనానికి, నియంతృత్వానికి దారితీస్తుంది అంటారు అంబేద్కర్. సామాజిక ప్రజాస్వామ్య పునాదులు లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనజాలదు అంటాడు. సామాజిక ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి జీవన విధానంగా మార్చుకోవాలి. కులాలు, జాతికి అవి వ్యతిరేకం. ఒక జాతి ఏర్పడినప్పుడే సౌభ్రాతృత్వం సాధ్యమవుతుంది. సౌభ్రాతృత్వం లేని స్వేచ్ఛ, సమానత్వం గోడకు వేసిన సున్నం లాంటిది. దేశంలో ఆర్థిక, సాంఘిక న్యాయం ఉండాలంటే పరిశ్రమలను, భూమిని జాతీయం చేయాలని అంబేద్కర్ రాజ్యాంగ సభ ప్రసంగంలో సూచించారు. ప్రజాస్వామ్యం అనే ఒక పచ్చని చెట్టు ఎక్కడపడితే అక్కడ ఎదగదు. ఇంగ్లాండ్, అమెరికాలో అది పరిఢవిల్లింది. ఫ్రాన్స్ లో ఒక మేరకు అభివృద్ధి చెందింది. ఎన్నో దేశాలలో బహిరంగంగా ఖూనీ అయింది. సైనిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రజాస్వామ్యం విజయం సాధించాలంటే సమాజంలో ఏటువంటి అసమానతలు లేకపోవటం, ప్రతిపక్షాల ఉనికిని గుర్తించాలి. మైనారిటీల మీద మెజారిటీ పెత్తనం ఉండకూడదు. సమాజంలో నైతిక విలువలను పెంపొందిస్తూ అన్యాయానికి స్పందించే లక్షణాన్ని కలిగి ఉండాలి. అందుకే లాస్కీ మహనీయుడు ప్రజాస్వామ్యానికి నైతిక విలువలు అనేవి ఆయువుపట్టు అని, విలువలు చెదిరిపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది అంటాడు. 

దుష్టశక్తులను ఎదుర్కోవాలి
దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదన్నది వాస్తవం. రాజ్యాంగం మార్పు అయినట్లయితే దేశంలో  సార్వభౌమత్వం కోల్పోయి స్వతంత్ర్యం ప్రమాదంలోకి నెట్టివేయబడవచ్చు. రాజ్యాంగాన్ని సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చి దేశ విభజనకు దారి తీసి రెండు మూడు దేశాలుగా విడిపోయే అవకాశం ఉండవచ్చు. దేశ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యానికి బీటలువారి సమైక్యతను దెబ్బతీయవచ్చు. మానవ మనుగడే ప్రమాదకరంగా మారిపోతుంది. ఇటువంటి ఆలోచనను విరమించుకుంటే మంచిది. అంతేకాకుండా ఇంతకన్నా గొప్ప రాజ్యాంగాన్ని మనం ఎవరి నుంచీ ఆశించలేం. ఎంతో కష్టపడి సాధించిన ఈ హక్కులను చేతనైతే ముందుకు తీసుకుని వెళ్ళండి లేదా అక్కడే వదిలి వేయండి అంతేకానీ వెనుకకు మాత్రం లాగవద్దు అన్న బాబా సాహెబ్ మాటలు తిరిగి ప్రతి భారతీయుడు గుర్తుచేసుకోవాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే బాధ్యతగా  తీసుకుని ఈ మార్గంలో ఎదురయ్యే దుష్టశక్తులను ఎదుర్కోవడమే దేశ సేవ. ఇంతకంటే వేరే మార్గమే లేదు.

- డా.బోరుగడ్డ సుబ్బయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ